Politics

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా కుమారుడి వీడియో విడుదల

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా కుమారుడి వీడియో విడుదల

భద్రాద్రి కొత్తగూడెం పాత పాల్వంచ తూర్పు బజారులో కుమార్తె సహా దంపతుల సజీవదహనం ఘటనలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేందర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగినప్పటినుంచి రాఘవేందర్ పరారీలో ఉన్నట్లు పాల్వంచ ఏఎస్పీ తెలిపారు. తాజాగా రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యపై వనమా రాఘవేందర్‌ స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. ఈ ఘటనలో జోక్యం లేకున్నా తన పేరు ఎందుకు రాశారో అర్థం కావడం లేదన్నారు. తొలుత ఈ ఘటనను ప్రమాదవశాత్తూ జరిగిందని పోలీసులు భావించినా.. తర్వాత ఆత్మహత్యగా గుర్తించారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వెనుక మరేదైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మమ్మరం చేశారు. ఈ మేరకు ఇంట్లో దొరికిన సూసైడ్‌ నోట్‌లో రాఘవేందర్‌ పేరు ఉండటం స్థానికంగా కలకలం రేపింది. రామకృష్ణ కారులోని కొన్ని కీలక పత్రాలు, బిల్లులను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేందర్‌ పేరు బయటకు రావడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. సూసైడ్‌ నోట్‌ ఆధారంగా రాఘవేందర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పాల్వంచ ఏఎస్పీ వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం పాత పాల్వంచ తూర్పు బజారులో ఇంట్లో గ్యాస్ లీకేజీతో రామకృష్ణ, శ్రీలక్ష్మి దంపతులతో సహా కుమార్తె సాహిత్య(12) సజీవదహనమయ్యారు. మంటలు అంటుకొని మరో కుమార్తె సాహితికి తీవ్రగాయాలయ్యాయి. చిన్నారిని పాల్వంచ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. అక్కడి నుంచి భద్రాద్రి కొత్తగూడెంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారికి 80శాతం కాలిన గాయాలైనట్లు వైద్యులు తెలిపారు.