Movies

హ్యాట్రిక్ హిట్ కొట్టిన బాలకృష్ణ బోయపాటి కాంబో

హ్యాట్రిక్ హిట్ కొట్టిన బాలకృష్ణ బోయపాటి కాంబో

క‌థేమిటంటే: ముర‌ళీకృష్ణ (బాల‌కృష్ణ‌) ఫార్మరే కాదు, రీ ఫార్మర్ అని చెబుతుంటారు అనంత‌పురం ప్రజ‌లు. ఫ్యాక్షనిజం బాట ప‌ట్టిన ఎంతోమందిని దారి మ‌ళ్లించి మార్పుకి శ్రీకారం చుడ‌తాడు. చుట్టుప‌క్కల ప్రాంతాల్లో పాఠ‌శాల‌లు, ఆస్పత్రుల్ని క‌ట్టించి ప్రజ‌ల‌కి సేవ చేస్తుంటాడు. అది చూసే ఆ జిల్లాకి కొత్తగా వ‌చ్చిన క‌లెక్టర్ శ‌ర‌ణ్య (ప్రగ్యాజైస్వాల్) ముర‌ళీకృష్ణపై మ‌న‌సు ప‌డుతుంది. ఆయ‌న్ని మ‌నువాడుతుంది. ఆ ప్రాంతంలో వ‌ర‌ద రాజులు (శ్రీకాంత్) మైనింగ్ మాఫియాని న‌డుపుతుంటాడు. యురేనియం త‌వ్వకాలతో చిన్నారుల ప్రాణాల‌కి ముప్పు ఏర్పడుతుంది. మైనింగ్ మాఫియా భ‌ర‌తం ప‌ట్టేందుకు రంగంలోకి దిగిన ముర‌ళీకృష్ణకి ఎలాంటి సవాళ్లు ఎదుర‌య్యాయి? వ‌ర‌ద రాజులు వెన‌క ఉన్న మాఫియా లీడ‌ర్ ఎవ‌రు? చిన్నప్పుడే ఇంటి నుంచి వెళ్లిపోయిన ముర‌ళీకృష్ణ తోడ బుట్టిన శివుడు (బాల‌కృష్ణ‌) ఎక్కడ పెరిగాడు? ఊహ తెలియ‌క‌ముందే వారిద్దరూ విడిపోవ‌డానికి కార‌ణ‌మేమిటి? మ‌ళ్లీ ఎలా క‌లిశారు? ముర‌ళీకృష్ణకి, కుటుంబానికి శివుడు ఎలా సాయం చేశాడన్నదే మిగ‌తా క‌థ‌.

ఎవ‌రెలా చేశారంటే: బాల‌కృష్ణ వ‌న్ మేన్ షోలా ఉంటుందీ చిత్రం. ఆయ‌న సంభాష‌ణ‌లు విన్నాక, ఆయ‌న చేసే విన్యాసాలు చూశాక బాల‌కృష్ణ మాత్రమే చేయ‌గ‌ల క‌థ ఇద‌నిపిస్తుంది. జై బాల‌య్య పాట‌లో ఆడిపాడిన తీరు అభిమానుల్ని అల‌రిస్తే, ఆయ‌న చేసిన పోరాటాలు మ‌రో స్థాయిలో ఉంటాయి. బాల‌కృష్ణ రెండు పాత్రల్లో విజృంభించిన‌ప్పటికీ.. ఇందులోని మిగ‌తా పాత్రల‌కి కూడా అంతే ప్రాధాన్యం ఉంది. క‌థానాయిక ప్రగ్యా జైస్వాల్‌తోపాటు పూర్ణ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు కూడా సినిమాలో కీల‌క‌మైన‌వే. ‘లెజెండ్‌’తో జ‌గ‌ప‌తిబాబుని ప్రతినాయ‌కుడిగా మార్చిన బోయ‌పాటి శ్రీను, ఈ సినిమాతో శ్రీకాంత్‌ని అలాంటి పాత్రలోనే చూపించారు. వ‌ర‌ద రాజులుగా క్రూర‌మైన పాత్రలో ఆయ‌న క‌నిపిస్తారు. బాల‌కృష్ణతో తొలిసారి ఎదురు ప‌డే స‌న్నివేశం, అఘోరాతో త‌ల‌ప‌డే స‌న్నివేశాలు ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఉంటాయి. జ‌గ‌ప‌తిబాబు, కాల‌కేయ ప్రభాక‌ర్ త‌దిత‌రులు పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు. శ‌క్తిస్వరూపానంద స్వామిగా క‌నిపించిన ప్రతినాయ‌కుడు కూడా త‌న‌దైన ప్రభావం చూపించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ముఖ్యంగా త‌మ‌న్ సంగీతం సినిమాని మ‌రో స్థాయికి తీసుకెళ్లింది. అఘోరా నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాల్లో నేప‌థ్య సంగీతం కోసం ఆయ‌న ప‌డిన క‌ష్టం ఎలాంటిదో అర్థమ‌వుతుంది. జైబాల‌య్య‌, అఖండ, అడిగా అడిగా.. పాట‌లు బాగున్నాయి. రామ్‌ప్రసాద్ కెమెరా ప‌నిత‌నం, ఎం.ర‌త్నం మాట‌లు చిత్రానికి ప్రధాన బ‌లాలుగా నిలిచాయి. రామ్‌ల‌క్ష్మణ్‌, స్టంట్‌ శివ పోరాట ఘ‌ట్టాలు మెప్పిస్తాయి. బాల‌కృష్ణ – బోయ‌పాటి శ్రీను క‌ల‌యిక ఎందుకు ప్రత్యేక‌మో ఈ సినిమా మ‌రోసారి స్పష్టం చేస్తుంది. మాస్ నాడి తెలిసిన బోయ‌పాటి త‌నదైన మార్క్‌ని ప్రద‌ర్శిస్తూ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూనే, భావోద్వేగాలు కూడా బ‌లంగా పండేలా సినిమాని తీర్చిదిద్దారు. నిర్మాణ విలువ‌లు ఉన్నతంగా ఉన్నాయి.

బ‌లాలు
+ బాల‌కృష్ణ న‌ట‌న‌
+ పోరాట ఘ‌ట్టాలు
+ సంగీతం
+ భావోద్వేగాలు… ద్వితీయార్థం

బ‌ల‌హీన‌త‌లు
– కొన్ని పోరాట ఘ‌ట్టాలు సుదీర్ఘంగా సాగ‌డం

చివ‌రిగా: బాల‌కృష్ణ ‘విజృంభ‌ణ’ అఖండం.