Devotional

దేవతలు నిత్యం పూజించే ‘పారమ్మ తల్లి ‘ – TNI ఆధ్యాత్మికం

దేవతలు నిత్యం పూజించే ‘పారమ్మ తల్లి ‘  -TNI  ఆధ్యాత్మికం

విజయనగరం జిల్లా సాలూరు పారమ్మ తల్లి కొండమీద ప్రకృతి రమణీ సౌందర్యము సాలూరు శివలింగ కొండ. పారమ్మ తల్లి దేవాలయము. సాలూరు సమీపంలో పార్వతీదేవి కొండపై వెలసిన స్థానం శ్రీ పారమ్మ కొండ క్షేత్రం. ఇక్కడ ప్రతి శివరాత్రి సమయంలో ఆంధ్ర ఒరిస్సా నుండి భక్తులు వచ్చి కొండ శిఖరం పై వెలసిన అమ్మవారిని దర్శించుకుంటారు.ఈ కొండకు సుమారు 2800 మెట్లు వుంటాయి . కొన్ని వందల సంవత్సరాల పూర్వం జైనుల కాలంలో అమ్మవారిని ప్రతిష్ఠించినట్లు చరిత్ర.పాండవుల వనవాస సమయంలో ఇక్కడ కొన్నాళ్ళు వున్నారని ఇక్కడ ఉన్న గుహకు పాండవులగుహ అని పేరు . ఇవికాక కొండపై వినాయక ఆలయం, పురాతన భువనేశ్వర ఆలయం, సుబ్రమణ్య ఆలయం, శివాలయం ఉన్నాయి.
*ప్రతి అమావాస్య పున్నమి అర్ద రాత్రులలో కొండపై జ్యోతులు దర్శనమిస్తాయని కొండక్రింద గ్రామాలలో గల గిరిజనులు చెప్తారు. ప్రతి పౌర్ణమి రోజు కొండపై పూజలు నిర్వహిస్తారు. విజయనగరం జిల్లా సాలూరు ప్రాతంలో అతి ఎత్తయిన కొండపై అతిపురాతనమైన పార్వతీదేవి విగ్రహాన్ని సుమారుగా 2400 సంవత్సరాలకు పూర్వమే ప్రతిష్ఠించి ఉండొచ్చు అని పురావస్తుశాఖ వారు నిర్థారించారు..అమ్మవారి విగ్రహంపై శివుడు ధ్యానం చేస్తూ కనిపిస్తాడు..ప్రపంచం మొత్తంలో శివపార్వతులు ధ్యానంలో ఉండే ఇటువంటి విగ్రహం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది అమ్మవారు వెలసిన ఈ శిఖరం శివలింగాకారంలో ఉంటుంది..
