DailyDose

TNI ప్రత్యేకం తెలుగు రాష్ట్రాల్లో పాగా వేస్తున్న ప్రవాసాంధ్ర ప్రముఖులు.

TNI ప్రత్యేకం తెలుగు రాష్ట్రాల్లో పాగా వేస్తున్న ప్రవాసాంధ్ర ప్రముఖులు.

కరోనా కాస్త తగ్గుముఖం పడుతున్న వేళ విదేశాల నుండి ఉభయ తెలుగు రాష్ట్రాలకు వచ్చే వారి సంఖ్య రోజు రోజుకూ అధికమవుతోంది. గత రెండు సంవత్సరాల నుండి చాలా మంది ప్రవాస తెలుగు వారు కోవిడ్ మూలంగా తమ స్వస్థలాలకు రాలేకపోయారు. చాలా కాలం తర్వాత పెద్ద సంఖ్యలో తెలుగువారు తమ స్వస్థలాలకు తరలి వస్తున్నారు.

తానా నేతలంతా ఇక్కడే.
ఉభయ తెలుగు రాష్ట్రాలకు వస్తున్న వారిలో పలువురు ప్రవాస ప్రముఖులు ఉన్నారు. అమెరికాలో పెద్ద తెలుగు సంఘం తానా కార్యవర్గ సభ్యులు చాలా మంది ఇక్కడే ఉన్నారు. ఇటీవలే తానా అధ్యక్షుడిగా భాధ్యతల నుండి తప్పుకున్న జయశేఖర్ తాళ్ళూరి, నూతన అధ్యక్షుడిగా భాధ్యతలు చేపట్టిన లావు అంజయ్య చౌదరి, తానా తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికైన నిరంజన్ శృంగవరపు ప్రస్థుతం తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. సన్మానాలు, సత్కారాలు అభినందన సభలతో వారు మునిగి తేలుతున్నారు. అంజయ్య చౌదరిని ఆయన స్వగ్రామం పెద అవుటుపల్లిలో ఆ గ్రామ ప్రజలు గురువారం నాడు ఘనంగా సత్కరించారు. తానా తదుపరి అధ్యక్షునిగా ఎన్నికైన నిరంజన్ శృంగవరపు ను ఆయన స్వగ్రామం కర్నూలు జిల్లా రాజా నగరంలో అక్కడి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. గజ మాలలతో సత్కరించి వూరేగింపు జరిపారు.

తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్ గత రెండు నెలల వ్యవధిలో రెండు సార్లు ఉభయ రాష్ట్రాల్లో పర్యటించి వెళ్ళారు. ఆధ్యాత్మికం , ఆరోగ్యంతో పాటు వ్యాపార పనులు చక్కబెట్టుకొని సతీష్ కొద్దిరోజుల క్రితమే అమెరికా వెళ్ళారు. తానాలో వివిధ పదవులు నిర్వహిస్తున్న పుట్టగుంట సురేష్, పసుకుర్తి రాజా, వై వి రమణ తదితరులు ప్రస్తుతం రాష్ట్రంలోనే పర్యటిస్తున్నారు. తానా ఫౌండేషన్ ట్రస్టీ సామినేని రవి మరికొద్ది రోజుల్లో తన స్వస్థలం ఖమ్మం జిల్లా మాటూరిపేటకు తరలి వచ్చి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకొంటున్నారు. తానాలో కీలక పాత్ర పోషిస్తున్న మందలపు రవి ఇటీవలే హైదరాబాద్ కు వచ్చి తన సన్నిహితులందరికీ భారీ విందు ఇచ్చి వెళ్ళారు.

హైదరాబాదు లోనే మకాం వేసి ఉన్న తానా ఫౌండేషన్ కార్యదర్శి వల్లేపల్లి శశికాంత్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తానా ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలను పర్యవేక్షణ చేస్తున్నారు. తానాలో రెండు వర్గాలుగా విడిపోయిన ప్రముఖులను ఒకే తాటిపైకి తీసుకు వచ్చే ప్రయత్నాలను శశికాంత్ ప్రారంభించినట్లు సమాచారం. గత నెలలో హైదరాబాద్ లో శశికాంట్ భారీ విందును ఏర్పాటు చేసి తానాలో ఉన్న ప్రముఖులందరినీ ఆహ్వానించారు.

వచ్చి వెళ్ళిన నాట్స్ నేతలు.
అమెరికాలో మరొక పెద్ద తెలుగు సంఘం నాట్స్ కార్యవర్గ సభ్యులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. నాట్స్ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా పని చేసి పెద్ద ఏత్తున సేవా కార్యక్రమాలు చేపట్టిన గుత్తికొండి శ్రీనివాస్ రాష్ట్రంలో నెల రోజులపాటు పర్యటించి కొద్ది రోజుల క్రితమే అమెరికా కు తరలి వెళ్ళారు. గుత్తికొండ శ్రీనివాస్ తన వ్యాపార భాగస్వామి ఐకా రవితో కలిసి కాణిపాకం దేవాలయం అభివృద్ధికి 10 కోట్ల రూపాయలు విరాళంగా అందించి ఆ పనులను ప్రారంభించి వెళ్ళారు. నాట్స్ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహన కృష్ణ ఆయన స్వస్థలం గుంటూరులో ఇటీవల భారీ ఎత్తున తన జన్మదిన వేడుకలను లక్షలాది రూపాయలు ఖర్చు చేసి అభిమానుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. గుంటూరు నుండి తేదేపా తరపున శాశన సభ్యునిగా పోటీ చేయాలని భావిస్తున్న మోహన కృష్ణ తరచుగా గుంటూరుకు వచ్చి చంద్రబాబు తదితర పార్టీ ప్రముఖుల్ను కలుస్తూ హడావిడి చేసి వెళుతున్నారు. మరికొందరు నాట్స్ ప్రతినిధులు కొద్ది రోజుల్లో ఇక్కడికి వస్తున్నట్లు సమాచారం.

“తెలుగు రాష్ట్రాల్లో సిలికానాంద్రా సందడి”.
ఏ కార్యక్రమం చేపట్టినా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకొని రికార్డులను సృష్టించే సిలికానాంధ్రా వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్ మరొక సంచలనానికి తెర లేపారు. సిలికానాంధ్రా ఆధ్వర్యంలో శాన్ ఫ్రాన్సిస్కో సమీపంలో 60 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్న “సిలికానాంధ్రా విశ్వవిద్యాలయం” గురించి పరిచయం చేయడం కోసం ఆనంద్ తన బృందంతో కలిసి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తిరుపతి పద్మావతి విశ్వ విద్యాలయంలో ప్రారంభించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పలు ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలను ఆనంద్ బృందం సందర్శించారు. గురువారం రాత్రి హైదరాబాద్ లో కొందరు ప్రముఖులతో ఆనంద్ భారీ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తాము ఏర్పాటు చేసే విశ్వ విద్యాలయం ప్రత్యేకతలు గురించి వివరించారు.

హైదరాబాద్ కు చేరుకున్న “ఆటా” బృందం.
ఆటా ప్రస్తుత అధ్యక్షుడు భువనేష్ భుజాల ఆద్వర్యంలో వచ్చే జులై మొదటి వారంలో వాషింగ్టన్ డీసీలో ఆటా మహోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేసుకొంటున్నారు. ఈ నేపధ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు నెల రోజులపాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి భువనేష్ ఆధ్వర్యంలోని 20 మంది ప్రతినిధి బృందం బుధవారం నాడు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆటా తదుపరి అధ్యక్షురాలు బొమ్మినేని మధు, బండ్రెడ్డి అనీల్ తదితర కార్యవర్గ సభ్యులు ఈ బృందంలో ఉన్నారు. ఆరోగ్య శిబిరాలు, మంచినీటి సౌకర్యం కల్పించడం, పాఠశాలలకు వనరులు సమకూర్చడం తదితర సేవా కార్యక్రమాలను ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ గ్రామాల్లో ఆటా బృందం నిర్వహించనుంది. దీనితోపాటు తిరుపతి, వైజాగ్, వరంగల్ , హైదరాబాద్, నిజామాబాద్ తదితర పట్టణాల్లో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలతో పాటు కళా ప్రదర్శనలు నిర్వహించడానికి ఆటా బృందం ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 26 వ తేదీన ఆటా ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో ముగింపు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఆటా నాయకత్వం ఏర్పాట్లు చేస్తున్నారు.

కోవిడ్ తగ్గుముఖం పడితే అమెరికాతో పాటు ఇతర విదేశాల నుండి ఉభయ తెలుగు రాష్ట్రాలకు పెద్ద సంఖ్యలో ప్రవాస తెలుగు వారు తరలి రావడానికి, వారి మాతృ భూమిలో సేవా కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

– కిలారు ముద్దు కృష్ణ
సీనియర్ జర్నలిస్ట్