NRI-NRT

అమెరికాలో అయ్యప్పల సందడి-TNI ప్రత్యేకం

Ayyappa Deeksha In USA - Bhajana @ Vemana Satish Home

అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు తమ దేశానికి సుదూరంగా ఉంటున్నప్పటికీ తమ సంప్రదాయాలను ఆచార వ్యవహారాలను అద్భుతంగా పాటిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే భారతీయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మన సాంప్రదాయం పాటించడంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రవాసులు ముందంజలో ఉన్నారు. అమెరికాలో రోజురోజుకు మన హిందూ దేవాలయాల సంఖ్య పెరుగుతోంది. పెద్ద నగరాలతో పాటు చిన్న నగరాల్లోనూ హిందూ దేవాలయాలు పెద్ద ఎత్తున నిర్మిస్తున్నారు.
అమెరికాలో అయ్యప్పల సందడి-TNI ప్రత్యేకంAyyappa Deeksha In USA - Bhajana @ Vemana Satish Home
అమెరికాలో ఉన్న హిందూ దేవాలయాల్లో ఆచార వ్యవహారాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఇక్కడి లానే అన్ని రకాల పూజలు, యజ్ఞాలు, యాగాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే ఈ సీజన్లో అమెరికాలో అయ్యప్ప దీక్ష తీసుకునే వారి సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది. ఒకప్పుడు మేరీలాండ్ సమీపంలో ఉన్న శివ విష్ణు దేవాలయంలోనే అయ్యప్ప దీక్షలు తీసుకునేవారు. ఈ దేవాలయంలో శబరిమలై ఆలయంలో ఉన్న విధంగానే భక్తుల కోసం అన్ని సౌకర్యాలను కల్పించారు. ఇక్కడ దీక్షలు తీసుకోవడంతో పాటు దీక్షలు విరమించే విధంగానూ ఏర్పాట్లు చేశారు. సమీపంలో ఉన్న అడవిలో కాలిబాటలు నిర్మించి అయ్యప్ప భక్తులు ఇరుముడులు ధరించి నడిచి వచ్చే విధంగా ఏర్పాటు చేశారు.
అమెరికాలో అయ్యప్పల సందడి-TNI ప్రత్యేకంAyyappa Deeksha In USA - Bhajana @ Vemana Satish Home
అమెరికాలో అయ్యప్ప దీక్షను తీసుకునే వారి సంఖ్య ప్రతి ఏడాది పెరగడంతో అట్లాంటా, న్యూజెర్సీ, డెట్రాయిట్ వంటి పెద్ద నగరాల్లోనూ స్థానిక హిందూ దేవాలయాల్లో అయ్యప్ప విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ ఏడాది అమెరికా నలుమూలల దాదాపు అయిదారు వేల మంది అయ్యప్ప దీక్షను తీసుకున్నట్లు సమాచారం. కొందరు అక్కడ ఉన్న దేవాలయాల్లో నే దీక్షలు విరమిస్తుండగా మరికొందరు ఇక్కడ శబరిమలైకి వస్తున్నారు. ఈ సీజన్లో అమెరికాలో దీక్షలు తీసుకున్న భక్తుల గృహాలు శరణుఘోషతో మారుమోగుతున్నాయి. అయ్యప్ప పడిపూజలు ఇతర ప్రత్యేక పూజలు భజనలు, భక్తి గీతాలతో సందడిగా ఉన్నాయి. గత వారాంతంలో వర్జీనియాలో నివాసం ఉంటున్న తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్ నివాసం అయ్యప్ప భక్తుల శరణుఘోషతో మారుమోగింది. అయ్యప్ప దీక్ష తీసుకున్న వేమన సతీష్ భక్తి పారవశ్యంతో భజనలు చేస్తూ ఆడిపాడారు. వీడియో చూడండి. గత వారాంతంలోనే న్యూజెర్సీలోని సాయి దత్త పీఠంలో ప్రధాన అర్చకులు శంకరమంచి రఘుశర్మ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అయ్యప్ప పడిపూజ నిర్వహించారు. ఈ సీజన్లో అమెరికా నలుమూలల అయ్యప్ప శరణు ఘోష భక్తులు పెద్ద ఎత్తున వినిపిస్తూ మన వారి భక్తిని సాంప్రదాయాలను చాటి చెబుతున్నారు. —కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్టు