DailyDose

TNI నేటి తాజా వార్తలు 26-Nov-2021

TNI నేటి తాజా వార్తలు 26-Nov-2021

* హైదరాబాద్

దిల్ షుఖ్ నగర్ అష్టలక్ష్మి దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ కవిత.

పాల్గొన్న సీఎం శ్రీ కేసీఆర్ గారి సతీమణి శ్రీమతి శోభ గారు,మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు.

* తిరుపతి శ్రీ కృష్ణనగర్ లో వింత సంఘటన చోటు చేసుకుంది. భూమిలో నుంచి పైకి వచ్చిన 25 అడుగుల తాగునీటి వాటర్ ట్యాంక్, 18 cement వరలతో (cement rings) భూమిలో నిర్మించిన వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా పైకి వచ్చిన వైనం. భూమి లోపలికి దిగి వాటర్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా జరిగిన సంఘటన, చిన్నపాటి గాయాలతో సురక్షితంగా బయటపడిన మహిళ నిటారుగా నిలిచిన వాటర్ ట్యాంక్ ఈ వింతను చూడటానికి తరలివస్తున్న స్థానికులు. ఏమి జరుగుతుందోనని ఒక్కసారిగా భయాందోళనకు గురైన స్థానికులు. భారీ వర్షాల ధాటికి ఈ వింత జరిగుంటుందని భావిస్తున్నారు.

* అమరావతి

అసెంబ్లీలో సభ్యుల ఫోన్ల అనుమతికి చెక్.

సభలో సభ్యులు ఫోన్లు తీసుకుని రావడానికి ఇక నుంచి అనుమతి లేదని హౌస్ లో ప్రకటించిన స్పీకర్ తమ్మినేని.

చంద్రబాబు ఎపిసోడ్ సమయంలో టీడీపీ సభ్యులు సభలో వీడియో రికార్డు చేయడం వివాదాస్పదమైన నేపథ్యంలో తాజా నిర్ణయం.

* ఏపీ అసెంబ్లీలో తనపై చేసిన అనుచిత వ్యాఖ్యాలకు నారా భువనేశ్వరి స్పందన.

* జెనివా

వ్యాక్సిన్ వేయించుకున్నా మాస్క్ ధరించాల్సిందే

డబ్ల్యుహెచ్ వో డైరెక్టర్ జనరల్

★ కరోనా మహమ్మారి ముగిసిపోయిందని, వ్యాక్సిన్ తీసుకున్నవారికి కరోనా వైరస్ సోకదని భావిస్తున్నారని డబ్ల్యూహెచ్‎వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ అన్నారు. కానీ అది తప్పని చెప్పారు.

★ ఐరోపా అంతటా కోవిడ్ -19 కేసుల పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

★ టీకా సంబంధం లేకుండా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రజలను కోరారు.

★ వ్యాక్సిన్‌లు ప్రాణాలను కాపాడతాయి.

★ తీవ్రమైన వ్యాధి, మరణాల ప్రమాదాన్ని మాత్రమే తగ్గిస్తాయని డబ్ల్యుహెచ్ వో చీఫ్ పేర్కొన్నారు.

★ ‘మీరు టీకాలు వేసినప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం కొనసాగించాలని చెప్పారు. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, గుంపులుగా ఉండకపోవడం, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ఇళ్ల లోపల బాగా వెంటిలేషన్ ఉంచుకోవాలి’ అని టెడ్రోస్ చెప్పారు.

★ ‘వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల కోవిడ్-19 మహమ్మారిని రాదనే తప్పుడు భద్రతా భావం గురించి మేము ఆందోళన చెందుతున్నాము. టీకాలు ప్రాణాలను కాపాడతాయి, కానీ అవి కరోనాను పూర్తిగా అడ్డుకోవు.’ అని టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ట్వీట్ చేశారు.

★ దక్షిణాఫ్రికా, బోట్స్వానాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కోవిడ్ -19 వేరియంట్ గురించి చర్చించడానికి డబ్ల్యుహెచ్ వో ఈ శుక్రవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది.

★ అంతకుముందు, బోట్స్వానాలో 32 వేరియంట్లు ఉన్న కరోనా వైరస్ జాతి కనిపించడంపై యూకే శాస్త్రవేత్తలు హెచ్చరించారని యూకే మీడియా నివేదికలు తెలిపాయి.

★ అన్ని ఇతర కోవిడ్-19 వేరియంట్‌ల కంటే స్ట్రెయిన్ స్పైక్ ప్రోటీన్‌లో ఎక్కువ మార్పులను కలిగి ఉందని రష్యన్ వార్తా సంస్థ నివేదించింది.

