Agriculture

చేపలు గుడ్లు ఉత్పత్తిలో ఏపీకి ప్రథమ స్థానం

చేపలు గుడ్లు ఉత్పత్తిలో ఏపీకి ప్రథమ స్థానం

దేశవ్యాప్తంగా పండ్లు, కోడి గుడ్లు, చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచింది. ధాన్యం, మాంసం ఉత్పత్తిలో ఏపీ నాలుగో స్థానంలో ఉండగా పాల ఉత్పత్తిలో ఐదో స్థానంలో ఉన్నట్లు ఆర్బీఐ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. 2018–19లో పోల్చితే 2019–20లో ఈ ఉత్పత్తుల న్నింటిలో వృద్ధి నమోదైంది. వివిధ రాష్ట్రాల్లో 2012–13 నుంచి 2019–20 వరకు ఆహార ధాన్యాలు, పండ్లు, మాంసం, గుడ్లు, చేపల ఉత్పత్తి గణాంకాలపై ఆర్బీఐ ఇటీవల నివేదిక విడుదల చేసింది.
**మూడిట్లో మనదే పైచేయి
పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉండగా ఉత్తరప్రదేశ్‌ రెండో స్థానంలో, మహారాష్ట్ర మూడో స్థానంలో ఉన్నాయి. 2018–19తో పోల్చితే 2019–20లో రాష్ట్రంలో పండ్ల ఉత్పత్తి 3,89,400 టన్నులు అదనంగా పెరిగింది. చేపల ఉత్పత్తిలో ఏపీ తరువాత రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్‌ ఉంది. మూడో స్థానంలో గుజరాత్‌ ఉంది. రాష్ట్రంలో చేపల ఉత్పత్తి 2018–19తో పోల్చితే 2019–20లో 1.82 లక్షల టన్నులు అదనంగా పెరిగింది. కోడి గుడ్ల ఉత్పత్తిలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలవగా తమిళనాడు రెండో స్థానం సాధించింది. తెలంగాణ మూడో స్థానం దక్కించుకుంది.
**ధాన్యం..బెంగాలే
2018–19తో పోల్చి చూస్తే 2019–20తో ఏపీలో కోడి గుడ్ల ఉత్పత్తి 217.3 కోట్లు ఎక్కువగా నమోదైంది. వరి ధాన్యం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ నాలుగో స్థానంలో ఉండగా మొదటి స్థానంలో పశ్చిమబెంగాల్, రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్, మూడో స్థానంలో పంజాబ్‌ ఉన్నాయి. ఒడిశా ఐదో స్థానంలో, తెలంగాణ ఆరో స్థానంలో ఉన్నాయి. 2018–19తో పోల్చితే ఏపీలో 2019–20లో 4,24,200 టన్నులు అదనంగా ధాన్యం ఉత్పత్తి అయ్యింది. మాంసం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ నాలుగో స్థానంలో ఉండగా ఉత్తర ప్రదేశ్‌ మొదటి స్థానంలో, మహారాష్ట్ర రెండో స్థానంలో, పశ్చిమ బెంగాల్‌ మూడో స్థానంలో ఉన్నాయి. పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ ఐదో స్థానంలో ఉండగా మొదటి స్థానంలో ఉత్తర ప్రదేశ్, రెండో స్థానంలో రాజస్థాన్, మూడో స్థానంలో మధ్యప్రదేశ్, నాలుగో స్థానంలో గుజరాత్‌ ఉన్నాయి.