NRI-NRT

బెజవాడ బార్ అసోసియేషన్ నాకు చాలా ప్రత్యేకం

బెజవాడ బార్ అసోసియేషన్ నాకు చాలా ప్రత్యేకం

న్యాయవాద వృత్తిలోకి తన తొలి అడుగులు బెజవాడ బార్ అసోసియేషన్‌తో ప్రారంభమయ్యాయని, అది తనకు ఎంతో ప్రత్యేకమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ పేర్కొన్నారు. ఆదివారం నాడు బెజవాడ బార్ అసోసియేషన్ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. 1982-83 మధ్య ఈ బార్ అసోసియేషన్ సభ్యుడిగా జేరిన తనకు సీనియర్ న్యాయవాదులతో కలిసి చర్చించి వారి అనుభవాలను ఆకళింపు చేసుకునే అవకాశం దొరికేదని, ఒక్కరోజు రాకపోయిన ఏదో వెలితిగా ఉండేదని ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పటికీ ఇప్పటికీ బెజవాడ బార్ అసోసియేషన్‌లో చాలా మార్పులు వచ్చాయన్నారు.

* నన్ను ఇంతటివాడిని చేసింది ఈ సంఘమే!
బెజవాడ బార్ అసోసియేషన్ తనకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందించిందని, అగ్నిపరీక్షలు ఎదుర్కొని, ఢక్కామొక్కీలు తిని తనను ఈ స్థాయికి తీసుకువచ్చి మీ ముందు నిలబెట్టిన ఘనత బెజవాడ బార్ అసోసియేషన్‌కు పూర్తిగా దక్కుతుందని CJI అన్నారు. ఒకనాడు దేశవ్యాప్తంగా ఎక్కడైనా మానవహక్కుల ఉల్లంఘన జరిగితే బెజవాడ బార్ అసోసియేషన్ నుండి ఒక కమిటీ తప్పకుండా ప్రాతినిధ్యం వహించేదని, అలాంటి బృందాల్లో తాను కూడా పలుసార్లు సభ్యుడిగా వ్యవహరించినందుకు గర్విస్తున్నానని CJI అన్నారు.

* బాధగా ఉంది
బెజవాడ బార్ అసోసియేషన్ కార్యాలయం శిథిలావస్థలో ఉండగా 2013లో అప్పటి ముఖ్యమంత్రి చొరవతో ₹40కోట్ల నిధులు విడుదల చేసినప్పటికీ ఇప్పటికీ పూర్తిస్థాయి భవనం నిర్మించకపోవడం చూస్తే తనకు బాధగా ఉందని జస్టిస్ ఎన్.వి.రమణ ఆవేదన వెలిబుచ్చారు. జాతీయ న్యాయ మౌలిక సదుపాయల సంస్థను (National Judicial Infrastructure Corporation) ఏర్పాటు చేయాలన్న తన కృషి వెనుక కారణం ఇలాంటి ఇబ్బందులను అధిగమించడానికేనని ఆయన వెల్లడించారు. 8ఏళ్ల కాలయాపన జరిగినా ఇప్పటికీ భవనం రూపొందకపోవడం చూస్తే పాలకులకు న్యాయవ్యవస్థ పట్ల ఎంతటి శ్రద్ధ ఉందో అర్థం అవుతుందని జస్టిస్ నూతలపాటి పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం భారత న్యాయవ్యవస్థ పట్ల చిన్నచూపు, నిర్లక్ష్య ధోరని పెరిగాయని ఆయన అభిప్రాయపడ్డారు. బెజవాడ బార్ అసోసియేషన్‌లో చాలా మార్పులు వచ్చాయన్న ఛీఫ్ జస్టిస్, సంఘ సభ్యుల్లో చైతన్య స్ఫూర్తి కొంత తగ్గిందని చురకలంటించారు. ఒకప్పటి బార్ అసోసియేషన్ అయితే భవంతి కోసం ఇన్ని ఏళ్ల నిరీక్షణ తప్పేదని అన్నారు. భవనం లేకున్నా ఎంతో సహనంతో అద్దె కార్యాలయాల మధ్య తిరుగుతున్న న్యాయవాదులకు ఆయన జోహర్లు తెలిపారు.

* న్యాయం నిలబడాలి
న్యాయం నిలబెడతామని ప్రతిజ్ఞ చేసి న్యాయవాద వృత్తిలోకి వచ్చిన వారందరూ దాన్ని నిలబెట్టుకోవాలని జస్టిస్ నూతలపాటి వెంకటరమణ కోరారు. ధనవంతులే తప్ప పేదలు, మధ్యతరగతి వారు కోర్టుకు రావడానికి భయపడుతున్నారని, ఈ దుస్థితి చెదరగొట్టాలని పిలుపునిచ్చారు. కోర్టు కార్యకలాపాల్లో మాతృభాష లేకపోతే కోర్టుకు వచ్చిన కక్షిదారులకు ఏమి జరుగుతుందో అర్థం గాక కోర్టుల పట్ల విశ్వాసం పోతుందని CJI అన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి ఉండాలని CJI ఆకాంక్షించారు.

న్యాయమూర్తులు, వారి కుటుంబీకులపై ఇటీవల జరుగుతున్న అవమానాలు, దాడులు గురించి ప్రస్తావిస్తూ తన కష్టకాలంలో తనకు అండగా నిలబడిన బార్ కౌన్సిళ్లు, న్యాయవ్యవస్థ సభికులకు CJI ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ నుండి పొన్నవరం వరకు, పొన్నవరం నుండి విజయవాడ వరకు అడుగడుగునా తనపై ఆదరాభిమానాలు చూపిన ప్రతి ఒక్కరికీ జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ధన్యవాదాలు తెలిపారు.