★ దక్షిణాఫ్రికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కూడా దక్షిణాఫ్రికాలో కొత్త జాతి కనుగొన్నట్లు ధృవీకరించింది.

* కృష్ణా – మైలవరం :

మైలవరం నియోజకవర్గంలో వైసీపీకి షాక్.

★ వైసీపీ మైలవరం మండల అధ్యక్షుడి పదవికి, ఏఏంసి చైర్మన్ పదవికి పామర్తి శ్రీనివాసరావు రాజీనామా.

★ రెండు పదవులకు రాజీనామా చేస్తూ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు లేఖలు పంపిన పామర్తి.

★ గత కొంతకాలంగా ఎమ్మెల్యే వసంత వైఖరి పై అసంతృప్తిగా ఉన్న పామర్తి.

★ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మైలవరం పార్టీ ఇంచార్జి నారాయణ కు, పామర్తి మధ్య గొడవలు.

★ కొండపల్లి మున్సిపాలిటీ ఓటమితో జోగి రమేష్, వసంత కృష్ణ ప్రసాద్ ల మధ్య పెరిగిన దూరం.

★ జోగి వర్గంగా పామర్తికి పేరు.

★ అనూహ్యంగా రాజీనామా చేసిన బి సి నాయకుడు పామర్తి శ్రీను.

* చంద్రబాబు సంస్కారానికి నా నమస్కారం : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.

అమరావతి : విపత్తును విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ, రాజకీయాల కోసం బురద జల్లుతున్నారన్నారు. ‘‘నేను గాల్లోనే వచ్చి గాల్లోనే పోతానని విమర్శించారు. శాశ్వతంగా కనుమరుగైపోతానని ప్రతిపక్ష నేత అన్నారు. చంద్రబాబు సంస్కారానికి నా నమస్కారం. వరద సహాయక చర్యలు ఆగకూడదనే నేను వెళ్లలేదు. సీనియర్‌ అధికారుల సూచనల మేరకే ఆగిపోయా. నేను వెళ్లడం కన్నా బాధితులకు సహాయం అందడం ముఖ్యం. జిల్లాకొక సీనియర్‌ అధికారిని పంపాం. మంత్రులు, ఎమ్మెల్యేలను అక్కడే ఉండమన్నాం. నేను ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించాను. సహాయక చర్యల తర్వాత కచ్చితంగా పర్యటిస్తా. హుద్‌హుద్‌, తీత్లీ తుఫానులను తానే ఆపానంటారు చంద్రబాబు. అప్పట్లో బాధితులకు అరకొర సహాయం కూడా చేయలేకపోయారని’’ సీఎం జగన్‌ అన్నారు. ‘‘ఇటీవల కురిసిన వర్షాలకు 3 జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగింది. వానలు రాయలసీమను ముంచెత్తడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. నీళ్లు లేక అలమటించే రాయలసీమలో అనూహ్య వరదలు సంభవించాయి. కొన్ని చోట్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగింది. నష్టం వివరాలు ఎక్కడా దాచిపెట్టడం లేదు. సహాయం అందించడంలో ఎక్కడా వెనకడుగు వేయలేదని’’ సీఎం అన్నారు. ‘‘రిజర్వాయర్ల భద్రత పర్యవేక్షణకు సీఎస్‌ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తాం. నీటి నిల్వల పర్యవేక్షణకు కొత్త సాంకేతిక విధానాన్ని తీసుకొస్తాం. గతంలో వరదలు వస్తే చంద్రబాబు ఏ ఒక్కరిని ఆదుకోలేదు. ప్రభుత్వాన్ని ఎలా డ్యామేజ్‌ చేయాలన్నదే ఈనాడు పత్రికల్లో రాస్తారు. వరద ముంపు ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నాం. మృతుల కుటుంబాలకు తక్షణ పరిహారంగా రూ.5లక్షలు అందించాం. వరద ప్రభావిత జిల్లాల్లో 100 శాతం విద్యుత్‌ పునరుద్ధరణ చేశామని’’ సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

* శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా జకియా

అమరావతి : శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ పదవి తొలిసారి మైనారిటీ మహిళకు దక్కింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌ డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమెను స్వయంగా కూర్చీ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జకియా మాట్లాడుతూ. ఈ గౌరవప్రదమైన స్థానానికి తనను అర్హురాలుగా గుర్తించి మంచి ఉద్దేశంతో పదవి ఇచ్చినందుకు సీఎం జగన్‌కు రుణపడి ఉంటానన్నారు.

