DailyDose

TNI నేటి తాజా వార్తలు -07/01/2022

TNI  నేటి  తాజా వార్తలు -07/01/2022

* రాష్ట్రంలోని పాఠశాల, జూనియర్‌ కళాశాలలకు శనివారం నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. జూనియర్‌ కళాశాలలకు ఈ నెల 8 నుంచి 16వ తేది వరకు పండుగ సెలవులుగా ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి ఎంవి శేషగిరిబాబు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సెలవు రోజుల్లో యాజామాన్యాలు తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలలకు కూడా ఈ నెల 8వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 17న కళాశాలలు, పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి.

*సంక్రాంతి పండుగ ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో 50శాతం అదనంగా చార్జీలు పెంచడం సరికాదు. – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.ప్రైవేటు బస్సు ఆపరేటర్లు హైదరాబాద్-విజయవాడకు రూ.3 వెలు, హైదరాబాద్-విశాఖకు రూ.5 వెలు చార్జీలను వసూలు చేయడం దుర్మార్గం.తెలంగాణ ఆర్టీసీ సర్వీసుల్లో చార్జీలను పెంచలేదు.తెలంగాణ తరహాలో ఏపీఎస్ఆర్టీసీలో కూడా సాధారణ చార్జీలు వసూలు చేయాలి.ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల దోపిడీని నియంత్రించాలి.

*తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి ఉద్యోగులపై ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఫైర్ అయ్యారు. కోవిడ్ థర్డ్ వేవ్‌పై సబ్ కలెక్టర్ నిధి మీనాతో కలసి ఎమ్మెల్యే శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో ఆసుపత్రి సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

*కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌కు డీజీ.బీపీఆర్‌–డీ (డైరెక్టర్‌ జనరల్‌ బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌) డిస్క్‌ అవార్డు లభించింది. కోవిడ్‌ కంటే ముందే వీడియో కాన్ఫరెన్స్‌ విధానాన్ని అందరికీ పరిచయం చేసి, స్పందన కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఈ అవార్డును ప్రకటించింది.

*సంక్రాంతి రద్దీకి తగ్గట్టుగా ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు 6,970 ప్రత్యేక బస్సులు నడపనున్నామని ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ నెల 7 నుంచి 18 వరకు వీటిని నడుపుతామన్నారు. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 7 నుంచి 14 వరకు 3,755 సర్వీసులు, 15 నుంచి 18 వరకు మరో 3,215 సర్వీసులను నడుపుతామన్నారు.

*డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) విదేశీ కరెన్సీ బాండ్ల జారీ ద్వారా 4 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ. 30,000 కోట్లు) సమీకరించింది. తద్వారా గరిష్టస్థాయిలో ఫారెక్స్‌ బాండ్లను జారీ చేసిన తొలి దేశీ కార్పొరేట్‌గా నిలిచింది. మూడు దశలలో జారీ చేసిన ఈ బాండ్ల ద్వారా సమకూర్చుకున్న నిధులను రుణ చెల్లింపులకు వినియోగించే ప్రణాళికల్లో ఉంది. ఫిబ్రవరిలో గడువు తీరనున్న 1.5 బిలియన్‌ డాలర్ల రుణం దీనిలో కలసి ఉన్నట్లు తెలుస్తోంది.

*చేనేత పరిశ్రమను ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రంలో అంగన్‌వాడీ ఉద్యోగులకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా చేనేత చీరలు పంపిణీ చేశారు. హైదరాబాద్‌లోని కేటీఆర్‌ క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, కమిషనర్‌ దివ్యా దేవరాజన్‌ పాల్గొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని 67,411 మంది టీచర్లు, ఆయాలకు ఈ చీరలు పంపిణీ చేస్తామని మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు.

*ఏప్రిల్‌లో జరిగే ఇంటర్‌ మొదటి, రెండో ఏడాది పరీక్షలకు సంబంధించిన ఫీజు వివరాలను ఇంటర్‌ బోర్డ్‌ గురువారం ప్రకటించింది. ఫస్టియర్‌ అన్ని గ్రూపులకు, సెకండియర్‌ ఆర్ట్స్‌ గ్రూపుల విద్యార్థులు రూ.490, సెకండియర్‌ సైన్స్‌ గ్రూపు విద్యార్థులు (ప్రాక్టికల్స్‌ కలిపి) రూ.690 చెల్లించాలని పేర్కొంది.

*వేతన సవరణ (పీఆర్‌సీ)పై ఉద్యోగులు తమ అంచనాలను కాస్త తగ్గించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సూచించారు. తెలంగాణతో పోల్చుకోవద్దని.. ప్రాక్టికల్‌గా ఆలోచించాలని హితవు పలికారు.

*సామర్లకోటలో దళిత యువకుడు గిరీష్ ఆత్మహత్యకు కారణమైన ఎస్ఐ అభిమన్యును డిస్మిస్ చేసి అరెస్ట్ చేయాలని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. ఈరోజు సాయంత్రంలోగా ఎస్ఐ అభిమన్యును అరెస్ట్ చేయకపోతే రేపు సామర్లకోటను ముట్టడిస్తామని హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న దళితులంతా రేపు ఉదయం 10 గంటలకు ఛలో సామర్లకోటకు తరలిరావాలని పిలుపునిచ్చారు.

*టీడీపీ సీనియర్ నేత వైవీబీ రాజేంద్రప్రసాద్ హౌస్ అరెస్ట్ అయ్యారు. వైసీపీ నాయకుల మైనింగ్ దోపిడికి నిరసనగా లంకపల్లి ఇసుక క్వారీ దగ్గరికి బయలుదేరిన రాజేంద్ర ప్రసాద్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. మైనింగ్‌లో దేశంలోనే ఏపీని మొదటి స్థానంలో నిలిపిన ఘనత వైసీపీ నాయకులదేనన్నారు.

*రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహా మృత్యుంజయ జపం నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ పంజాబ్ పర్యటనలో కాంగ్రెస్ ప్రభుత్వ దమన కాండను దేశం మొత్తం గమనించిందన్నారు. షెడ్యూల్ ప్రకారం ప్రధాని హెలికాఫ్టర్‌లో వెళ్లాల్సి ఉన్నా.. రోడ్డు మార్గాన పంపారని విమర్శించారు.