Politics

TNI రాజకీయం – కాంగ్రెస్ లోకి సోనూసూద్ – 10/01/2022

TNI రాజకీయం – కాంగ్రెస్ లోకి  సోనూసూద్ – 10/01/2022

* కాంగ్రెస్లో చేరిన సోనూసూద్..
సోనూసూద్ సోదరి మాళవికా సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మోగాలోని సోనూ నివాసం ఈ కార్యక్రమానికి వేదిక అయ్యింది.
పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధు.. మాళవికను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చన్నీ కూడా పాల్గొన్నారు.త్వరలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాళవిక బరిలోకి దిగే అవకాశముంది. తన సోదరి రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని బాలీవుడ్ నటుడు సోనూసూద్ గతంలోనే ప్రకటించారు. తాను రాజకీయాల్లో చేరుతానంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.

*ఎన్నికల తర్వాతే ప్రత్యామ్నాయ ఫ్రంట్‌లు
దేశంలో ఎన్నికల తర్వాతే ప్రత్యామ్నాయ ఫ్రంట్‌లు ఏర్పడుతాయని చరిత్ర చెబుతోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. 1996లో యునైటెడ్‌ ఫ్రంట్, 2004లో యూపీఏ, 1998లో ఎన్డీఏ వంటివన్నీ ఎన్నికల పూర్తయిన తర్వాత ఏర్పడినవేనని ఉదహరించారు. 1977లో ఇందిరాగాంధీ ఓడిన సమయంలో జనతా పార్టీ కూడా ఎన్నికల తర్వాతే ఏర్పడిందన్న విషయాన్ని గుర్తుచేశారు.

*మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నిరసన సెగ
తెలంగాణలో ఉపాధ్యాయ బదీలలో గందరగోళం నెలకొంది. సీనియార్టీ ప్రాతిపాదికన తీసుకొని ఉపాధ్యాయ బదిలీలు చేపట్టడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ బదిలీలపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని జూనియర్‌ కాలేజీల అధ్యాపకుల సంఘం ముట్టడించింది. మంత్రి ఇంటి ముందు బైఠాయించి బదిలీలకు కారణమైన విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయను సస్పెండ్ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మొత్తం బదిలీల వ్యవహారంపై ప్రభుత్వం సమీక్షించాల్సిగా కోరారు. బదిలీల్లో అవకతవకలు జరిగాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీంతో మంత్రి ఇంటి వద్ద ఉద్రిక్త వాతార‌ణం నెల‌కొంది.

*ఎమ్మెల్యే పదవికి వనమా రాజీనామా చేయాలి: వీహెచ్
రామకృష్ణ ఆత్మహత్యతో తన కొడుకు రాఘవకు సంబంధమున్న నేపథ్యంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. ఈటెలను భూ కబ్జా కేసులో రాజీనామా చేయించిన సీఎం కేసీఆర్.. వనమాతో రాజీనామా ఎందుకు చేయించరని ఆయన ప్రశ్నించారు. రామకృష్ణ కుటుంబం సూసైడ్ ఘటనపై రాష్ట ప్రభుత్వం సీరియస్‌గా చర్యలు తీసుకొవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

*ఏపీ సీఎం జగన్‌రెడ్డికి ఎంపీ రఘురామ సవాల్
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి ఎంపీ రఘురామ కృష్ణంరాజు సవాల్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 5లోగా తనను ఎంపీగా డిస్ క్వాలిఫై చేయించాలన్నారు. లేదంటే దమ్ములేని సీఎంగా ఒప్పుకోవాలని ఛాలెంజ్ చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మోదీ, అమిత్‌షా, స్పీకర్‌కు ఎవరికైనా తనపై ఫిర్యాదు చేసుకోవాలన్నారు.ఏపీ సచివాలయ ఉద్యోగుల డిమాండ్లలో న్యాయముందని సచివాలయ ఉద్యోగులకు మద్దతు తెలుపుతున్నానని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి అండమాన్ దీవుల్లో తిరగడం మానేసి.. ప్రజల కష్టాలు చూడాలన్నారు. ఉద్యోగులను రెగ్యులర్ చేయకుండానే ఆరోగ్యశ్రీ తొలగించారని విమర్శించారు. సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తించడం లేదని సీఎం జగన్ మొద్దునిద్ర వదిలి ఉద్యోగుల ఆందోళనలు చూడాలని సూచించారు. భీమిలి ఎంఆర్‌వో ఉద్యోగులను బెదిరిస్తున్నారని ఇదంతా ప్రభుత్వ కనుసన్నల్లోనే నడుస్తోందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు.

*స్టర్‌ డోస్‌తో ప్రయోజనాలున్నాయి… అనుమానాలొద్దు: మంత్రి
బూస్టర్‌ డోస్‌తో ప్రయోజనాలున్నాయని.. అనుమానాలొద్దని మంత్రి హరీష్ రావు అన్నారు. సోమవారం రాష్ట్రంలో బూస్టర్‌ డోస్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ బూస్టర్‌ డోస్‌ వేసుకోవాలని సూచించారు. అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల్లో కూడా బూస్టర్‌ డోస్‌ వేసుకుంటున్నారని తెలిపారు. హెల్త్‌ కేర్‌, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 60ఏళ్లు పైబడిన వారు డోస్‌ వేసుకోవాలని అన్నారు. ప్రజాప్రతినిధులంతా ఇందులో భాగస్వామ్యం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. టీకా పంపిణీలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ వేగంగా పూర్తి చేసేందుకు యత్నిస్తున్నామని అన్నారు. యునానీ ఆస్పత్రిలో సమస్యలపై చర్చించామని… ఆస్పత్రిలో ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ ఇస్తామని వెల్లడించారు. ప్రభుత్వం అందరికీ ఉచితంగా టీకాలు అందిస్తోందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

* ఏపీలో తక్షణమే “ఫిస్కల్ కౌన్సిల్” ఏర్పాటు చేయాలి: యనమల
జగన్‌రెడ్డి పాలనలో ఏపీ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఏపీలో తక్షణమే “ఫిస్కల్ కౌన్సిల్” ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ ఉల్లంఘనలకు తక్షణమే అడ్డుకట్ట వేయాలన్నారు. బడ్జెట్‌లో కేటాయింపులకు, ఖర్చులకు పొంతనే ఉండడం లేదని అన్నారు. బడ్జెట్ కేటాయింపులను పక్కనపెట్టి జగన్‌రెడ్డి తోచిన విధంగా ఖర్చు చేయడం వల్లే బడ్జెట్‌కు విలువ లేకుండా పోయిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ తరహా వ్యవహారశైలి కేవలం బడ్జెట్ ఉల్లంఘనే కాదు.. చట్టసభలను అగౌరవ పర్చడమే అని అన్నారు. రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో అవినీతి కుంభకోణాలు, ప్రజాధనం దుర్వినియోగం తప్ప అభివృద్ధే లేదని యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు.