Agriculture

పల్నాటి కదనాన ‘చిట్టిమల్లు’ పుంజు

పల్నాటి కదనాన ‘చిట్టిమల్లు’ పుంజు

*బ్రహ్మనాయుడు పందేనికి దింపిన కోడిపుంజు మనదే
*నల్లగొండ జిల్లాకు మాత్రమే ప్రత్యేకమైన బ్రీడ్ ‘చిట్టిమల్లు’
*800 ఏళ్ళ నాడే తెలంగాణలో బలమైన పశుసంపద

సంక్రాంతి పండుగ అన్నా, పల్నాటి యుద్ధమన్నా ముందుగా గుర్తుకొచ్చేది కోడి పందెమే. తెలంగాణ ఆడబిడ్డ, తొలి మహిళా మహామంత్రి నాగమ్మ, బ్రహ్మనాయుడు మధ్య యుద్ధానికి దారితీసిందీ ఈ కోడి పందెమే. ఎంతోమంది మరణంతో పలనాడు మరుభూమిగా మారేందుకూ ఆ పందెమే కారణం. 8 శతాబ్దాల కిందట పల్నాటి ప్రాంతాన్ని శాసించిన పందెంలో బ్రహ్మనాయుడు తరఫున తలపడిన పుంజు నల్లగొండ జిల్లా పానగల్లుదే కావడం గమనార్హం. అదే చిట్టిమల్లు బ్రీడ్ పుంజు.

***కోడి పందేలు అనగానే ఏపీలోని ఉభయగోదావరి జిల్లాలు గుర్తుకొస్తాయి. కానీ, శతాబ్దాల కిందటే జరిగిన పల్నాటి కోడి పందెంలో తెలంగాణ చిట్టిమల్లు బ్రీడ్ కోడి పుంజు తలపడింది. 12వ శతాబ్దానికి పూర్వమే తెలంగాణ పాడి పంటలతో ఎలా విలసిల్లిందో, బలమైన పశు సంపదకు ఆలవాలంగా నిలిచిందన్నది చారిత్రక వాస్తవం. చరిత్రలో రాజుల మధ్య జరిగిన యుద్ధాలు అనేకం ఉండొచ్చు. కానీ, ఇద్దరు మంత్రుల వైరం వల్ల జరిగిన రణం పలనాటి యుద్ధం. పోరాట ఘట్టంలో వెలుగులోకి రాని ఎన్నో వాస్తవాల నడుమ కొందరు రచయితల పుణ్యమాని శాంతికాముకురాలైన తెలంగాణ ఆడబిడ్డ, తొలి మహిళా మహామంత్రి నాగమ్మను విలన్గా చిత్రీకరించారు. కుట్రలే శస్త్రంగా సాగిన బ్రహ్మనాయుడు దైవంగా కీర్తి పొందాడు. అందుకోసం ఆయన ఆ రోజుల్లోనే ప్రత్యేకమైన ప్రచార వ్యవస్థను ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతానికి మనం చిట్టిమల్లు కథ మాత్రం చెప్పుకొందాం.

**పల్నాడు చీలికతో మొదలుక్రీస్తుశకం 12వ శతాబ్దం పల్నాడు ప్రాంతా న్ని అనుగురాజు.. ఆయన అనంతరం నలగామరాజు పాలించారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా ఆరవెల్లికి చెందిన నాగమ్మ.. తల్లిని కోల్పోవడంతో పలనాడులోని మేనమామ ఇంటికి చేరుకొంటుంది. బహుభాషలు, శాస్ర్తాల్లో ప్రవీణురాలు అయిన నాగమ్మ.. యుద్ధ విద్య ల్లో ఆరితేరింది. కాలపరిణామంలో అనుగురాజుకు కొంతకాలం మంత్రిగా పనిచేసి.. ఆ తరువాత ఆయన రాసిచ్చిన పత్రం ప్రకారం నలగాముడికీ తాత్కాలిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించింది. నలగాముడికి ప్రధానమంత్రిగా బ్రహ్మనాయుడు వ్యవహరించాడు. బ్రహ్మనాయుడు అతని అనుచరగణం కాజేసిన రాజ్యం సొత్తును నాగమ్మ తిరిగి సాధించి ఖజానాకు చేరడంతో ఇద్దరిమధ్య వైరం పెరిగింది. పందేల వ్యసనం ఉన్న బ్రహ్మనాయుడు ఓ కుట్రకు తెరదీస్తాడు. కోడి పందేల ద్వారా రాజ్యాన్ని కాజేయాలని పథకం పన్నాడు. ఈ విషయాన్ని చరిత్ర పరిశోధకుడు వైహెచ్కే మోహన్రావు తన ‘శాంతిదూత నాయకురాలు’ అనే పుస్తకంలో ప్రస్తావించారు. బ్రహ్మన్న ఓడిపోతే ఏలేశ్వరం (నేటి నాగార్జునసాగర్ ప్రాంతం) దాటి ఏడేండ్లు, నాగమ్మ ఓడి తే చిట్యాల రేవు గుం డా మూడున్నరేండ్లు వెళ్లిపోవాలన్నది నాటి ఒప్పందం.