సీఎం జగన్‌ మహిళా పక్షపతి : మహిళల సంక్షేమ కోసం అనే పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్‌ మహిళా పక్షపతి అని నిరూపించుకున్నారని ఆమె కొనియాడారు. దేశానికే మన రాష్ట్రం ఆదర్శంగా ఉందన్నారు. ఒక సాధారణ గృహిణిగా ఉన్న తనకు సముచిత స్థానాన్ని కల్పించినందుకు మైనార్టీలందరూ హర్షించారని ఆమె పేర్కొన్నారు. మైనార్టీల సామాజిక, ఆర్టిక, రాజకీయ ఎదుగుదలకు తోడ్పడుతానని ఆమె భరోసా ఇ‍చ్చారు. కాగా వైఎస్సార్‌ జిల్లా రాయచోటిలో మైనార్టీ వర్గాలకు ఎమ్మెల్సీ స్థానం ఇస్తానని హామీ ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌ తన మాట నిలబెట్టుకున్నారు. ఈక్రమంలో రాయచోటికి చెందిన జకియా ఖాన్మ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. మరో అడుగు ముందుకు వేసి ఆమెకు శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించారు.
జకియా ఖానమ్‌ నేపథ్యమిది.
పేరు: మయాన జకియా ఖానమ్‌
భర్త: దివంగత ఎం.అఫ్జల్‌ ఖాన్, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌
సంతానం: ముగ్గురు కుమార్తెలు,
ఒక కుమారుడు
చదువు: ఇంటర్మీడియెట్‌
పుట్టిన తేది: జనవరి 01, 1971
స్వస్థలం: రాయచోటి, వైఎస్సార్‌ జిల్లా
రాజకీయ నేపథ్యం: ఎమ్మెల్సీ (ఆగస్టు 20, 2020 నుంచి)

* అసెంబ్లీకి కాగ్ నివేదిక : రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి, వ‌న‌రుల నిర్వహ‌ణపై తీవ్ర అభ్యంత‌రాలు

అమ‌రావ‌తి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్‌ రూపొందించిన నివేదిక శుక్రవారం అసెంబ్లీకి వచ్చింది. 2019-20 ఆర్థిక సంవ‌త్సరానికి చెందిన రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై నివేదిక సభ ముందుకు వచ్చింది. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి, వ‌న‌రుల నిర్వహ‌ణపై కాగ్ తీవ్ర అభ్యంత‌రాలు వ్యక్తం చేసింది. ఆర్థిక వ్యవహారాల్లో ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవ‌హ‌రించింద‌ని కాగ్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన అనుబంధ ప‌ద్దుల‌ను ఖ‌ర్చు చేసి. త‌రువాత జూన్ 2020లో శాస‌న స‌భ‌లో ప్ర‌వేశ పెట్టారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని కాగ్ పేర్కొంది. రాజ్యాంగ నిబంధనలకు వ్య‌తిరేకంగా ఆర్థిక వ్య‌వ‌హారాలు జ‌రిగాయంది. చ‌ట్టస‌భ‌ల ఆమోద ప్ర‌క్రియ‌ను, బ‌డ్జెట్ మీద అదుపును ప్రభుత్వం బ‌ల‌హీన‌ప‌రిచిందని పేర్కొంది. ప్ర‌జా వ‌న‌రుల వినియోగ నిర్వ‌హ‌ణ‌లో ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణా రాహిత్యాన్ని ప్రోత్స‌హించిందని, శాస‌న స‌భ ఆమోదించిన కేటాయింపుల కంటే అధికంగా ఖ‌ర్చు చేసే సంద‌ర్భాలు పున‌రావృతం అవుతున్నాయని పేర్కొంది. అద‌న‌పు నిధులు ఆవ‌శ్య‌కమని భావిస్తే. శాస‌న స‌భ నుంచి ముంద‌స్తు ఆమోదం పొందేలా చూసుకోవాలని కాగ్ పేర్కొంది. 2018 -19 ఆర్థిక సంవ‌త్స‌రంతో పోల్చితే 2019-20లో రెవెన్యూ రాబ‌డులు 3.17 శాతం త‌గ్గాయంది. కొత్త సంక్షేమ ప‌థ‌కాల వ‌ల్ల రెవెన్యూ ఖ‌ర్చులు 6.93 శాతం పెరిగాయంది. 2018-19 నాటి రెవెన్యూ లోటును మించి 2019-20కి రెవెన్యూ లోటు 90.24 శాతం మేర పెరిగిందని పేర్కొంది. 2018-19 నాటితో పొల్చితే 2019-20 నాటికి రూ. 32,373 కోట్ల మేర బ‌కాయిల చెల్లింపులు పెరిగాయంది. చెల్లించాల్సిన బ‌కాయిల వివ‌రాల‌ను బ‌డ్జెట్ ప‌త్రాల్లో స‌రిగా చూప‌లేదని, శాన‌స వ్య‌వ‌స్థను నీరు గార్చేలా నిధుల నిర్వ‌హ‌ణ ఉంద‌ని కాగ్ నివేదిక‌లో పేర్కొంది.

