Politics

ప్రధానమంత్రి భద్రత ఎలా ఉంటుంది

ప్రధానమంత్రి భద్రత ఎలా ఉంటుంది

ప్రధాన మంత్రి భద్రత ఎలా ఉంటుంది? పంజాబ్ పర్యటనలో పొరపాటు ఎలా జరిగింది?

• భూమికా రాయ్
• బీబీసీ ప్రతినిధి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భద్రతలో అనూహ్యంగా తలెత్తిన వైఫల్యంపై రాజకీయ పార్టీలు పరస్పరం దూషించుకుంటున్నాయి.
పంజాబ్‌ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ బుధవారం ప్రసంగించాల్సి ఉంది. కానీ, భారీ భద్రతా వైఫల్యం తలెత్తడంతో ఆ కార్యక్రమానికి ప్రధాని హాజరు కాలేకపోయారని కేంద్ర హోం శాఖ చెప్పింది.

”ప్రతికూల పరిస్థితుల కారణంగా ప్రధాని మోదీ కాన్వాయ్ బఠిండా విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో హుస్సైనీవాలాలోని జాతీయ అమర వీరుల స్మారకం దగ్గరకు బయల్దేరింది. అమరవీరుల స్మారకానికి 30 కి.మీ దూరంలో ఉన్న ఫ్లైఓవర్ వద్దకు కాన్వాయ్ చేరుకోగానే, అక్కడ కొంతమంది నిరసనకారులు రహదారిపై బైటాయించినట్లు తెలిసింది. దీంతో ప్రధాని, ఫ్లైఓవర్‌పైనే 15 నుంచి 20 నిమిషాల పాటు ఉండాల్సి వచ్చింది. భారత ప్రధాని భద్రతా దృష్ట్యా చూస్తే ఇది చాలా పెద్ద వైఫల్యం” అని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.

కాంగ్రెస్ విపరీత వైఖరికి ఈ ఘటనే నిదర్శనమని బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శించింది. మరోవైపు ర్యాలీకి జనం ఎవరూ రాకపోవడంతో, భద్రతా నెపంతో ప్రధాని మోదీ వెనక్కి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ప్రధాని మోదీ పర్యటనకు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత పంజాబ్‌లో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీదేనని బీజేపీ చెబుతోంది.

పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ బుధవారం సాయంత్రం నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ. ‘ప్రధానమంత్రి భద్రతకు ఎలాంటి ముప్పు లేదు. ఇందులో పంజాబ్ ప్రభుత్వం పాత్ర లేదు” అని పేర్కొన్నారు. అదే సమయంలో, ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని హోం మంత్రి అమిత్ షా అన్నారు. దీనిపై పంజాబ్ ప్రభుత్వం నుంచి నివేదిక కోరామని, మొత్తం వ్యవహారంలో జవాబుదారీగా ఉండాలని కోరినట్లు ఆయన చెప్పారు.

చాలా పెద్ద తప్పు

”సరిహద్దు ప్రాంతంలో ప్రధాని మోదీ కాన్వాయ్ 15 నిమిషాల పాటు నిలిచిపోవడం అంటే అది చాలా పెద్ద భద్రతా లోపం” అని మాజీ ఐపీఎస్ అధికారి యశోవర్ధన్ అజాద్ అభిప్రాయపడ్డారు.

”ఇది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే, సరిహద్దు ప్రాంతంలోని ఒక బ్రిడ్జిపై ప్రధాని కాన్వాయ్ 15 నుంచి 20 నిమిషాల పాటు కదలకుండా ఉండిపోవడం భద్రతా పరంగా అత్యంత తీవ్రమైన అంశం. ప్రధాని ఎక్కడికి వెళ్లినా ఆయనకు ఎస్పీజీ భద్రత ఉంటుంది. కానీ, ఓవరాల్‌గా ఆయన భద్రతను పర్యవేక్షించాల్సిన భాద్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలదే” అని ఆయన పేర్కొన్నారు.

”ఎవరి ప్రాణాలకైతే అత్యధిక ప్రమాదం పొంచి ఉంటుందో. అలాంటివారు కేవలం ఒక బుల్లెట్ ఫ్రూఫ్ కారును నమ్ముకొని, బహిరంగ ప్రదేశాల్లో బంధీగా నిలిచిపోవడం అనేది చాలా ఘోరమైన తప్పిదం” అని ఆయన నొక్కి చెప్పారు.

ఈ పొరపాటు ఎలా జరిగింది?

”రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడే బాధ్యత పోలీసులపైనే ఉంటుంది. కానీ, ప్రధాని భద్రత విషయానికొస్తే, ఆయన కోసం ఎస్పీజీ దళాలను మోహరిస్తారు” అని మాజీ సీనియర్ పోలీసు అధికారి ఒకరు అన్నారు.

