Politics

రఘురామ vs మిథున్‌రెడ్డి

Raghurama vs Mithunreddy In Loksabha

ఈరోజు లోక్ సభలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం నడిచింది. జీరో అవర్ సందర్భంగా రఘురాజు మాట్లాడుతూ అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తున్నారని ఆరోపించారు. రైతులు గాంధేయ పద్ధతిలో పాదయాత్ర చేస్తున్నారని… వారి పాదయాత్రకు ఆటంకాలు సృష్టించడం సరికాదని అన్నారు. పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ… వారిని అడ్డుకోవడం దురదృష్టకరమని చెప్పారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చిన రైతుల పట్ల ఇలా వ్యవహరించడం దురదృష్టకరమని అన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను కూడా పోలీసులు హరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో రఘురాజు ప్రసంగాన్ని వైసీపీ ఎంపీలు అడ్డుకునేందుకు యత్నించారు. ప్రసంగం మధ్యలో మిథున్ రెడ్డి మాట్లాడుతూ… రఘురాజుపై సీబీఐ కేసులు ఉన్నాయని, వాటి నుంచి బయటపడేందుకు బీజేపీలో చేరేందుకు ఆయన తహతహలాడుతున్నారని చెప్పారు. రఘురాజు సీబీఐ కేసుల విచారణను వేగవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా రఘురాజు కల్పించుకుంటూ… తనపై రెండు సీబీఐ కేసులు మాత్రమే ఉన్నాయని, ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై వంద సీబీఐ కేసులు ఉన్నాయని చెప్పారు. జగన్ పై ఉన్న సీబీఐ కేసులను ముందు తేల్చాలని డిమాండ్ చేశారు.