Devotional

TNI – ఆధ్యాత్మిక వార్తా తరంగిణి – 08/01/2022

TNI – ఆధ్యాత్మిక వార్తా తరంగిణి – 08/01/2022

* ఇరుముడితో శబరిమల ఎందుకెళతారంటే?.
మండల దీక్ష పూర్తయిన తర్వాత శబరిమలలో కొలువైన అయ్యప్ప దర్శనానికి ఇరుముడి కట్టుకొని బయల్దేరుతారు స్వాములు. ఇరుముడి అంటే రెండు ముడులు కలది. ఆ రెండూ భక్తి, శ్రద్ధ. ఇరుముడికి కట్టే తాడు ప్రణవం. భక్తి, శ్రద్ధలను సాధనతో పొందగలిగితే.. స్వామి అనుగ్రహం లభిస్తుంది. ఇరుముడి ఒక భాగంలో గురుస్వామి దేవుడికి సంబంధించిన సామగ్రి ఉంచుతారు. రెండో భాగంలో నీళ్లు తొలగించిన కొబ్బరికాయలో ఆవునెయ్యిని నింపి ఉంచుతారు. జీవాత్మ, పరమాత్మలను అనుసంధానం చేయడం ఇందులోని ఆంతర్యం. ఈ నేతితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఇరుముడితో శబరిమల ఆలయంలోని పద్దెనిమిది మెట్లు ఎక్కి అయ్యప్పస్వామిని దర్శించుకుంటారు. ఇరుముడి లేకుండా మెట్లు ఎక్కడానికి అర్హత ఉండదు. అయ్యప్పను దర్శించుకొని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు భక్తులు. తర్వాత దీక్షాపరులు పుణ్యక్షేత్రాల మీదుగా ఇంటికి చేరుకుంటారు. ఇంటికి వచ్చిన తర్వాత తల్లితో అయ్యప్ప మాల తీయించుకుంటారు. ఏదైనా ఆలయంలో పూజారి చేతుల మీదుగా కూడా దీక్ష విరమణ చేస్తారు. దీక్షనిచ్చిన గురుస్వామితో దీక్ష విరమణ చేయించవచ్చు. దీక్ష విరమణతో మళ్లీ పాత అలవాట్లకు లోబడితే అయ్యప్ప దీక్ష ధారణ సార్థకం కాదు. మాల విరమించినా.. నియమాలు లేకున్నా.. వ్యక్తిత్వంలో వచ్చిన మార్పును కొనసాగించాలి. జీవితాన్ని మహోన్నతంగా తీర్చిదిద్దుకోవాలి.

*మెట్టు మెట్టూ ప్రత్యేకం…
శబరిమలలో స్వామి దర్శనానికి ముందు 18 మెట్లు ఎక్కాలి. దీన్నే పదునెట్టాంబడి అంటారు. అఖండ సాలగ్రామ శిలతో వీటిని పరశురాముడు నిర్మించాడని పురాణ కథనం. అందుకే ఈ క్షేతాన్ని పరశురామ క్షేత్రం అంటారు. ఈ మెట్లను మానవుని స్థూల, సూక్ష్మ శరీరాలకు ప్రతీకగాచెబుతారు. అయ్యప్పస్వామి మణికంఠునిగా 12 ఏండ్లు పందలం రాజు దగ్గర పెరిగాడు. మహిషిని వధించిన తర్వాత అవతార పరిసమాప్తి చేశాడు. ఆయన శబరిగిరిలో చాలా ఉన్నతమైన స్థానంలో కొలువుదీరడానికి వీలుగా నాలుగు వేదాలు, రెండు శాస్ర్తాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానం దేవతా రూపాలు దాల్చి పద్దెనిమిది మెట్లు కాగా అయ్యప్ప వాటిమీద పాదాలు మోపుతూ ఉన్నత స్థానాన్ని చేరుకున్నాడని పురాణ కథనం.

*రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రం శుక్రవారం భక్తులతో రద్దీగా మారింది. మేడారం సమ్మక్క సారక్క జాతర సమీపిస్తున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు సర్వదర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి చేరుకుని తమ ఇష్టదైవమైన శ్రీరాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకుని తరించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు కోడెమొక్కు చెల్లించుకున్నారు. శ్రీస్వామివారి నిత్యకల్యాణ,ం సత్యనారాయణవ్రతం, కుంకుమపూజ తదితర ఆర్జిత సేవలలో పాల్గొన్నారు. రద్దీ తట్టుకునేందుకు ఆలయ అధికారులు గర్భాలయంలో రుద్రాభిషేకం, అన్నపూజ తదితర ఆర్జిత సేవలు నిలిపివేసి లఘుదర్శనం అమలు చేస్తున్నారు. అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ ఆలయం భక్తులతో రద్దీగా మారింది.

*తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 29,652 మంది భక్తులు శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.75 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 14,916 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

*శ్రీబాలాజీ ఆరోగ్యవరప్రసాదిని పథకానికి రూ.కోటి విరాళం
తితిదే శ్రీబాలాజీ ఆరోగ్యవరప్రసాదిని పథకాని(స్విమ్స్‌)కి మహారాష్ట్రలోని పుణెకు చెందిన సాగర్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సంస్థ రూ.1,00,11,000 విరాళంగా అందించింది. శుక్రవారం తిరుమలలోని దాతల విభాగం కార్యాలయంలో డిప్యూటీ ఈవో ఎం.పద్మావతికి ఆ సంస్థ ప్రతినిధి విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు.

*శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు గుండెపోటు సంభవించిన సమయంలో తక్షణ చికిత్సకు టీపీఏ (టిష్యూ ప్లాస్మినోజెన్‌ యాక్టివేటర్‌) ఇంజెక్షన్‌ను ప్రభుత్వ రుయా ఆసుపత్రి సహకారంతో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. శుక్రవారం నుంచి స్థానిక రాంభగీచా విశ్రాంతి గృహం వద్ద ఉన్న ప్రథమ చికిత్స కేంద్రంలో ఈ ఇంజెక్షన్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ.. గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం వంటి సమస్యల కారణంగా గుండెపోటు సంభవిస్తే ఈ ఇంజెక్షన్‌ వేసిన వెంటనే తక్షణ రక్షణ లభిస్తుందని వైద్యులు చెప్పారన్నారు. దక్షిణాదిన ప్రభుత్వ రుయా ఆసుపత్రికే ఈ ప్రాజెక్టు మంజూరైందని తెలిపారు.

* భోగిపళ్లు
తెల్లవారు జామున భోగిమంటల దగ్గర చిన్నారులు ఎంత సంబరపడాతారో..సాయంత్రం భోగిపళ్లు పోసేటప్పుడు
కూడా ఆ ఉత్సాహం అలాగే కొనసాగుతుంది. చిన్నపిల్లల్ని చక్కగా అలంకరించి, కూర్చోబెట్టి భోగిపళ్లు పోస్తారు. ఇలా
చేయడం వెనుక కారణం ఏంటంటే.. రేగు చెట్టుకు బదరీ వృక్షం అని పేరు. రేగు చెట్లు, రేగు పండ్లు శ్రీమన్నారాయణుడి ప్రతి
రూపం. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం. అందుకే సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపళ్ళతో నాణేలను కలిపి
పిల్లల తలపై పోస్తారు. వాటిని తల పై పోయడం వలన శ్రీ లక్ష్మి నారాయణుల అనుగ్రహం మన పిల్లలపై ఉంటుందని, పిల్లలకి
ఉన్న దిష్టి తొలగి పోయి వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని పెద్దల విశ్వాసం. మన కంటికి కనిపించని బ్రహ్మ రంధ్రం తలపై
భాగంలో ఉంటుందని.. ఈ భోగి పండ్లను పోయడంతో ఆ బ్రహ్మ రంధ్రం ప్రేరేపితమై పిల్లలు జ్ఞానవంతులు అవుతారని కూడా
చెబుతారు. ఎందుకంటే రేగు పండ్లు సూర్య కిరణాల్లో ప్రాణశక్తి ని అధికంగా గ్రహించి, నిల్వ ఉంచుకుంటాయి. అందుకే
రేగుపళ్లు తలపై పోయడం వలన వీటిలో విద్యుశ్చక్తి ఆరోగ్యాన్నిస్తుందని అంటారు.