”ప్రధాని పర్యటనల నేపథ్యంలో భద్రత కోసం ముందుగానే ఎస్పీజీ బృందాలు, ఆయన పర్యటించే ప్రాంతాలకు వెళ్తాయి. అక్కడి స్థానిక ఇంటెలిజెన్స్ అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తాయి. ఎక్కడ ఎలాంటి భద్రత ఉండాలి? ఏ మార్గం ద్వారా ప్రధాని ప్రయాణించాలి? తదితర అంశాలన్నింటిపై పక్కాగా నిర్ణయాలు తీసుకుంటారు. పోలీసులు ఔటర్ సర్కిల్‌లో ప్రధానికి భద్రత కల్పిస్తే, ఎస్పీజీ బృందాలు ఇన్నర్ సర్కిల్‌లో ఆయనకు రక్షణగా నిలుస్తాయి” అని ఆయన వివరించారు.

ప్రధాని పర్యటన గురించి ఆయా రాష్ట్రాలకు ముందుగానే సమాచారమిస్తారని, ఆ మేరకు భద్రత ఏర్పాట్ల విషయంలో పూర్తి సన్నద్ధంగా ఉంటారని అన్నారు. తాజా ఘటన మాత్రం ఒక పెద్ద పొరపాటు అని ఆయన నమ్ముతున్నారు. దీనిపై పూర్తి నివేదికలు వచ్చే వరకు వేచి చూడాల్సిందేనని అన్నారు.

కాశీ విశ్వనాథ్ ధామ్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

దీని గురించి యశోవర్ధన్ కూడా మాట్లాడారు. ”బఠిండా నుంచి ఫిరోజ్‌పూర్‌కు దాదాపు 110 కి.మీ దూరం ఉంటుంది. బఠిండా విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత వెంటనే మోదీ బయల్దేరాల్సి ఉంది. కానీ వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఆయన విమానాశ్రయంలోనే కాసేపు వేచి చూశారు. అప్పటికీ వాతావరణంలో తేడా లేకపోవడంతో రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలని నిర్ణయించారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నపళంగా ఆయన ప్రయాణ ఏర్పాట్లను చేస్తుంటాయి. ఎందుకంటే ప్రధాని పర్యటన అనగానే ఆయన కోసం అనేక ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకుంటారు” అని యశోవర్ధన్ అన్నారు.

”రోడ్డు మార్గంలో ప్రధాని వెళ్లేందుకు క్లియరెన్స్ వచ్చిందంటే. ఆ రూట్‌ను క్లియర్ చేస్తామని పోలీసు శాఖ హామీ ఇచ్చినట్లే. రాష్ట్ర పోలీసులు, ప్రధాని కాన్వాయ్ ముందు బందోబస్తుగా వ్యవహరిస్తారు” అని ఆజాద్ పేర్కొన్నారు.
”110 కి.మీ పొడవునా ప్రధాని కోసం పోలీసులను మోహరించడం సాధ్యం కాదు. కానీ ఆయన పర్యటన దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నారు” అని యశోవర్ధన్ అభిప్రాయపడ్డారు.

”కొంతమంది ప్రజలు రహదారిని అడ్డగించారు. అంటే, ప్రధాని మోదీ రోడ్డు మార్గంలో రానున్నారనే విషయం లీకైంది. ఇది అంత పెద్ద తప్పేం కాదు. 110 కి.మీ సుదీర్ఘ దూరం ప్రధాని ప్రయాణించనున్నారనే సంగతి, ఈ మొబైల్ యుగంలో వెంటనే ఇతరులకు తెలియడం ఆశ్చర్యమేమీ కాదు. కానీ తప్పు ఎక్కడ జరిగిందంటే. రోడ్డును రైతులు అడ్డగించినప్పుడు పోలీసులకు చెందిన అడ్వాన్స్ యూనిట్, ప్రధాని వాహనానికి రక్షణగా నిలవాల్సింది. కానీ వీరు మోదీ వాహనాన్ని వెనుక విడిచిపెట్టి వచ్చి రైతులతో చర్చలు ప్రారంభించారు.”

ఆ సమయంలో ప్రధాని భద్రత విషయంలో పోలీసులు అనుసరించిన పద్ధతి చాలా ప్రమాదకరమైందని యశోవర్ధన్ అభిప్రాయపడ్డారు.
”నిరసనకారులతో సాధారణ రోజుల్లో చర్చలు జరపాలి. ప్రధాని కాన్వాయ్ వెనక వేచి ఉన్నప్పుడు ఇలాంటివి జరగకూడదు. వెంటనే ఏదో ఒకటి చేసి పోలీసులు ఆ మార్గాన్ని క్లియర్ చేసి ఉండాలి. చివరకు వారిని బలవంతంగానైనా పక్కకు పంపించాలి” అని అన్నారు.

ప్రధానమంత్రి సెక్యూరిటీ ప్రొటోకాల్ ఏమిటి?

ప్రధానమంత్రి పర్యటనకు ముందే చాలా విస్తృత స్థాయిలో సన్నాహాలు జరుగుతాయని యశోవర్ధన్ చెప్పారు.
ఆయన చెప్పిన దాని ప్రకారం, ప్రధాని.. ఏదైనా ఎన్నికల ర్యాలీలో పాల్గొనడానికి వెళితే, దానికోసం భిన్నమైన ఏర్పాట్లు చేస్తారు. ర్యాలీల్లో కాకుండా మరేదైన ఇతర కార్యక్రమాలకు వెళ్తుంటే వాటికోసం మరో రకమైన భద్రతను ఏర్పాటు చేస్తుంటారు. ప్రతీ అడుగులోనూ ఆయన భద్రతను క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు.

