DailyDose

TNI నేటి నేర వార్తలు 05/01/2022

TNI నేటి నేర వార్తలు 05/01/2022

* కాలికి ట్యాగుతో పావురం.. ప్రకాశం జిల్లాలో కలకలం

కాలికి చైనా ట్యాగు ఉన్న ఓ పావురం ఒడిశాలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇదే తరహా ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా చీమకుర్తిలో చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది. జిల్లాలోని చీమకుర్తి శివారులో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనంపై కాలికి ట్యాగుతో ఉన్న పావురం బుధవారం స్థానికుల కంట పడింది. గత రెండు నెలలుగా ఈ పావురం బహుళ అంతస్తుపై ఉంటుండగా.. ఆ భవన యజమాని గింజలు వేసి పెంచుతున్నారు. నిన్న ఒడిశాలో రెండు పావురాలు చైనా ట్యాగులతో కన్పించిన ఘటనపై ‘ఈనాడు’ వార్తా పత్రికలో ప్రచురితమైన వార్తను చూసి భవన యజమాని స్పందించారు. వెంటనే ఈ విషయాన్ని మీడియా, పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన పోలీసులు వెంటనే పావురాన్ని స్వాధీనం చేసుకొని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.

పావురం కాలికి ఉన్న ట్యాగుకు ‘ఏఐఆర్‌ 2022’ అని రాసి ఉంది. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.నిన్న ఒడిశాలోని సుందర్‌గఢ్ రాజ్‌గంగ్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంస్‌బహాల్ గ్రామంలో. గాయంతో ఓ పావురం కింద పడిపోయింది. ఆ పావురాన్ని రక్షించేందుకు సర్బేశ్వర్ చొత్రాయ్ అనే వ్యక్తి ప్రయత్నించాడు. పావురాన్ని కాపాడే క్రమంలో కాలికి చైనా ట్యాగ్ ఉన్నట్లు గుర్తించాడు. దానిపై చైనీస్ భాషలో ఏదో రాసి ఉన్నట్లు గమనించి.. పోలీసులకు సమాచారమిచ్చాడు. సర్బేశ్వర్ సమాచారంతో అధికారులు హుటాహుటిన రంగంలోకి దిగారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపి ఉంటారు? అనే వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

*చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ అరెస్ట్‌

కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే, భాజపా నేత బొడిగె శోభను పోలీసులు అరెస్ట్ చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈనెల 3న చేపట్టిన జన జాగరణ దీక్ష సమయంలో నమోదైన కేసులో భాగంగా ఆమెను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. జనజాగరణ దీక్ష చేపట్టేటపుడు కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన, పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై 16 మందిపై కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా ఇప్పటికే బండి సంజయ్‌ను అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. తాజాగా బొడిగె శోభను కూడా అరెస్ట్‌ చేశారు.

* ఝార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాకూరు జిల్లాలో గ్యాస్‌ సిలిండర్లతో వెళ్తున్న ఓ ట్రక్కు, ప్రయాణికుల బస్సు పరస్పరం ఢీకొన్న ఘటనలో 16మంది దుర్మరణం చెందారు. మరో 26మంది గాయపడ్డారు. పడేర్‌కోలాలోని గోవింద్‌పూర్‌-సాహెబ్‌గంజ్‌ రాష్ట్ర రహదారిపై బుధవారం ఉదయం 8.30 సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదం సమయంలో బస్సులో 40మంది ప్రయాణికులు ఉన్నట్టు పేర్కొన్నారు.

* పానగల్ మండలం మల్లాయిపల్లెలో దారుణం జరిగింది. అనిల్ నాగరాజు అనే ఇద్దరు వ్యక్తులు వ తరగతి చదువుతున్న ఓ బాలికపై అత్యాచారం చేశారు. విద్యార్థిని పాఠశాలకు వెళుతుండగా ఈ ఇద్దరు వ్యక్తులు ఆమెను మధ్యలో అడ్డగించి పొదల్లోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

* రంగారెడ్డిజిల్లాలోని అబ్దుల్లాపూర్‌మేట్ మండలంలోని తారమతిపేట్ ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో లారీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. భారీ పేలుడు శబ్దాలతో లారీ దగ్ధమవుతోంది. ఈ క్రమంలో ఓఆర్‌ఆర్‌పై తారమతిపేట్ నుండి శంషాబాద్ వైపు వెళ్లే రోడ్డుపై రెండు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు యత్నిస్తున్నారు.

