Devotional

ఇంటికన్నా గుడిపదిలమని ఎందుకు అన్నారో ?

ఇంటికన్నా గుడిపదిలమని ఎందుకు అన్నారో ?

ప్రసాదమనే మాటకు అన్నం అనే అర్థముంది. దేవుడిగుడిలో తీర్థప్రసాదాలెందుకు ఇస్తారో తెలుసా ? అందులోని అసలు పారమార్థమేమిటో ఆలోచించారా ?
లేదుకదూ ! గుళ్ళోదేవుడి ప్రసాదం పెడతారు, కృష్ణారామా అంటూ స్వీకరిస్తాము కళ్ళకు అద్దుకొంటాము తింటాం. ఇంతేకదా ! కాదు కాదు ఇందులో ఎంతో నిగూర్థముంది. అదేమిటో ఒకసారి పరిశీలిద్దామా !

మన రవాణాకు ఇప్పుడైతే అత్యాధునిక వాహనాలున్నాయి. భూజలవాయు మార్గాలలో అవి చిటికెలో మనలను గమ్యస్థానం చేరుస్తాయి.

మరి మనపూర్వీకుల వాహనాలు కాలినడక ఎడ్లబండ్లు గుర్రపుబగ్గీలు గుర్రపుసవారీలు ఏనుగు అంబారీలు ఒంటెలపై వయ్యారాలు, పడవలపై ప్రయాణాలే కదా ! ధనికులైతే వారికి పల్లకీలు మేనాలు అందలాలు వుండేవి. గాడిదపై మన బరువులు ఎద్దు దున్నపోతులపై మనసరుకులు వీలైతే మనమూ. ఇంతే ఆనాటి ప్రయాణసాధనాలు.వీటిల్లో గుర్రం ఆ తరువాత ఒంటే ప్రయాణాలు కాస్తంతా వేగంగా నడిచే జీవులు. మీకు తెలుసో లేదో ఇరవయ్యవ శతాబ్దపు తొలి దశాబ్దంలో 90శాతం ప్రజలు పాంథులే (పాదాచారులే ).

పెళ్ళైనా ఉత్సవమైనా ఊరేగింపైనా బంధుమిత్రులను కలవాలన్నా చావు కబురైనా ఇలా ఏమైనాసరే ప్రయాణం నాడు అంత తేలిగ్గా వుండేది కాదు. దారులన్ని డొంకలతో అటవీప్రాంతాలతో నదీమతల్లుల అడ్డంకులతో క్రూరమృగాల దోపిడిదొంగల భయంతో కూడివుండేవి. దగ్గరి జానపదాలైతే ( పల్లెలు ) ఫరవాలేదు కాని దూర ప్రయాణాలకైతే ఫరవావుండేది.

నాడు ప్రయాణానికి మనవారు సద్దులు మూటలు కట్టుకొని గుంపులు గుంపులుగా బయల్దేరేవారు. ఏ వంకో వాగో చెరువో బావో నూయ్యో కాలువో తలిపిరో బుగ్గో మడుగో కోనేరో చలమో ఎదురైతే చెట్టుకింద కూర్చోని ఆ సద్దిని తిని దోసిళ్ళతో నీల్లు తాగి మరలా బయలుదేరేవారు.

మరి తీర్థయాత్రా ప్రయాణామంటే రోజులు వారాలు పక్షాలు నెలలు కొండకచో సంవత్సరాలు కూడా పట్టేవి. ఉదా॥ ఏనుగుల వీరాస్వామయ్యగారి కాశీయాత్ర గురించి విన్నారు కదా !
అతను కాశీయాత్రకు మద్రాసునుండి (ప్రస్తుతం చెన్నై) 1830 మే 18న బయలుదేరి, తన ప్రయాణంలో భారతదేశంలోని అనేక ప్రాంతాలను సందర్శించాడు.