*చాలా ఎత్తుగా ఉండే ఈ శిఖరంపై అమ్మవారి విగ్రహాన్ని కొన్ని వందల ఏళ్ళకు పూర్వం దేవతలు ప్రతిష్ఠించారు. దేవతలు ఇక్కడ నిత్యం ధ్యానం చేస్తారు అంట. మహిమ గల అమ్మవారి విగ్రహం 36 చేతులు శిరస్సుపై శివుడు కలిగి ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైనది… జైన్ లకు సంబంధించిన కొన్ని పురాతన గ్రంథాలలో కూడా మన అమ్మవారి చరిత్రవుంది. అమ్మవారి రూపం ఒక్కోసమయంలో ఒక్కోలా ఉంటుంది. ఒకసారి నవ్వుతు, ఒకసారి చిన్నపిల్లలా, ఒకసారి మౌనంగా, ఒకసారి పెద్దమ్మలా… ఇలా చాలా రకాలుగా అమ్మవారి విగ్రహం మారుతూ మారుతూ మనకు కనిపిస్తుంది. విశిష్టమైన రోజుల్లో మరియు ఆమావాస్యరాత్రులలో కొండపైవెలుగులతో కూడిన జ్యోతుల కనిపిస్తాయి అని ప్రత్యక్షంగా చూసిన కొండ క్రింద గ్రామాలలో నివసించే గిరిజనులు చెప్తారు… నిదర్శనంగా ఇప్పుడు కూడా అమ్మవారిని దేవతలు శక్తులు జ్యోతిరూపంలో దర్శించి పూజిస్తారు అని ఇక్కడ ప్రజల నమ్మకం.కొండ మధ్యలో ఓ గుహ వుంది ఇక్కడ పాండవులు వనవాస సమయంలో కొద్దిరోజులు ఉన్నారట అందుకే ఆ గుహకు పాండవుల గుహ అని పేరు… ఆ గుహలో చాలా పురాతన శివలింగం వుందంటా.కొండపై హనుమంతు కోతి జాతి గుంపు ఒకటుంది ఇవి 3నుండి 5 అడుగుల ఎత్తు ఉంటాయి.. అప్పుడప్పుడు కొండపై ఎలుగుబంట్లు కనిపిస్తాయి. ఈ మహిమగల కొండపై ధ్యానం చేసేవారికి త్వరగా సిద్దులు వస్తాయి అని నమ్మకం. సిద్దులు ప్రసాదిస్తుంది కనుక తల్లిని సిద్దేశ్వరి అని .. చేతిలో చక్రాలు వున్నాయి కనుక చక్రేశ్వరి అని పార్వతీదేవి కనుక పారమ్మతల్లి అని వనదుర్గ అని అమ్మవారి పేర్లు రకరకాలుగా పిలుస్తారు. కాని స్థానికులు మాత్రం పారమ్మతల్లి గానే కొలుస్తారు.
**దేవతలచే నిత్యం పూజింపబడే అమ్మను ప్రతి సంవత్సరం శివరాత్రిరోజున మాత్రమే వేలమంది భక్తులు దర్శిస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి పౌర్ణమి రోజున క్రమం తప్పకుండా అమ్మను సనాతన ధర్మపరిషత్ భక్తులు దర్శించి పూజలు చేస్తున్నారు … మిగతారోజుల్లో ఈ కొండ ఎక్కడం చాలా కష్టం..ఒకవేళ కొండ ఎక్కి అమ్మవారిని దర్శించాలి అంటే… స్థానిక గిరిజనుల సహాయం తీసుకోవాల్సిందే.

