Sports

సచిన్ రికార్డు చెదరగొట్టిన ఇంగ్లాండ్ ఆటగాడు-తాజావార్తలు

సచిన్ రికార్డు చెదరగొట్టిన ఇంగ్లాండ్ ఆటగాడు-తాజావార్తలు

* ఈనెల 28 నుంచి రైతు బంధు పంపిణీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. ప్రారంభించిన పది రోజుల్లో అందరికీ నగదు జమ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీంతో ఈనెల 28 నుంచి రైతుల ఖాతాల్లో నిధులు జమకానున్నాయి. గతంలో మాదిరిగానే ఎకరం నుంచి మొదలుకుని అందరికీ నగదు జమచేయనున్నారు.

* ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరోసారి మద్యం పన్ను రేట్లలో మార్పులు చేసింది. వ్యాట్, అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ ప్రత్యేక మార్జిన్‌లో హేతుబద్ధతను తీసుకొచ్చింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. వ్యాట్, అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ ప్రత్యేక మార్జిన్‌లో హేతుబద్ధత తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గే అవకాశం ఉంది.

* ప్రజలకు కనీస వసతులు కల్పించలేకపోతే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లో విలీనం చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రతిపాదించారు. కంటోన్మెంట్‌లో రోడ్ల మూసివేతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం ఎందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

* తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా మరో 12 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసుల సంఖ్య 20కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

* దాదాపు మూడు దశాబ్దాల క్రితం కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తీసుకున్న ఓ నిర్ణయం.. రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరుబాయి అంబానీని అసంతృప్తికి గురిచేసిందట. ఈ విషయాన్ని స్వయంగా గడ్కరీనే చెప్పారు. హైవేలు, రోడ్డు రవాణాలో పెట్టుబడి అవకాశాలపై ముంబయిలో జరిగిన జాతీయ సదస్సులో గడ్కరీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.

* కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న ఉత్తర్‌ ప్రదేశ్‌లో ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. మరికొన్నింటికి శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలో శనివారం రూ.36,230 కోట్ల విలువైన గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుకు పునాది రాయి వేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలనను ప్రశంసిస్తూ, విపక్షాలపై విరుచుకుపడ్డారు.

* రాజ్యాంగం అమల్లోకి వచ్చి 72 ఏళ్లైనా… 102 సవరణలు చేసినా, నేటికీ సామాజిక, ఆర్థిక అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయని జస్టిస్‌ చంద్రు అన్నారు. పేదలకు, నిరాదరణకు గురవుతున్న వాళ్లకు తగిన న్యాయం జరిగినప్పుడే అంబేడ్కర్‌ ఆశయం నెరవేరుతుందని ఆయన అన్నారు. ఉస్మానియ విశ్వవిద్యాలయంలోని లైబ్రరీ సెమినార్‌ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్‌ చంద్రు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

* కొద్దినెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధాని మోదీ, ఇతర భాజపా నేతలు అక్కడ పర్యటిస్తూ.. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్‌ భాజపాకు గట్టిపోటీ ఇచ్చేలా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ, ఆయన సోదరి, పార్టీ యూపీ ఇంఛార్జి ప్రియాంకా గాంధీ ఈ రోజు అమేఠీలో జరిగిన పార్టీ ర్యాలీలో పాల్గొన్నారు.

* అడిలైడ్ వేదికగా జరుగుతున్న యాషెస్‌ టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్ మరో ఘనత సాధించాడు. ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు (1606) చేసిన నాలుగో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. దీంతో అతడు భారత దిగ్గజ సచిన్‌ టెండూల్కర్ (2010లో 1562 పరుగులు)ను అధిగమించాడు.

* విజయవాడ దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు ఓ పాముకు దహన సంస్కారాలు చేశారు. ఇంద్రకీలాద్రిపై సంచరిస్తున్న పాముల్లో ఒకటి మృతి చెందడంతో శాస్త్రోక్తంగా దహన సంస్కారాలు నిర్వహించారు. ఆధ్యాత్మిక ప్రాంతాల్లో సర్పాలు చనిపోతే దహన సంస్కారాలు చేయాలని వైదిక కమిటీ సూచించింది. బెజవాడ ఇంద్రకీలాద్రిపై గత కొంతకాలంగా తిరుగుతున్న ఓ సర్పం మృతి చెందడంతో కొండ దిగువన ఉన్న దుర్గాఘాట్‌లోకి తీసుకొచ్చి శాస్త్రోక్తంగా దహన సంస్కారాలు పూర్తి చేశారు.