NRI-NRT

భావితరాలకు హిందూ ధర్మ గొప్పదనాన్ని బోధిస్తున్న GHHF

భావితరాలకు హిందూ ధర్మ గొప్పదనాన్ని బోధిస్తున్న GHHF - GHHF Bala Samskar And Ghar Wapasi Programs - Dr. Velagapudi Prakasharao Interview

హిందూ దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తి చేసే లక్ష్యంతో 2006లో ఏర్పడిన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ (GHHF) ఆధ్వర్యంలో హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలతో పాటు, భావితరాలకు సనాతన సాంప్రదాయలపై శిక్షణ, యోగా, హిందూ సంస్కృతి వంటి అంశాలపై తరగతులను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకులు డా.వెలగపూడి ప్రకాశరావు పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని అందుకునేందుకు “బాల సంస్కార్(ఆదివారం పాఠశాల)” పేరిట తెలుగు రాష్ట్రాల్లోని 35గ్రామాల్లో స్వచ్ఛంద ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో తరగతులను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సంఖ్య డిసెంబరు నాటికి 53కు చేరుతుందని ఆయన వెల్లడించారు. ఈ పాఠశాలల్లో ఓంకార జపం, గణపతి ప్రార్థన, గురు స్తోత్రం, సూర్య నమస్కారం, నైతిక కథ, ప్రాణత్యాగం చేసిన భారత అమరవీరులు, హిందూ మతం యొక్క శాస్త్రీయ స్వభావం, హిందూ దేవాలయాల ప్రాముఖ్యత, హిందూ ఆచారాలు-సంప్రదాయాలు, భారతదేశ గురువులు, హిందూ పండుగలు, రామాయణం, మహాభారతం, భగవద్గీత శ్లోకాలు, భజనలు, ఇతర మతాలతో హిందూ మతాన్ని పోల్చడం, యోగా, ధ్యానం, ఆలయ దర్శనం వంటి అంశాలను బోధిస్తారని తెలిపారు. ప్రస్తుతం ప్రతి తరగతిలో 22మంది విద్యార్థులు ఉన్నారని, ఈ సంఖ్యను పెంచేందుకు తాము కృషి చేస్తున్నామని తెలిపారు.

బాలసంస్కార్‌తో పాటు బలవంతపు మత మార్పిళ్ల కారణంగా హిందువుల నుండి క్రైస్తవులుగా మారినవారిని తిరిగి హైందవ మతంలోకి స్వాగతించే ఉద్దేశంతో “ఘర్ వాపసీ” కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు ప్రకాశరావు పేర్కొన్నారు. ఆగస్టు 2020లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ఈ ఏడాది డిసెంబరు నాటికి 5500 మంది తిరిగి హిందు మతంలోకి తీసుకురాగలిగినట్లు ఆయన తెలిపారు. 22మంది ప్రచారకులు పూర్తి సమయం ఈ కార్యక్రమం కోసం ఏపీ-తెలంగాణాల్లో పనిచేస్తున్నారని, త్వరలో దీన్ని తమిళనాడుకు సైతం విస్తరిస్తున్నామని ప్రకాశరావు వివరించారు.

తమ ప్రయత్నానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు తోడ్పడాలని ప్రకాశరావు విజ్ఞప్తి చేశారు. మరింత సమాచారం కోసం – https://www.savetemples.org/ వెబ్‌సైట్ చూడవచ్చు.