WorldWonders

కేజీ మిఠాయి రూ.16000.. అంత ధర ఎందుకంటే?

కేజీ మిఠాయి రూ.16000.. అంత ధర ఎందుకంటే?

మన దేశంలో స్వీట్లంటే ఇష్టం ఉండని వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇంట్లో శుభకార్యం జరిగినా, పండగలకైనా మిఠాయిలు ఉండాల్సిందే. చిన్న,పెద్ద అనే తేడా లేకుండా అందరి వీటిని అమితంగా లాగించేస్తుంటారు మరి. కొంతమందైతే కొత్త కొత్త స్వీట్లను ఆరగించడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి వారి కోసమే తయారీదారులు మార్కెట్‌లోకి ఎప్పటికప్పుడు రకరకాల మిఠాయిలను తీసుకొస్తుంటారు. వెండి పూత స్వీట్లు (కాజు కట్లీ) ఈ కోవకు చెందినవే. ఇప్పుడు ఏకంగా బంగారు పూత స్వీట్లు కూడా వచ్చేశాయి. ఈ బంగారు పూత మిఠాయిలను ఎక్కడ విక్రయిస్తారో తెలుసా..

మన దేశ రాజధానిలోనే. దిల్లీలోని మౌజ్‌పూర్ లో ఉన్న షాగూన్ స్వీట్స్ షాపులో ఈ బంగారు మిఠాయిలను విక్రయిస్తున్నారు. ఒక నిర్దిష్టమైన మిఠాయిపై బంగారు పూత పూసిన తర్వాత దానిపై కొంచెం కుంకుమ పువ్వును ఉంచి అందంగా అలంకరిస్తున్నారు. ఫుడ్ బ్లాగర్ అర్జున్ చౌహన్ తన ఇన్‏స్టా ఖాతాలో షేర్ చేశారు. నోరూరించే ఈ మిఠాయిని ఇంటిల్లిపాదితో కలిసి తినాలంటే చాలా డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఈ మిఠాయి కేజీ ధర అక్షరలా రూ.16,000. ఇంత ధర ఉన్నా దీన్ని రుచి చూడటానికి జనం ఎగబడుతున్నారు. ఈ మిఠాయి తయారు చేసే వీడియో ఇప్పుడు ఇన్‏స్టాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోకి ఇప్పటివరకు 6,21,264 లైక్‌లు, ఎన్నో వందల కామెంట్లు వచ్చాయి.