**కోడిపుంజు కోసం పానగల్లుకు..నాయకురాలి కోడి పుంజును ఓడించే పుంజు బ్రహ్మనాయుడి దగ్గర లేదు. పోరులో గెలిచే శక్తిమంతమైన పుంజును పానగల్లు (నల్లగొండ సమీపం)లో చూసినట్టు అతని సోదరుడు బాదన్న చెప్తాడు. దాన్ని తీసుకురావాలని అనుచరుడు వీరపడాలును పంపిస్తాడు. నాటి రేవు ప్రాంతమైన చిట్యాల (నల్లగొండ జిల్లా) దగ్గర కృష్ణానదిని దాటి, అడ్డుకున్న ఇక్కడి సైనికులను చంపి పానగల్లుకు చేరుకుంటాడని ‘పల్నాటి వీరచరిత్ర’లో రాశారు. ‘బ్రహ్మనాయు డు తన అన్న బాదన్నతో సంప్రదించి వీరపడాలుచే నల్లగొండ సమీపంలోని పానగల్లు నుంచి చిట్టిమల్లు అనే కోడిని మంత్రాక్షతలు జల్లి తెప్పించినాడు’ అని గుర్రం చెన్నారెడ్డి రాసిన ‘పల్నాటి చరిత్ర’ కూడా వివరించింది.

**కదనరంగంలో చిట్టిమల్లువీరపడాలు నుంచి చిట్టిమల్లును అందుకున్న బ్రహ్మనాయుడు.. ప్రేమతో నిమురుతూ ‘చిట్టిమల్లా! నీ మీదే ఆశలు పెట్టుకున్నాం. మనకి జయం చేకూరాలని ఒకసారి ఎలుగెత్తిచాటు’ అని కోరాడు. చిట్టిమల్లు దిక్కులు పిక్కటిల్లేలా కూత పెడుతుంది. మొదటి పోరులో చిట్టిమల్లు గెలుస్తుంది. మారుపోరులో నాయకురాలు.. పుంజును మార్చగా, బ్రహ్మనాయుడు మాత్రం చిట్టిమల్లునే దింపాడు. అలిసిన చిట్టిమల్లు నేలకొరిగినట్టు చరిత్రకారులు చెప్తున్నారు. తర్వాత బ్రహ్మనాయుడు ఒప్పందం మీరడం, పల్నాటి యుద్ధం, నాగమ్మ గెలిచి నలగాముడే పల్నాటి రాజు కావడం తెలిసిందే. చిట్టిమల్లు అనే పుంజు నల్లగొండ జిల్లాకు మాత్రమే ప్రత్యేకమైన బ్రీడ్ అని పశుసంవర్ధకశాఖ అధికారులు చెప్తున్నారు.

**చారిత్రక పట్టణం పానగల్లు
రాష్ట్రంలోని ప్రాచీన నగరాల్లో పానగల్లు ఒకటి. క్రీ.శ 11-12 శతాబ్దాల్లో కుందూరు చోడుల రాజధానిగా ఉండేది. కాకతీయుల సామంతులైన కందూరు చోడుల్లో ఉదయానచోడుడు ఉద యసముద్రం చెరువును తవ్వించి తాగు, సాగునీరు అందించాడు. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామ లం చేశాడు. నల్లగొండ పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గ్రామంలోని పచ్చల, ఛా యా సోమేశ్వరాలయాలు, 70 స్తంభాలతో నిర్మించిన మహా మండపాలు మధ్యయుగపు వాస్తు శిల్పకళా వైభవానికి అద్దంపడుతున్నాయి.