* వేటగాళ్ల ఉచ్చులో చిక్కి చిరుత మృతిచెందిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. కటక్ జిల్లాలోని అత్‌ఘర్ రేంజ్ పరిధిలో తిగ్రియా అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వేటగాళ్లు ఏర్పాటుచేసిన ఉచ్చును గమనించకుండా వెళ్లి.. చిరుత అందులో చిక్కుకుంది. జింకలు, అడవి పందులను చంపేందుకు వేటగాళ్లు. విద్యుత్ తీగలు, బాంబులను వినియోగిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. వన్యప్రాణుల మీద తరచుగా జరుగుతున్న దాడులపై అటవీ శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

* సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్‌ను ర్యాగింగ్‌ చేసిన ఆరుగురు వైద్య విద్యార్థులను సస్పెండ్‌ చేశారు. 2019- 20బ్యాచ్‌కు చెందిన విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్‌ చేస్తూ డీఎంఈ రమేశ్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు వసతి గృహం నుంచి శాశ్వతంగా పంపించేస్తూ ఉత్తర్వులిచ్చారు. వైద్యకళాశాల హాస్టల్‌లో హైదరాబాద్‌కు చెందిన మొదటి సంవత్సరం విద్యార్థి విస్కనూరి సాయికుమార్‌ శనివారం రాత్రి ర్యాగింగ్‌కు గురైన విషయం తెలిసిందే.

* సిద్దిపేట జిల్లాలోని ములుగు మండలం లక్ష్మక్కపల్లెలో ఉన్న ఆర్‌వీఎం వైద్య కళాశాలలో లిఫ్టు ప్రమాదం చోటుచేసుకుంది. లిఫ్టు తీగలు తెగడంతో ఒక్కసారిగా పైఅంతస్తు నుంచి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. మరో 17 మంది స్వల్పంగా గాయపడ్డారు.

* జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెల్లుల్ల శివారులోని ఎస్సారెస్పీ వంతెన వద్ద కాకతీయ కాలువలో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని కారు పడ్డట్లు తెలుస్తోంది. కారుతో పాటు మెట్‌పల్లి పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గల్లంతైనట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాలువకు ఒకవైపు రెయిలింగ్‌ కూలిపోయి ఉంది. రెయిలింగ్‌కు ఢీకొట్టి కారు కాలువలో పడ్డట్లు తెలుస్తోంది.

* హోం వర్క్‌ చేయనందుకు కుమార్తెను టీచర్‌ కొట్టడంపై ఆర్మీ జవాను ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈ క్రమంలో ఏకంగా పాఠశాల డైరెక్టర్‌పైనే కాల్పులు జరిపాడు. రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌ జిల్లాలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కన్వాడా గ్రామానికి చెందిన సైనికుడు పప్పు గుర్జార్‌ కుమార్తె ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. హోం వర్క్‌ చేయకపోవడంతో టీచర్‌ ఆమెను చెంపదెబ్బ కొట్టింది. ఆ విషయాన్ని విద్యార్థిని తన తండ్రికి చెప్పింది. దీంతో కోపంతో రగిలిపోయిన పప్పు గుర్జార్‌ పాఠశాల డైరెక్టర్‌ను కలిసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. అనంతరం గుర్జార్‌ తన వెంట తెచ్చుకున్న రివాల్వర్‌ తీసి పాఠశాల డైరెక్టర్‌పై ఎక్కుపెట్టాడు. అనంతరం కాల్చాడు. ఇంతలో గొడవ ఆపేందుకు మధ్యలోకి వచ్చిన గుర్జార్‌ భార్య భుజానికే ఆ తూటా తగిలింది. అనంతరం జవాను అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు.

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో సోమవారం జరిగిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఉదంతంలో మరో విషాదం చోటు చేసుకుంది. మృత్యువుతో పోరాడుతూ కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామకృష్ణ చిన్న కుమార్తె సాహితీ ఈరోజు ఉదయం మృతి చెందింది. భార్య, పిల్లలకు నిప్పంటించి రామకృష్ణ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రామకృష్ణ, శ్రీలక్ష్మి దంపతులు, పెద్దకుమార్తె సాహిత్య సజీవదహనమయ్యారు. కాగా తన ఆత్మహత్యకు తెరాస నేత వనమా రాఘవేంద్రరావే ప్రధాన కారణమని రామకృష్ణ సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్న నేపథ్యంలో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో అతన్ని ఏ2గా చేర్చారు.

