NRI-NRT

తాతా మధు…అనుకున్నాడు…సాధించాడు-TNI ప్రత్యేకం

తాతా మధు…అనుకున్నాడు…సాధించాడు-TNI ప్రత్యేకం

అమెరికాతో పాటు వివిధ దేశాల్లో ఉన్న పలువురు ప్రవాస తెలుగు వారు బాగా సంపాదించుకొని అక్కడ స్థిరపడుతున్న సమయంలో జన్మ భూమిలో రాజకీయాల వైపు ఆసక్తి చూపుతున్నారు. కొంత మంది తెలుగు రాష్ట్రాలకు వచ్చి వారు అభిమానించే రాజకీయ పార్టీల్లో పని చేస్తూ ఉండగా మరికొందరు విదేశంలోనే ఉండి ఉద్యోగాలు చేసుకొంటూ ఇక్కడ రాజకీయాల్లో పాల్గొంటున్నారు. వీరు రెండు పడవల మీద కాలు పెడుతూ అవకాశం కోసం ఎదురు చూసేవారు విదేశాలలో ముఖ్యంగా అమెరికాలో ఎక్కువగా ఉన్నారు. గ్రామ సర్పంచ్ నుండి ఎమెల్యే, ఎంపి కావాలని తాపత్రయపడుతున్నవారు అమెరికాలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. వీరంతా గ్రామ స్థాయి నుండి నియోజికవర్గ స్థాయి వరకు జన్మ భూమిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వార్తలలో తరచుగా నిలుస్తున్నారు. కొందరు తాము నమ్మిన రాజకీయ పార్టీ ద్వారా పైకి రావాలని, మంచి ప్రజా ప్రతినిధిగా గుర్తింపు పొందాలని తహ తహలాడుతున్నారు.

*** చాలా మందికి నిరాశే మిగులుతోంది…
అమెరికాలో ఉంటూ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు నడుపుతున్న ప్రవాస తెలుగు ప్రముఖుల్లో 90 శాతానికి పైగా నిరాశే మిగులుతోంది. తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయాలని అమెరికాలో ఉన్న చాలా మంది ప్రవాసాంధ్ర ప్రముఖులు తహ తహలాడుతున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చుట్టూ దశాబ్ధాలనుండి తిరుగుతున్న ప్రవాస ప్రముఖులు చాలా మంది ఇంకా ఆశగానే ఉన్నారు. చంద్రబాబు మాత్రం అందరినీ ఊరిస్తూ ఎన్నికల సమయానికి ఉసూరుమనిపిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీకి విదేశాల్లో ఎక్కువగా అభిమానులున్నారు. మరే పార్టీకి లేనంతమంది అభిమానులు తెలుగుదేశంపార్టీకి ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. వైకాపా, భాజాపా, కాంగ్రేస్ పార్టీలకు కూడా విదేశాల్లో అభిమానులు కార్యకర్తలు ఉన్నారు. అమెరికాలో ఆయా పార్టీలు ఎన్నారై విభాగాలను ఏర్పాటు చేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల దాదాపు 300 మంది పై చిలుకు సభ్యులతో ఎన్నారై తేదెపా కమిటీని ప్రకటించారు. ప్రవాస తెలుగు వారిలో ఉన్న అభిమానాన్ని సొమ్ము చేసుకోవడంలో చంద్రబాబుకు ఉన్న చతురత మరే పార్టీకీ లేదు. మిలియన్ల కొద్దీ డాలర్లను చంద్రబాబును నమ్మి తమకు పదవులిస్తాడని ఆశపడి ఇచ్చిన ప్రవాస తెలుగు ప్రముఖులు చాలా మంది అమెరికాలో ఉన్నారు. ఇప్పుడిప్పుడే వారు వాస్తవాలను గమనిస్తున్నట్లు కనిపిస్తోంది.

*** తాతా మధు .. అనుకున్నాడు .. సాధించాడు ..
రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చిన తాతా మధు అమెరికాలోనూ నాయకుడుగానే ఎదిగాడు. ఉపాధికోసం అమెరికా వెళ్ళిన తాతా మధు అట్లాంటాలో ఉద్యోగం చేస్తూ హోటల్ తో పాటు ఇతర వ్యాపారాలు చేపట్టారు. అట్లాంటా తెలుగు సంఘం అధ్యక్షుడిగానూ తానా కార్యదర్శిగానూ భాధ్యతలు చేపట్టి మంచి నేతగా గుర్తింపు పొందారు. ఆయనకు మొదటి నుండి స్థానిక రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ . ఆయన అమెరికాలో ఉంటూనే స్థానికంగా తన స్వస్థలం ఖమ్మం జిల్లాలో తనకంటూ గట్టి అనుచర వర్గాన్ని ఏర్పరుచుకున్నారు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంకోసం జరుగుతున్న పోరాటాన్ని అమెరికాలో కూడా కొనసాగిస్తూ తాతా మధు ఆ పార్టీ వ్యవస్థాపకుడు కేసీఆర్ దృష్టిలో పడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన అనంతరం తాతా మధు తన మకాం ను ఖమ్మం కు మార్చి ఆ పార్టీలో చురుకైన పాత్ర పోషించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాగా పేరుపొందిన ఖమ్మం ఖిల్లా పై ఆయన పట్టు సాధించారు. ఖమ్మం జిల్లాలో తెరాసా బలహీనంగా ఉన్న సమయంలో ఆ పార్టీని పటిష్టవంతం చేయడంలో తాతా మధు కీలక పాత్ర పోషించారు.

*** కీలక పదవి .. ఉజ్వల భవిష్యత్తు..
కాకలు తిరిగిన యోధానుయోధులు ఉన్న ఖమ్మం జిల్లా నుండి శాసన మండలికి ఎన్నిక కావడం అంత సులువైన విషయం కాదు. ఆ పార్టీ అధిష్టానం ఈ పదవికి తాతా మధును ఎంపిక చేయడం వెనుక గత ఐదారు సంవత్సరాల నుండి మధు చేసిన ఉద్యమాలు, కార్యక్రమాలు ఆయనకు బాగా గుర్తింపును తీసుకు వచ్చాయి. స్వయం కృషితో మధు ఎమెల్సీ స్థానానికి ఎదిగారనడంలో ఏమాత్రం సందేహం లేదు. మధ్య వయస్కుడైన మధుకు ఇంకా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెరాసా లోని సీనియర్ నాయకులు సైతం అభిప్రాయపడుతున్నారు. TNI మీడియా సంస్థను ప్రారంభించినప్పటినుండి వెన్నుదన్నుగా నిలుస్తూ మమ్ములను ప్రోత్సహించిన మా ఆత్మీయుడు తాతా మధు మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని, ప్రజా సమస్యలపై మరింతగా పోరాటాలు జరపాలని ..ప్రవాసుల సమస్యల పట్ల దృష్టి సారించాలని మనస్పూర్తిగా కోరుకొంటున్నాం.
– కిలారు ముద్దుకృష్ణ
సీనియర్ జర్నలిస్ట్

నోట్ : తాతా మధు గురించి ఆయన చేపట్టిన ఉద్యమాలు, పదవులకు సంబంధించిన పూర్తి వివరాలు దిగువ ఇస్తున్నాం ..పరిశీలించండి.

Screenshot-20211216-082423

IMG-20211216-WA0001