ఆయన తిరుపతి, కడప, అహోబిలం, హైదరాబాదు, వేములవాడ, నిర్మల, ధనోరా, నాగపురం (నాగపూర్), రామటెంకి, జబల్పూర్, రీమా, మీర్జాపూర్, ప్రయాగ, కాశీ, పాట్నా, గయా, రాజమహల్, కృష్ణానగర్, కలకత్తా, గోపాల్‌పూర్, కటక్, పూరి- వంటి ప్రదేశాలలో బస చేశారు. జగన్నాథం, చిల్కా సరస్సు, గంజాం, ఛత్రపూర్, బెర్హంపూర్, శ్రీకాకుళం, విజయనగరం, సింహాచలం, రాజమండ్రి, ర్యాలి, మచిలీపైట్నం, బాపట్ల, చిన్న గంజాం, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, పొన్నేరి మొదలైన క్షేత్రాలు తిరిగి 31 సెప్టెంబర్ 18న మద్రాసు తిరిగి వచ్చాడు.

ఇతని కాశీయాత్ర ఒక సంవత్సరం ఎనిమిది నెలల సుదీర్ఘకాలం పట్టింది. వీరస్వామయ్య అప్పట్లో మదరాసు సుప్రీంకోర్టులో interpreter అంటే అనువాదకుడు వ్యాఖ్యాతగా పనిచేసేవాడు. ఆ రోజులలో అనువాదకుడంటే అతిపెద్ద హోదా. కాబట్టి ఆంగ్లేయులిచ్చిన సిఫారసు వుత్తరాలతో అధికసోమ్ముతో దాదాపు 50మంది సహయకులతో పల్లకీలు మోసేబోయిలతో కాశీయాత్ర చేసోచ్చాడు.

మరి సామాన్యుల సంగతో ! వారు తీసుకుపోయిన చల్ది (సద్ది) మహవుంటే రెండ్రోజులు వుంటుంది.సామాన్యుడు కాబట్టి పూటకూళ్ళ (హోటళ్లు) సత్రాలు (లాడ్జీలు ) లలో ప్రవేశం కష్టంగా వుండేది. మరి ప్రయాసపడి భారం మోసుకొని పోయేవాడి ఆకలిని ఎవరు తీరుస్తారు. ఎవరైనా మహానుభావులు పుణ్యాత్ములు దారిలో ఉచిత అన్నసత్రాలు చలివెందరలు ఏర్పాటుచేసివుంటే అందులో పెట్టింది తిని, దొరికింది త్రాగి భుక్తాయాసం తీర్చుకొని మరలా నడకసాగించేవాడు.
అలాంటి అన్నసత్రాలు చల్లని చలివేంద్రాలు లేకపోతే ఏమిటీ పరిస్థితి. అలాంటి పరిస్థితిలో దిక్కేమిటంటే ఆ వూర్లోవున్న గుడే.
అనార్తులైన బాటసారులను ఆకలిగొన్న ఆపన్నుల ఆదుకోవాలన్న సదుద్దేశంతో దేవుడి పేరుతో వితరణ చేసే ప్రసాదలే వారిని ఆదుకొనేవి. దేవుడి సమర్పించే అమృతపడి నైవేద్యాలు పప్పుబెల్లాలు గుగ్గిల్లు దేవుడేమి తినడు, కాని ఆ రాముడో కృష్ణుడో శంకరుడో తన పేరున పెట్టే నైవేద్యాలను ఆ గుడిపూజారి రూపంలోనో ధర్మకర్త చేతలలోనో లేదా అయాగాండ్ల సేవలద్వారానో సూదూరాలనుండి ప్రయాణించి వచ్చిన ప్రయాణికులకు ( భక్తులకు) పంచిపెట్టి ఆకలిని తీర్చేవాడు.
( చల్లనిమజ్జిగ కేంద్రాలు.మజ్జిగ చల్లగా ఎలా వుంటుందంటే కొత్తకుండలో పోస్తారు కనుక, చలువపందిర్లు వేస్తారు కాబట్టి)

మనలో దానబుద్ధి కాస్తా తక్కువనే చెప్పాలి, దేవుడంటే భక్తివుంది, పుణ్యలోకాలకు చేరాలన్న కాంక్షవుంది, దేవుడి పేరుతో నైవేద్యాలు అన్నప్రసాదాలు ఇవ్వటానికి సిద్ధంగా వుంటాము, ఇస్తాము కూడా ! ఇందులో కొందరు నిజమైన పుణ్యాత్ములు కూడా వుంటారనుకోండి.