2. ప్రాణహిత పుష్కరాలు – 2022 ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 24 వరకు_
ప్రాణహిత నది పుష్కరాలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే పుష్కరాల ఏర్పాట్లపై అధికారులను అప్రమత్తం చేస్తోంది. తెలంగాణ ఏర్పాటు అనంతరం ప్రాణహిత నదికి ఇవే తొలి పుష్కరాలు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ సుమన్ తో కలిసి ఇటీవల అధికారులతో సమీక్షించారు. పుష్కర స్నానాల నిమిత్తం లక్షల్లో వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏట ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 24 వరకు ప్రాణహిత పుష్కరాలు జరుపుకోనుండగా రాష్ట్ర ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ , మహారాష్ట్ర , చత్తీస్ ఘడ్ ల నుంచి ప్రజలు భారీగా తరలివస్తారని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2010 డిసెంబర్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రాణహిత నది పుష్కరాలు జరుపుకున్నారు. తెలంగాణ ఉద్యమ నాయకునిగా ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రాణహిత నది అర్జున్ గుట్ట పుష్కరఘాట్లో పుష్కర స్నానం చేశారు. అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రాణహిత నది పుష్కరాలకు హాజరయ్యారు. సినీ నటుడు , ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కూడా అర్జున్ గుట్ట పుష్కరఘాట్లో స్నానం చేశారు.
**ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు , ఎమ్మెల్యేలు , సినీ నటులు , ప్రభుత్వ అధికారులు అర్జునగుట్ట పుష్కరఘాట్లో పుణ్యస్నానాలు ఆచరించారు. రాకపోకలకు అనుగుణంగా రోడ్లు నిర్మించినందున కోటపల్లి మండలం అర్జునగుట్ట పుష్కరఘాటు లక్షల్లో భక్తులు తరలొచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. పుష్కర స్నానాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఇప్పటి నుంచే స్థానిక స్థితిగతులపై దృష్టి సారించాలని , భక్తుల తాకిడికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంబంధిత ఆదేశించారు. పుష్కర ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని , ఇప్పటి నుంచే అప్రమత్తం కావాలని ఆదేశాలు జారీ చేశారు.
*ప్రాణహిత నది పుష్కరం
మీనరాశిలోకి బృహస్పతి ప్రవేశించినప్పుడు ప్రాణహిత నదికి పుష్కరం వస్తుంది. ఈ ఏట ఏప్రిల్ 12న రాత్రి మీనంలో బృహస్పతి ప్రవేశిస్తోంది. బుధవారం చైత్ర శుద్ధ ద్వాదశి ఏప్రిల్ 13 ఉదయం నుంచి పుష్కరం ప్రారంభమై చైత్ర బహుళ అష్టమి ఆదివారం 24 ఏప్రిల్ 2022 వరకు (పుష్పరం) 12 రోజులు పుష్కరాలు నిర్వహిస్తారు.
*ఎక్కడి నుంచి ఎలా
గోదావరి నదికి అతి పెద్ద ఉపనది ప్రాణహిత. ఈ నది మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం , అదేవిధంగా సత్పురాశ్రేణుల దక్షణ వాలుల్లో ప్రవహిస్తోంది. వైన్ గంగ , పైన్ గంగా , వర్ణానది మూడు నదులు మహారాష్ట్రలోని ఆస్తి అనే గ్రామం గుండా ప్రవహించి తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి గ్రామంలో ప్రాణహిత జన్మించింది. బెజ్జూర్ మండలం గూడెం , సోమిని , తలాయి , వేమనపల్లి మండలం రావులపల్లి , వేమనపల్లి , కలలపేట , ముల్కల్లపేట , రాచర్ల , వెంచపల్లి , కోటపల్లి మండలం జనగామ , నందరాంపల్లి , పుల్లగామ , సిర్సా , అన్నారం , అర్జునగుట్ట గ్రామాల మీదుగా ప్రవహిస్తోంది. మహారాష్ట్ర వైపు గడ్చిరోలి జిల్లాలోని చప్రాల నుంచి ప్రారంభమై అయిరి , ఇందారం , దేవలమర్రి చెట్టులో వెలిసిన వేంకటేశ్వరస్వామి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తోగుల వెంకటాపూర్ మీదుగా ప్రవహిస్తూ రేగుంట , కొత్తూర్ , తేకడా , గిలాస్పేట , రాయిపేట , రంగాయపల్లి , హమురాజీ , సిరోంచ మీదుగా భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తేశ్వర్లుగా వెలిసిన పరమేశ్వరుని పుణ్య క్షేత్రమైన కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో కలుస్తోంది. గోదావరి , ప్రాణహిత , అంతర్వాహిని
సరస్వతి నదులతో త్రివేణి సంఘమంగా విరాజిల్లుతోంది.
*ప్రాణహిత నది గోదావరిలో కలిసే వరకు
ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి గ్రామం నుంచి ప్రాణహిత నదిగా బెజ్జూర్ , వేమనపల్లి , కోటపల్లి మండలాల మీదుగా 113 కిలో మీటర్లు ప్రవహించి కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో కలుస్తోంది. తుమ్మిడిహెట్టి , అర్జునగుట్ట , వేమనపల్లిలో ప్రాణహిత నదికి పుష్కరాలు జరుపుకుంటారు. ప్రాణహిత నదికి మంచిర్యాల వరకు రైలుమార్గంలో వచ్చినా లేదా బస్సులో వచ్చినా అక్కడి నుంచి 37 కిలో మీటర్ల దూరంలో ఉన్న చెన్నూర్ చేరుకోవాలి. చెన్నూర్ నుంచి మరో 19 కిలో మీటర్లు మహారాష్ట్ర సరిహద్దు వరకు ప్రయాణిస్తుండగా మధ్యలో ఉన్న అర్జునగుట్ట వద్ద ప్రాణహిత పుష్కరం జరుగుతోంది. చెన్నూర్ నుంచి నేరుగా వేమనపల్లి వరకు 36కిలో మీటర్లు ప్రయాణిస్తే అక్కడ కూడా ప్రాణహిత నది పుష్కరం నిర్వహిస్తారు.