*రెండు రోజుల కిందట జగిత్యాల జిల్లా ఎస్సారెస్పీ కాలువలో పడిన కారును పోలీసులు వెలికి తీశారు. అందులో ఇద్దరు వ్యక్తుల మృతదేహాలను గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. మెట్‌పల్లికి చెందిన పూదరి రేవంత్‌(31), గుండవేని ప్రసాద్‌(41) సోమవారం అర్ధరాత్రి మెట్‌పల్లి నుంచి ఆత్మకూరుకు కారులో బయలుదేరారు. మండల పరిధిలోని గ్రామమైనప్పటికీ.. తెల్లావారినా వీరు ఆత్మకూరు చేరుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసుల ఈ మార్గంలో తనిఖీలు చేశారు. వెల్లుల్ల వద్ద ఎస్సారెస్పీ కాకతీయ కాలువపై వంతెన ఉంటుంది. దీని పైనుంచే ఆత్మకూరు వెళ్తారు.

*నిజామాబాద్‌ భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై మరో కేసు నమోదైంది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బంజారాహిల్స్‌ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఐపీఎస్‌ అధికారులను తీవ్ర పదజాలంతో దూషించారని పలు సెక్షన్ల కింద అర్వింద్‌పై కేసు పెట్టారు. ఐపీసీ 294, 504, 505 1(1), (బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

*ఝార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాకూర్‌ జిల్లాలో బస్సు- గ్యాస్‌ సిలిండర్ల ట్రక్కు ఢీకొన్న ఘటనలో 16 మంది దుర్మరణం చెందారు. మరికొంత మందికి గాయాలయ్యాయి. పొగమంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

*పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పవర్‌పేట రైల్వేస్టేషన్‌ వద్ద ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఓ వివాహిత, యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను ఏలూరుకు చెందిన అరుణకుమారి, రాజహేంద్రవరానికి చెందిన వినయ్‌గా పోలీసులు గుర్తించారు. వరుసకు వీళ్లిద్దరూ వదిన, మరిది అని దర్యాప్తులో తేలింది. ఇద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధమే ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి పంపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*మహిళా కానిస్టేబుల్‌ పట్ల కొంతమంది ఆకతాయిలు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. సోమవారం రాత్రి జిల్లా కేంద్రంలో ముగ్గురు ఆకతాయిలు మహిళా కానిస్టేబుల్‌తో అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో సదరు కానిస్టేబుల్‌ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.

*గుడియాత్తం సమీపం కొత్తపారికుప్పంకు చెందిన వినీత్‌ (23), అదే గ్రామానికి చెందిన ఆకాష్‌ (22) స్నేహితులు. వినీత్‌ హోసూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ న్యూ ఇయర్‌ సెలవుకు ఇంటికి వచ్చాడు. కొత్త సంవత్సరం సందర్భంగా వినీత్‌, ఆకాష్‌, మరి కొందరు స్నేహితులు శనివారం అర్థరాత్రి 12 గంటలకు కేక్‌ కట్‌ చేసే సమయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో, ఆగ్రహానికి గురైన ఆకాష్‌ కత్తితో వినీత్‌పై దాడిచేయడంతో తీవ్రగాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు అతనిని గుడియాత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన మేల్‌పట్టి పోలీసులు ఆకాష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

*ఈరోడ్‌ బస్టాండు సమీపంలో కట్టడ నిర్మాణపు పరికరాలను విక్రయించే దుకాణాలు, టింబర్‌షాపులు సహా ఏడు దుకాణాలలో సంభవించిన అగ్నిప్రమాదంలో ఐదు దుకాణాల్లోని రూ.25. కోట్ల విలువైన వస్తువులు కాలి బూడిదయ్యాయి. బస్టాండు సమీపం శక్తిరోడ్డు కూడలి వద్ద రామచంద్రన్‌ (57), శ్రీధర్‌ (47) అనే వ్యాపారులు కట్టడ నిర్మాణానికి ఉపయోగించే పెయింట్లు, ఇనుప కిటికీలు, తలుపులు, ఎలక్ట్రికల్‌ సామగ్రి, టైల్స్‌, స్నానపు గదులకు సంబంధించిన శానిటరీ పరికరాలు విక్రయించే దుకాణాలను, గోదాములను నడుపుతున్నారు. ఆదివారం వేకువజామున ఆ దుకాణాల్లో దట్టమైన పొగలతో మంటలు చెలరేగాయి.

*అప్పుల బాధ తాళలేక, ఆస్తి పంపకాల్లో అన్యాయం జరిగిందనే మనస్తాపంతో పాత పాల్వంచకు చెందిన మండిగ నాగరామకృష్ణ తన భార్య శ్రీలక్ష్మి, కుమార్తెలు సాహిత్య, సాహితిపై పెట్రోల్‌ పోసి నిప్పటించిన విషయం విదితమే. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో రామకృష్ణ, ఆయన భార్య ఓ కుమార్తె మృతి చెందగా, మరో కుమార్తె సాహితి కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతోంది.