Politics

TNI నేటి గరం గరం రాజకీయం – 07/01/2022

TNI Political News – 07/01/2022

*త్వరలో MP పదవికి రాజీనామా.. రఘురామ సంచలన ప్రకటన
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం నాడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. త్వరలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తనపై అనర్హత వేటు వేయించడానికి ఎంత సమయం కావాలో‌ చెప్పాలని ఒకింత సవాల్ విసిరారు. అంతటితో ఆగని ఆయన.. ఎంపీ పదవికి రాజీనామా చేసిన అనంతరం రాజధాని అమరావతి ఎజెండాతో మళ్ళీ ఎన్నికలకు వెళ్తానని ప్రకటించారు. జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎంత అసహ్యించుకుంటున్నారో తన ఎన్నిక ద్వారా నిరూపిస్తానని చెప్పుకొచ్చారు.

*ఎన్నికల ఫలితాలతో పొత్తులకు సంబంధం లేదు: చంద్రబాబు
ఎన్నికల కోసం తాను కుప్పం రాకున్నా ఏడుసార్లు ప్రజలు గెలిపించారని.. వాళ్లతో తనది భావోద్వేగపూరిత అనుబంధమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో భాగంగా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వాస్పత్రిలో ఏర్పాటుచేసిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్‌ విధ్వంసకారి అని.. కక్ష, కార్పణ్యాలు, బెదిరింపులతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

*ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో కేసీఆర్‌పై రాములమ్మ తీవ్ర విమర్శలు
తెలంగాణ సర్కార్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి అలియాస్ రాములమ్మ మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి ఫేస్‌బుక్, ట్విట్టర్ వేదికగా శుక్రవారం నాడు స్పందించిన రాములమ్మ.. సీఎం కేసీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ పోస్ట్‌పై పెద్ద ఎత్తున అభిమానులు, బీజేపీ కార్యకర్తలు స్పందించి కామెంట్స్ చేస్తున్నారు.

*ఐటీఐఆర్‌పై కేంద్రం పునరాలోచించాలి: కేటీఆర్‌
ఎలక్ట్రానిక్‌ సర్వీస్‌ డెలివరీలో తెలంగాణ ముందుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. డిజిటల్‌ లావాదేవీల కోసం రాష్ట్ర ప్రభుత్వం టీ వ్యాలెట్‌ను తీసుకొచ్చిందని చెప్పారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో నిర్వహించిన జాతీయ ఈ-గవర్నెన్స్‌ సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ-గవర్నెన్స్‌తో పాటు ఎమ్‌ (మొబైల్‌) గవర్నెన్స్‌కు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు.

*టీఆర్ఎస్ పార్టీ నుంచి వ‌న‌మా రాఘ‌వ స‌స్పెన్ష‌న్‌
పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు ప్రధాన నిందితుడిగా ఉన్న కొత్త‌గూడెం పార్టీ నాయ‌కులు వనమా రాఘవేంద్ర టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వనమాపై సస్పెన్షన్ వేటు పడింది. తక్షణమే సస్పెన్షన్ అమల్లోకి వస్తుందని టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.

*పంజాబ్‌లో బీజేపీ సభకు జనం లేక వెలవెలబోయింది: మస్తాన్‌ వలీ
పంజాబ్‌లో బీజేపీ సభకు జనం లేక వెలవెలబోయిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ పేర్కొన్నారు. పంజాబ్ ఘటనకు మోదీ రాజకీయ రంగు పులుముతున్నారన్నారు. ప్రధాని స్థాయికి తగ్గట్టుగా మోదీ మాటలు లేవన్నారు. ప్రధాని భద్రత చూసేది కేంద్రమని… రాష్ట్రంపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మస్తాన్ వలీ పేర్కొన్నారు.

*రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తా: రఘురామ
త్వరలోనే తన పదవికి రాజీనామా చేస్తానని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. తనపై అనర్హత వేటు వేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తానే సమయం ఇస్తున్నానని.. వారంలో నిర్ణయం చెప్పాలని పరోక్షంగా వైకాపా అధినాయకత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో రఘురామ మీడియాతో మాట్లాడారు. తనపై అనర్హత వేటు వేయకపోతే తానే రాజీనామా చేస్తానని చెప్పారు. తాను రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్తానని.. వైకాపాపై ఎంత వ్యతిరేకత ఉందో ఎన్నికల ద్వారా తెలియజేస్తానన్నారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలించేందుకు, రాజధానిగా అమరావతే కొనసాగేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు రఘురామ చెప్పారు