3.శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ ఈరోజు(మంగళవారం) ఉదయం శాస్త్రోక్తంగా నిర్వహిస్తోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అర్చకులు, అధికారులు, సిబ్బంది ఆలయాన్ని శుద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం 11 గంటల వరకు భక్తులకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేశారు. అలాగే నేటి వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసింది.

4.కాణిపాకంలో 13న వైకుంఠ ఏకాదశి వేడుకలు
కాణిపాకంలోని వరసిద్ధుడిని ఆలయానికి అనుబంధంగా ఉన్న వరదరాజస్వామి ఆలయంలో ఈనెల 13న వైకుంఠ ఏకాదశి వేడుకలను నిర్వహించనున్నట్లు చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాణిపాకానికి చెందిన రజక సేవా సంఘం వారు ఉభయదారులుగా వ్యవహరిస్తారన్నారు. ఈ సందర్భంగా బుధవారం వరదరాజస్వామి ఆలయానికి చైర్మన్‌, ఈవోలు పట్టు వస్త్రాలను అందజేస్తారు. సాయంత్రం శ్రీదేవి,భూదేవి సమేత వరదరాజ స్వామికి ప్రాకారోత్సవం జరగనుంది.

5.బుధవారం తెరుచుకోనున్న తిరుమల ఆలయ వైకుంఠ ద్వారాలు
తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో జనవరి 13 వైకుంఠ ఏకాదశి, 14న వైకుంఠ ద్వాదశి పర్వదినాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా బుధవారం అర్ధరాత్రి తరువాత వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ధనుర్మాసం సందర్భంగా 12వ తేదీ అర్ధరాత్రి తరువాత తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొలిపి ఏకాంతంగా ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు.అనంతరం 1.45 గంటల నుంచి భక్తులను వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతించ నున్నారు. తిరుమల చరిత్రలో తొలిసారిగా గతేడాది పదిరోజుల పాటు వైకుంఠ ద్వారాలను తెరిచి భక్తులకు దర్శనం కల్పించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఈసారి కూడా 13 నుంచి 22వ తేదీ వరకు భక్తులకు దర్శనం చేయించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైంస్లాట్‌ సర్వదర్శన టోకెన్లు, శ్రీవాణి బ్రేక్‌ దర్శన టికెట్లు, వర్చువల్‌ సేవా టికెట్లను భక్తులకు టీటీడీ కేటాయించింది. మరోవైపు 13న ఉదయం 9 నుంచి 10 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణరథంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగనున్నారు.సాయంత్రం సహస్రదీపాలంకరణ సేవ తర్వాత ఉత్సవమూర్తులను తిరుచ్చిపై ఊరేగిస్తారు.ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పుష్కరిణి తీర్థ ముక్కోటిని నిర్వహించనున్నారు. వేకువజాము 5 నుంచి 6 గంటల మధ్య చక్రత్తాళ్వారును మాడవీధుల్లో ఊరేగించి వరాహస్వామి ఆలయం నుంచి పుష్కరిణిలోకి తీసుకెళ్లి చక్రస్నానం నిర్వహిస్తారు.కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని కూడా ఏకాంతంగానే నిర్వహించనున్నారు. కాగా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మంగళవారం శ్రీవారి ఆలయంలో తిరుమంజనం(ఆలయశుద్ధి) జరగనుంది.ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. ఆ తర్వాత నామకోపు, శ్రీచూర్ణం, గడ్డకర్పూరం, సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళాన్ని ఆలయం అంతా ప్రోక్షణం చేస్తారు. అనంతర భక్తులకు దర్శనం ప్రారంభమవుతుంది.