Fashion

వారసత్వ సంపద .. గంగిరెద్దులాట ! 

వారసత్వ సంపద .. గంగిరెద్దులాట ! 

భారతీయ జీవన విధానంలో పశు సంపదకు ఎంతో ప్రాముఖ్యం ఉన్నది . ఆవును గోమాతగా భావిస్తే, ఎద్దు.. నందీశ్వరుడిగా (శివుడి వాహనంగా) పూజలు అందుకొంటున్నది. ఆ పాడి పశువులే ప్రధాన పాత్రధారులయ్యే జానపద కళారూపం ‘గంగిరెద్దులాట’. మన సంస్కృతిలోనూ భాగమైంది. పూర్వకాలం నుంచీ మనుగడలో ఉన్న ఈ కళ .. పల్లెవాసులతోపాటు పట్టణవాసులనూ అలరిస్తున్నది. గంగిరెద్దులాట మన సంస్కృతిలో ఓ భాగం. సంక్రాంతి వచ్చిందంటే చాలు .. గంగిరెద్దులాటలతో పల్లెలన్నీ సందడిగా మారుతాయి . గంగిరెద్దుల వాళ్లు ఎద్దులతో చేయించే విన్యాసాలు అబ్బురపరుస్తాయి.

**గంగిరెద్దులవాళ్లు ముందుగా వయసులో ఉన్న కోడె గిత్తల్ని ఎన్నుకొని, మచ్చిక చేసుకుంటారు. సర్కస్ జంతువులకు తర్ఫీదు ఇచ్చినట్లు వాటికి నృత్య విన్యాసాలు నేర్పిస్తారు. డోలూ, సన్నాయిలాంటి వాద్యాలకు అనుగుణంగా అడుగులు కదిపేలా, తమ మాటలకు తగినట్లు తల ఊపూలా పాఠాలు నేర్పిస్తారు. ముందరి కాలెత్తి సలాం చేసేలా, ఒక కాలు గాల్లో ఉంచి మూడు కాళ్ల మీద నిలబడేలా తర్ఫీదునిస్తారు. సాధారణ కోడెలను ప్రత్యేక శ్రద్ధతో నాట్య విన్యాసాలు చేసే గంగిరెద్దులుగా తీర్చిదిద్దుతారు. ఆ తర్వాత ఆటకు తీసుకువస్తారు. కొందరు పెద్దల జ్ఞాపకార్థం లేగ దూడలను గంగిరెద్దులవాళ్లకు దానం చేస్తారు. వాటికి శిక్షణ ఇచ్చి ఆటలాడిస్తారు.

****ఆకట్టుకొనే అలంకరణ
గంగిరెద్దుల అలంకరణ ఆకట్టుకునేలా ఉంటుంది . ఉన్నంతలో అందంగా తీర్చిదిద్దుతారు . బట్టలను బొంతలుగా కుట్టి, వాటికి అద్దాలు పొదుగుతారు . మరింత ఆకర్షణ కోసం చెమ్కీ దండలు జతచేసి, మూపురం నుంచి తోక వరకూ కప్పుతారు . ముఖం దగ్గర రంగుల తోలు కుచ్చు, మూతికి తోలుతో శిఖమారు కడుతారు. దగ్గర రంగుల తోలు కుచ్చు, మూతికి తోలుతో కుట్టిన శిఖమారు కడుతారు . కాళ్లకు గజ్జెలు , మెడలో గంటలు కట్టి బసవన్నను అలంకరిస్తారు. వాటిని ఆడించే కళాకారులూ ప్రత్యేకంగా ముస్తాబవుతారు. నెత్తికి రంగుల తలగుడ్డ మూతిమీద కోరమీసాలు , చెవులకు కమ్మల జోడు, పాత కోటు, చేతికి వెండి మురుగులు, పంచె ధరించి ఆకర్షణీయంగా కనిపిస్తారు. సన్నాయి బూర , డోలు , చేతిలో చిన్న కంచు గంట పట్టుకొని ప్రదర్శన నిర్వహిస్తారు. ఆటతోపాటు గాత్రంతోనూ వినోదాన్ని పంచుతారు. సన్యాసమ్మ, రాములోరు, గంగరాజు, ఈశ్వరమ్మ, వీరగున్నమ్మ పాటల్లాంటివి పాడతారు.

***ఆడిస్తూ.. ఆశీర్వదిస్తూ ..
సంక్రాంతి పర్వదినాల్లో ఇంటింటికీ తిరుగుతూ గంగిరెద్దులను ఆడిస్తారు . తమ ఇంటికొచ్చిన గంగిరెద్దును సాక్షాత్తు నందీశ్వరుడి స్వరూపంగా భావించి ఇంటివాళ్లు హారతి పట్టి పూజిస్తారు.‘డూ డూ బసవన్న .. రా రా బసవన్నా..’ అనగానే ఎద్దులు ముందుకు వస్తాయి. ‘అమ్మవారికి దండంబెట్టూ .. అయ్యగారికి దండంబెట్టు ‘ అనగానే , ముందరి కాలెత్తి సలాం చేస్తాయి. ‘అయ్యగారికి శుభం కలుగుతుందా ! తలపెట్టబోయే కార్యం సఫలమవుతుందా! ‘అనగానే గంగిరెద్దులు తలాడించడాన్ని శుభ సూచకంగా, నందీశ్వరుడి దీవెనగా భావిస్తారు. గంగిరెద్దువాళ్లు కూడా ఎద్దు ముందుకాళ్లను ఛాతీమీద పెట్టుకొని ఆడిస్తారు. ఇంటిల్లిపాదినీ తమదైన శైలిలో పొగుడుతూ, ఆశీర్వచనాలు ఇస్తారు.

**ప్రాచీనకాలం నుంచే ..
‘గంగిరెద్దుల వాడు కావరమణచి ముకుతాడు పొడిచి పోటెద్దులట్లు ‘అని’ పలనాటి వీర చరిత్ర’లో శ్రీనాథుడు ఉదహరించాడు. దీనిని బట్టి ప్రాచీనకాలం నుంచే ఈ గంగిరెద్దులాట ప్రచారంలో ఉన్నదని తెలుస్తున్నది. గంగిరెద్దులవాళ్లు ఎద్దులను కుటుంబ సభ్యులుగా భావిస్తారు. గంగిరెద్దు చనిపోతే, మనిషికి చేసినట్టే అంత్యక్రియలు చేస్తారు. దినకర్మలూ నిర్వహిస్తారు. శతాబ్దాల చరిత్ర కలిగిన గంగిరెద్దులాట, నేడు కనుమరుగయ్యే స్థితికి చేరుకొన్నది. ఈ కళను నమ్ముకొని తరాలుగా జీవనం సాగించిన వేలాది కుటుంబాలు, ప్రస్తుతం ఆదరణలేక ఇతర వృత్తులను ఆశ్రయిస్తున్నాయి.