NRI-NRT

అందరిపై ఆంక్షలు విధించే అమెరికాపై ఇజ్రాయిల్ ఆంక్షలు

ఒమిక్రాన్‌ (Omicron) వైరస్‌ విజృంభిస్తుండటంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఇందులో భాగంగా తమ పౌరులు అమెరికాకు వెళ్లడాన్ని (Travel Ban) నిషేధించాలని ఇజ్రాయెల్‌ (Israel) నిర్ణయించింది. ఈ మేరకు ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రతిపాదించింది. దీనిపై ప్రధాని నఫ్తాలి బెన్నెట్‌ సానుకూల నిర్ణయం తీసుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి. అగ్రరాజ్యాన్ని రెడ్‌ లిస్ట్‌లో పెట్టాలని సూచించింది.

ఒమిక్రాన్‌ వైరస్‌ వేగంగా వ్యాప్తిచెందుతున్నదని, ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం ఐదో వేవ్‌ ముంగిట ఉందని బెన్నెట్‌ వెల్లడించారు. మరోసారి లాక్‌డౌన్‌ విధించకుండా ఉండాలంటే ట్రావెల్‌ బ్యాన్‌ విధించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే యూరోపియన్‌ దేశాలు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాయని, అందువల్ల తాముకూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

బ్రిటన్‌తోపాటు డెన్మార్క్‌, ఆఫ్రికాలోని చాలా దేశాలను ఇజ్రాయెల్‌ రెడ్‌ లిస్ట్‌లో పెట్టింది. ఆయా దేశాలకు ప్రయాణాలను నిషేధించింది. అదేవిధంగా అమెరికాతోపాటు కెనడా, బెల్జియం, ఇటలీ, జర్మనీ, హంగరీ, మొరాకో, పోర్చుగల్‌, స్విట్జర్లాండ్‌, టర్కీ దేశాలను ట్రావెల్‌ బ్యాన్‌ ఉన్న దేశాల జాబితాలో చేర్చాలని ఆ దేశ ఆరోగ్య శాఖ నిర్ణయించింది.

ఇజ్రాయెల్‌లోని 9.3 మిలియన్ల జనాభాలో ఇప్పటికే 4.1 మిలియన్ల మంది కరోనా వ్యాక్సిన్‌ మూడు డోసులు తీసుకున్నారు. దేశంలో ప్రస్తుతం 5 నుంచి 11 ఏండ్ల చిన్నారులకు టీకా వేస్తున్నారు.