Politics

అసెంబ్లీని అబద్ధాలు బండబూతులు మాట్లాడే టందుకు ఉపయోగిస్తున్నారు

అసెంబ్లీని అబద్ధాలు బండబూతులు మాట్లాడే టందుకు ఉపయోగిస్తున్నారు

జీతాలకే మీ దగ్గర డబ్బుల్లేవు.. వికేంద్రీకరణా?: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

విజయవాడ : కోర్టు పరిధి నుంచి తప్పించుకునేందుకే ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఈ విషయంలో సీఎంకు చిత్తశుద్ధి లేదని చెప్పారు. విజయవాడ భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆ మాట అన్నారో లేదో ఆత్మపరిశీలన చేసుకోండి

రాజధాని ఇక్కడే ఉంటుందని ప్రతిపక్ష నేతగా జగన్‌ చెప్పారని, ఆ మాట అన్నారో లేదో సీఎం, మంత్రులు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సోము వీర్రాజు హితవు పలికారు. ఆత్మను టేబుల్‌పై పెట్టి సభలో మాట్లాడారని ఆయన ఎద్దేవా చేశారు. అంతరాత్మ సాక్షిగా సభలో అబద్ధాలు చెప్పారని ఆక్షేపించారు. శాసనసభను అబద్ధాలు, బండబూతులు, వ్యక్తిగత జీవితాలు మాట్లాడేందుకు వినియోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పీకర్‌ ఆలోచించాలన్నారు.

అసలు మీరేం చేశారో చెప్పండి

రాయలసీమ నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినా అక్కడి అభివృద్ధిని ఎవరూ పట్టించుకోలేదని వీర్రాజు అన్నారు. కోర్టు పెడితే రాజధాని అవుతుందా? అని ప్రశ్నించారు. సీమ అభివృద్ధిపై జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే హంద్రీనీవా, తెలుగు గంగ ప్రాజెక్టులను ఎందుకు పూర్తిచేయలేదని నిలదీశారు. పరిపాలనా వికేంద్రీకరణ చేస్తామంటున్న రాష్ట్ర ప్రభుత్వం వద్ద అసలు దానికోసం నిధులున్నాయా అని ప్రశ్నించారు. రోజూ ప్రభుత్వాన్ని నడిపేందుకు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే డబ్బుల్లేవని, అలాంటప్పుడు మీరేం చేయగలుగుతారని సోము వీర్రాజు నిలదీశారు. ఈ విషయంలో ప్రజల్ని మళ్లీ తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం గుంటూరుకు ఎయిమ్స్‌, తిరుపతిలో ఐఐఎం, కర్నూలు, అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, విశాఖలో పెట్రోకాంప్లెక్స్‌ ఏర్పాటు చేసి అభివృద్ధి చేసిందని, అసలు మీరేం చేశారో చెప్పాలని వైసీపీ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.