Sports

సెహ్వాగ్ సోదరి సరికొత్త నిర్ణయం

సెహ్వాగ్ సోదరి సరికొత్త నిర్ణయం

మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సోదరి అంజు సెహ్వాగ్‌ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. దిల్లీలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆప్‌ సీనియర్ నేతల సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నుంచి తాను ఎంతో స్ఫూర్తి పొందానని, అందుకే పార్టీలో చేరినట్లు తెలిపారు. తన కుటుంబంలో రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న తొలి వ్యక్తిని తానే అని అన్నారు.

వీరేంద్ర సెహ్వాగ్ అక్క అయిన అంజు వృత్తిరీత్యా ఉపాధ్యాయిని. దిల్లీలోని లక్ష్మణ్‌ పబ్లిక్‌ స్కూల్‌లో హిందీ టీచర్‌గా పనిచేశారు. సామాజిక కార్యకర్త కూడా. 2012లో దిల్లీలోని దక్షిణపురి ఎక్స్‌టెన్షన్ వార్డు నుంచి కౌన్సిలర్‌ పదవికి పోటీ చేసి గెలుపొందారు. మరికొద్ది నెలల్లో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ అంజు సెహ్వాగ్‌ ఆప్‌లో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరోవైపు వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా రాజకీయాల్లోకి రానున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వీరేంద్రను దిల్లీ నుంచి పోటీ చేయాలని భాజపా కోరింది. అయితే తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదని చెప్పి.. ఆ ఆఫర్‌ను సెహ్వాగ్‌ సున్నితంగా తిరస్కరించారు.