DailyDose

భారత్ లో ఐటీ కి ఉజ్వల భవిష్యత్తు

భారత్ లో ఐటీ  కి ఉజ్వల భవిష్యత్తు

ఐటీకి మంచిరోజులు:

కరోనా కాలం ప్రారంభమైనప్పటి నుంచీ కొన్ని వ్యవస్థలు కుదేలయ్యాయి. వాటిని మరమ్మత్తులు చేసే పనిలో ఆ యా రంగాలవారు ఉన్నారు. కొన్ని రంగాలు ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్నాయి. ఒక పక్క ఒమిక్రాన్ వైరస్ వార్తలు కలకలం సృష్టిస్తున్నా, ఎడారిలో ఒయాసిస్ లాగా అభివృద్ధి దిశగా కొన్ని వ్యవస్థలు పునఃప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాయి. అందులో భారతీయ ఐటీ రంగం ముందు వరుసలో ఉంది. డిసెంబర్ నుంచి ‘వర్క్ ఫ్రం హోమ్’ను సడలించారు.

కార్యాలయాలకు హాజరయ్యేవారి సంఖ్య ఇంకా చాలా తక్కువగానే నమోదవుతోంది.ఎక్కువమంది ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి వార్తల నేపథ్యంలో, వర్క్ ఫ్రం హోమ్ విధానం ఇంకా కొన్నాళ్ళు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా, వచ్చే మూడేళ్లు ఐటీ రంగం మూడు పువ్వులు ఆరుకాయలుగా విలసిల్లే వాతావరణం ఏర్పడనుందని తాజా నివేదికలు చెబుతున్నాయి. అనేక రంగాలు డిజిటలైజేషన్, క్లౌడ్ కు అనుగుణంగా సాంకేతిక వ్యవస్థలను మార్పులు చేసుకొనే పనిలో పడ్డాయి.

ఐటీ సేవల వ్యయాలు గతంలో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరుకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదంతా భారత ఐటీ రంగానికి కలిసొచ్చే కాలం. రాబోయే మూడేళ్ళల్లో ఐటీ సేవలకు మరింత గిరాకీ పెరగనుంది. ఈ దిశలో, పలు కంపెనీలు నియామకాలను ద్విగుణీకృతం చేస్తున్నాయి. కొత్తగా డిగ్రీ పుచ్చుకొని బయటకు వస్తున్నవారికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. పలు సంస్థలు ‘రిక్రూట్ మెంట్ డ్రైవ్’ ను నిర్వహిస్తున్నాయి. ఈ ప్రభావంతో,ఉద్యోగకల్పనలో ఐటీ రంగం ప్రముఖ భూమిక పోషించనుంది. వచ్చే ఏడాది సుమారు 7.63లక్షల కోట్ల రూపాయల వ్యయం ఐటీ రంగంలో జరగనుందని సమాచారం. 2020 కంటే 2021లో 10.8శాతం ఐటీ సేవల వ్యయం పెరిగింది.

ఇది 2022లో గణనీయంగా పెరిగే శకునాలు కనిపిస్తున్నాయని మార్కెట్ లో వినపడుతోంది. కరోనా ముందు కాలానికి రెట్టింపు స్థాయిలో ఐటీ సేవల వినియోగం 2022లో జరగనుంది. ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా నిపుణులను నియమించుకోవాలంటే ఎక్కువ వ్యయాన్ని వెచ్చించాల్సి ఉంది. ఈ సమయంలో,డిమాండ్ కు అనుగుణంగా బడ్జెట్ ను రూపకల్పన చేసుకోవడం అవసరం. సాఫ్ట్ వేర్,హార్డ్ వేర్ రెండు రంగాల్లోనూ వృద్ధి చోటుచేసుకోనుంది. ఐటీ వ్యయంలో దాదాపు,40శాతంకు పైగా వాటా హార్డ్ వేర్ కే ఉంటుంది.

కార్యాలయాలకు వచ్చి కొందరు,ఇంటి నుంచి కొందరు పనిచేసే హైబ్రిడ్ విధానమే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐటీ సంస్థలు ఉత్పాదకతపై దృష్టిని పెంచుతున్నాయి. క్యాంపస్ రిక్రూట్మెంట్స్ బాగా పెరగనున్నాయని సమాచారం. టీ సీ ఎస్,ఇన్ఫోసిస్,హెచ్ సీ ఎల్ టెక్ వంటి సంస్థలు ఫ్రెషర్స్ ను నియమించుకోవడంపై ఇప్పటికే దృష్టి సారించాయి. అంతర్జాతీయ కంపెనీలు వెచ్చించే మొత్తం 2022లో గణనీయంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఐటీ రంగంలో భారతీయులకు ఎంతో గుర్తింపు ఉంది.

ప్రతిభ,ప్రావీణ్యం పరంగా మనవాళ్లే అందరి కంటే ముందున్నారు. ఈ నేపథ్యంలో,మన సంస్థలు రాబోయే కాలంలో అధిక లాభాలను ఆర్జించనున్నాయి. క్లౌడ్,డిజిటలైజేషన్ వైపు సాంకేతికతను మార్చుకొనే సంస్థలు భారత టెక్ కంపెనీల వైపే మొగ్గు చూపిస్తాయని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. కమ్యూనికేషన్,సైబర్ సెక్యూరిటీ,ఆరోగ్యం మొదలైన రంగాల నుంచి ఎక్కువ డిమాండ్ ఉంది.డిజిటలైజేషన్ వైపు ప్రపంచం చేస్తున్న ప్రయాణం భారత ఐటీ రంగానికి ఎంతో మేలు చేయనుంది.

మొత్తంమీద, భారత ఐటీ రంగానికి మంచిరోజులు సిద్ధంగా ఉన్నాయి. దానికి తగ్గట్టుగా మనం మరింత సిద్ధపడాల్సిన అవసరం ఉంది. నైపుణ్యం పెంపు,ఆధునిక పోకడలపై అవగాహన,విద్యావ్యవస్థలో మార్పులు ,శిక్షణా విధానం మొదలైన వాటిల్లో ప్రగతిని సాధించడం కీలకమని గుర్తెరిగితే? భారత ఐటీ రంగపు ప్రగతిరథ చక్రాల పరుగు,పరువు మరెంతో పెరుగుతాయి.