Devotional

తిరుమలకు మూడో ఘాట్ రోడ్డు. తిరుపతి వెళ్లనవసరం లేదు.

తిరుమలకు మూడో ఘాట్ రోడ్డు. తిరుపతి వెళ్లనవసరం లేదు.

లియుగ వైకుంఠం తిరుమలకు మరో ఘాట్‌రోడ్డును నిర్మించనున్నారు. ఈ మార్గం శేషాచలం అటవీప్రాంతం మీదుగా సాగుతుంది. పదకవితా పితామహుడు అన్నమాచార్యులు ఈ మార్గం మీదుగానే తిరుమలకు చేరుకున్నారు. ఈ మార్గంలో తిరుపతికి చేరుకునే అవకాశం ఉండదు. నేరుగా తిరుమలకు చేరుకోవచ్చు. రేణిగుంట మండలంలోని కరకంబాడి-బాలపల్లి మధ్యన రైల్వే మార్గానికి పశ్చిమభాగంలో ఈ మార్గం ప్రారంభమవుతుంది. ఇప్పటికీ అనేకమంది కడప జిల్లా వాసులు ఈ మార్గం ద్వారానే స్వామివారి సన్నిధికి చేరుతుంటారు. సాళువ నరసింహరాయలు అనంతరం విజయనగర ప్రభువుల కాలంలో ఈ మార్గాన్ని వినియోగించుకునే వారు.

కాలక్రమంలో ఆధునిక రవాణా సౌకర్యాలు ఏర్పడటంతో తిరుపతి నుంచి తిరుమలకు 1944లో మొదటి ఘాట్‌రోడ్‌ అంటే తిరుమల నుంచి తిరుపతికి వచ్చేది. ఈ మార్గాన్ని బ్రిటిష్‌ హయాములో నిర్మించారు. అనంతరం 1970ల్లో రెండో ఘాట్‌రోడ్డు నిర్మాణం జరిగింది. అన్నమయ్య మార్గంలో నడిస్తే నేరుగా తిరుమలలోని తుంబురు కోనకు చేరుతాం. ఇప్పటికీ తిరుపతికి చెందిన అనేక ట్రెక్కింగ్‌ క్లబ్బుల సభ్యులు ఈ మార్గం నుంచి ట్రెక్కింగ్‌ కార్యక్రమాలు చేపడుతుంటారు. ఈ మార్గంలో శతాబ్దాల నాటి సత్రాలను ఇప్పటికీ చూడవచ్చు. అయితే ఎర్రచందనం దొంగలు, వారిని పట్టుకునేందుకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల ప్రవేశంతో పరిసరప్రాంతాలైన బాలపల్లి, మామండూరు గ్రామాల ప్రజలు చాలా తక్కువగా ఈ మార్గంలోకి ప్రవేశిస్తుంటారు. ఈ మార్గాన్ని నిర్మించాలని కడప జిల్లా రాజంపేట, కోడూరుకు చెందిన పలువురు రాజకీయనాయకులు, శ్రీనివాసుని భక్తులు ఏటా ఈ మార్గం ద్వారా యాత్ర నిర్వహిస్తారు.

అన్నమయ్య స్వస్థలం కడప జిల్లాలోని తాళ్లపాక గ్రామం. అక్కడ నుంచి బయలుదేరిన ఆయన ఈ మార్గం ద్వారానే తిరుమలకు చేరారు. ఈ మార్గమే కాకుండా మరో మార్గం కూడా ఉంది. దీని ద్వారా కేవలం అటవీశాఖ సిబ్బంది మాత్రమే బీట్‌ నిర్వహిస్తుంటారు. తిరుమలకు చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాల నుంచి కాలినడకన వచ్చేందుకు పలు మార్గాలుంటాయి. అయితే రక్షితప్రాంతం కావడంతో ఎక్కువమంది సౌకర్యాలున్న తిరుపతికి చేరుకొని అలిపిరి, శ్రీవారిమెట్టు ద్వారా కాలినడకన, వాహనాల్లో వచ్చేవారు రెండో ఘాట్‌రోడ్డు ద్వారా స్వామిసన్నిధికి చేరుతుంటారు.