*నా బాధను అధిష్ఠానానికి నేరుగా చెప్తాను: ఎమ్మెల్యే జగ్గారెడ్డి
లే అవుట్లను క్రమబద్ధీకరించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామాల్లోనూ ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు రూ.లక్షలు అప్పు చేసి ఇల్లు నిర్మించుకుంటారని.. నిర్మాణం పూర్తి అయిన వాటిని కూల్చడం సరికాదన్నారు. ప్రజల కోణంలో ఆలోచించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ప్లాట్లు, ఇళ్లు క్రమబద్ధీకరించాలని కోరుతూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ నెల 8న ఇందిరా పార్కు వద్ద 10 మందితో నిరాహార దీక్ష చేయనున్నట్లు చెప్పారు. పార్టీ అంతర్గత విషయాలను బయట పెట్టనని జగ్గారెడ్డి తెలిపారు. తన బాధను రాజకీయ వ్యవహారాల కమిటీలో చెప్పినట్లు పేర్కొన్నారు.

*ఇంతటి దారుణానికి పాల్పడితే చర్యల్లేవా?: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు కారణమైన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేందర్‌ను వెంటనే అరెస్టు చేయాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఒక ఎమ్మెల్యే కుమారుడు ఇంతటి దారుణానికి పాల్పడితే చర్యలు తీసుకోకపోవడం అత్యంత దారుణమన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డికి మంచి పేరుందని… సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటనలో నిందితుడైన రాఘవేందర్‌ను అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలన్నారు.

*కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్లా: జీవీఎల్‌
కేంద్ర ప్రభుత్వంపై బురద చల్లడం రాష్ట్ర ప్రభుత్వానికి రివాజుగా మారిందని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సైతం రాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్లు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. చెత్త పన్ను విషయంలో అధికార పార్టీ నాయకుల మాటలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. విశాఖలో జీవీఎలో మీడియాతో మాట్లాడారు. ప్రధాని ఫసల్‌ బీమా యోజన రాష్ట్రంలో అమలు చేయట్లేదని మండిపడ్డారు. మిర్చి పంటపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సీఎంకు లేఖ రాసినట్లు జీవీఎల్‌ చెప్పారు.

*ఎమ్మెల్యే వనమా రాజీనామా చేయాలి- కాంగ్రెస్‌ నేతల డిమాండ్‌
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో వనమా రాఘవేంద్రరావు అరాచకాలకు తాళలేక రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రకటన విడుదల చేయగా పలువురు గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. వెంకటేశ్వరరావును తెరాస నుంచి సస్పెండ్‌ చేయాలని, రాఘవేంద్రరావును వెంటనే అరెస్టు చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

*ఫార్మాసిటీ పెద్ద కుంభకోణం- ఎంపీ కోమటిరెడ్డి ఆరోపణ
రంగారెడ్డి జిల్లా యాచారం ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మాసిటీ పెద్దకుంభకోణం అని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. కేవలం కమీషన్ల కోసమే ప్రభుత్వం పని చేస్తోందని ఆరోపించారు. ఆయన గురువారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫార్మాసిటీ ఏర్పాటును కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో దాదాపు రూ.60 వేల కోట్లు అవినీతి జరిగిందని తాము ఎప్పుడో చెప్పామని.. ఇన్నాళ్లకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు తెలిసిందని ఎద్దేవా చేశారు.

*ఇందిరాపార్క్‌ వద్ద రేపు నిరసన దీక్ష: జగ్గారెడ్డి
గ్రామ పంచాయతీ పరిధిలోని అనుమతి లేని లేఅవుట్లను, అక్రమ నిర్మాణాలను ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ పథకాల ద్వారా క్రమబద్ధీకరించాలని కోరుతూ శనివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నట్లు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. గురువారం ఆయన అసెంబ్లీ మీడియాహాలులో విలేకరులతో మాట్లాడారు. దీక్షకు పోలీసుల అనుమతి కోరినట్లు, అనుమతి రాకపోయినా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పది మందితో ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు దీక్ష చేస్తానని చెప్పారు. పార్టీ మారే ఆలోచన తనకు లేదని, చివరి నిమిషం వరకు కాంగ్రెస్‌లోనే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల నాయకత్వంలో పని చేస్తానని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు జగ్గారెడ్డి సమాధానమిచ్చారు.