* మరోమారు రియల్ హీరో సోనూసూద్ నెల్లూరుకు స్నేహహస్తం

పేదలకు నిత్యవసర వస్తువులు

గతంలో ఆక్సిజన్ ప్లాంట్ అందించి ఉదారత

నెల్లూరు:- ఆపద సమయంలో ఎప్పుడు తానున్నానంటూ అందించే రియల్ హీరో సోనూ సూద్ మరోమారు తన ఉదారతను చాటుకున్నారు. భారీ వర్షాలు వరదల ధాటికి నెల్లూరు జిల్లా అతలాకుతలం కావడంతో పాటు పలువురు పేద ప్రజలు నష్టపోవడంతో సోనూసూద్ తన వంతుగా సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. నెల్లూరు జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారికి సుమారు 1500 కుటుంబాలకు నిత్యవసర వస్తువులు అందజేయాలన్న ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆమేరకు నిత్యవసర వస్తువులను నెల్లూరు జిల్లాకు పంపనున్నారు. శనివారం పంపిణీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని సోనూసూద్ మిత్రులు సమీర్ ఖాన్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాతో పాటు తిరుపతి కి కూడా సోనూసూద్ సహాయం చేయనున్నారు. నెల్లూరు జిల్లాకు ఇటీవల ఆక్సిజన్ ప్లాంట్ అందించిన సోనూసూద్ వరదల్లో సహాయం లో మరోసారి తన వంతుగా సహాయం చేసేందుకు ముందుకు రావడం ఆయన ఉదారతకు అద్దం పడుతోంది.

* రఘరామను పేరు పెట్టి పిలిచి భుజం తట్టిన ప్రధాని మోడీ న్యూఢిల్లీ: పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఎంపీ రఘురామకృష్ణరాజును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆప్యాయంగా పలకరించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ రఘురామకృష్ణ రాజు హాజరయ్యారు. ముందు వరసలో కూర్చున్న ఎంపీ రఘురామను ముందుగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పలకించారు. ఆ తరువాత అటుగా వచ్చిన ప్రధాని మోదీ. రఘురామకృష్ణ రాజును పేరు పెట్టి పిలిచి కొంచెం సేపు నిలబడి భుజం తట్టి వెళ్లారు.

* నారా భువనేశ్వరి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఓ వైపు వరదలపై విపక్షాలు ఆందోళన బాట పడితే. మరో వైపు నారా భువనేశ్వరి అంశం రచ్చరచ్చ చేస్తోంది. ఇటీవల ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తన భార్యను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాలో సమావేశంలో మాట్లాడుతూనే వైసీపీ తీరుతో ఆవేదనకు గురైన ఆయన వెక్కి వెక్కి ఏడ్చారు. దీంతో నారా కుటుంబానికి అండగా సినిమా ఇండస్ట్రీ, నందమూరి కుటుంబం, ఇతర ప్రముఖులు అంతా మద్దతుగా నిలిచారు. అయితే ఈ ఘటనపై ఇప్పటి వరకు అందరూ స్పందించారు కానీ. నారా భువనేశ్వరి నేరుగా ఎక్కడా ఈ అంశాన్ని ప్రస్తావించలేదు. తాజాగా ఆమె అసెంబ్లీ ఘటనపై తొలిసారి స్పందించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఆమె ప్రత్యేకంగా ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇతరుల వ్యక్తిత్వాన్ని ఎవరూ కించపరచొద్దని.. వారి గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరించొద్దని నారా భువనేశ్వరి తన ప్రకటనలో కోరారు. “ఆంధ్రప్రదేశ్ శాసన సభలో నాపై అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తంచేసిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నాకు జరిగిన అవమానాన్ని మీ తల్లికి, తోబుట్టువుకు, కూతురికి జరిగినట్టుగా భావించి నాకు అండగా నిలబడటం నా జీవితంలో మరిచిపోలేను. చిన్నతనం నుంచి అమ్మగారు, నాన్నగారు మమ్మల్ని విలువలతో పెంచారు. నేటికీ మేము వాటిని పాటిస్తున్నాము. కష్టాల్లో లేదా ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడాలి. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదు. నాకు జరిగిన ఈ అవమానం.. మరెవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నాను” అని నారా భువనేశ్వరి తన లేఖలో ప్రస్తావించారు.