”ప్రధానమంత్రి భద్రతా వైఫల్యం చాలా పెద్దది” అని పీటీఐ లాంగ్వేజ్ ఎడిటర్ నిర్మల్ పాఠక్ అన్నారు. నిర్మల్, చాలా కాలం పాటు పీఎంవో వార్తలను కవర్ చేశారు.

”ఏ పర్యటనకు ముందైనా, అక్కడికి వెళ్లి ఎస్పీజీ రెక్కీ నిర్వహించి వస్తుంది. ఆ తర్వాత కొన్ని ఎస్పీజీ బృందాలను అక్కడ మోహరిస్తారు. రాష్ట్రానికి చెందిన భద్రతా ఏజెన్సీతో ఇంటెలిజెన్స్ బ్యూరో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉంటుంది” అని నిర్మల్ చెప్పారు.

ఎస్పీజీ అంటే ఏమిటి?

ఎస్పీజీ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ప్రత్యేక భద్రతా బృందం) లేదా స్పెషల్ ప్రొటెక్షన్ టీమ్. ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి, వారి కుటుంబ సభ్యులకు అత్యంత పటిష్టమైన రక్షణను కల్పించాలనే లక్ష్యంతోనే 1985లో ఎస్పీజీని స్థాపించారు. 1984లో భారత ప్రధాని ఇందిరా గాంధీ హత్య జరిగిన తర్వాత 1988‌లో ఎస్పీజీ పూర్తిగా అమల్లోకి వచ్చింది. ఎస్పీజీ కోసం వార్షిక బడ్జెట్‌లో రూ. 375 కోట్ల కంటే ఎక్కువే కేటాయిస్తారు. దేశంలోనే అత్యంత ఖరీదైన, అత్యంత పటిష్టమైన భద్రతా వ్యవస్థగా దీన్ని పరిగణిస్తారు.

ఆరోపణలు- ప్రత్యారోపణలు

ఈ ఘటన నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు.

”ఇది భద్రతా వైఫల్యం కాదు. ప్రధాని అర్ధంతరంగా తిరిగి వెళ్లిపోవడం పట్ల చింతిస్తున్నా. హోం మంత్రి అమిత్ షా గారి నుంచి ఫోన్ వచ్చింది. ‘అక్కడేదో పొరపాటు జరిగింది. ప్రధాని మోదీ తిరిగి వచ్చేస్తున్నారు’ అని ఆయన అన్నారు. నా తరఫు నుంచి అయితే ఎలాంటి తప్పూ జరగలేదు” అని హోం మంత్రికి చెప్పినట్లు చన్నీ తెలిపారు.

”ప్రధాని భద్రత కోసం పూర్తి ఏర్పాట్లు చేశాం. ఇందులో శాంతి భద్రతల సమస్య లేదు. వారిని ఆందోళనకారులు అడ్డగించారు. దాంతో వారు తిరిగి వెళ్లిపోయారు. ఇకనుంచి మరింత పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు చేస్తానని ఇప్పుడే చెబుతున్నాను” అని చన్నీ విలేఖరులతో చెప్పారు.

ఇదే సమయంలో కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ కూడా విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె అనేక ఆరోపణలు చేయడంతో పాటు పలు ప్రశ్నలను సంధించారు.

”ప్రధానమంత్రి ప్రాణాలను ప్రమాదంలో పడేశారు. పంజాబ్ పోలీసులు కేవలం మూగ ప్రేక్షకుల్లాగా మిగిలిపోయారు. కాంగ్రెస్ వారి ‘నెత్తుటి ఉద్దేశ్యాలు’ విఫలమయ్యాయి. నరేంద్ర మోదీని కాంగ్రెస్ ద్వేషిస్తోంది. అయితే వారి కోపాన్ని భారత ప్రధాని హోదాపై చూపొద్దని ఇప్పటికే చాలా సార్లు చెప్పాం. ఈరోజు కాంగ్రెస్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది” అని స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

”ప్రధాని భద్రత విషయంలో కావాలనే భద్రతా సిబ్బందికి అబద్ధం చెప్పారా? పీఎం కాన్వాయ్‌ను ఆపే ప్రయత్నం జరిగింది. 20 నిమిషాల పాటు పీఎం భద్రతను గాల్లో వదిలేశారు. నిరసనకారులను అక్కడికి తరలించింది ఎవరు?” అని ఆమె ప్రశ్నించారు. ప్రధానమంత్రి భద్రతా లోపంపై వస్తోన్న ఆరోపణలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా స్పందించారు. ”ప్రధాని, అందరికి చెందిన వారు. ఈ విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావు లేదు” అని ఆయన అన్నారు. ఈ ఘటనపై వివరణాత్మక నివేదిక అందించాలని హోం మంత్రిత్వ శాఖ, పంజాబ్ ప్రభుత్వాన్ని కోరింది.