DailyDose

TNI నేటి తాజా వార్తలు – 11/01/2022

నేటి తాజా వార్తలు  – 11/01/2022

*తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. వైద్య సిబ్బందినీ కూడా కరోనా మహమ్మారి వదలడం లేదు. గాంధీ ఆస్పత్రిలో 44 మందికి కరోనా నిర్ధారణ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. 20 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, 10 మంది హౌస్సర్జన్స్, 10 మంది పీజీ విద్యార్థులు, నలుగురు టీచర్లకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. అలాగే ఉస్మానియా ఆస్పత్రిలో 27 మందికి, నీలోఫర్లో ఇద్దరు, ఈఎన్టీలో ఏడుగురికి కరోనా నిర్ధారించారు. కాకతీయ మెడికల్ కాలేజీలో 27 మంది మెడికోలకు కరోనా వైరస్ సోకింది.

*రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసు నిందితుడు వనమా రాఘవను జిల్లా జైలుకు తరలించారు. భద్రాచలం ప్రత్యేక సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రాఘవను. భద్రతా కారణాల రీత్యా కోర్టు ఆదేశాల మేరకు ఖమ్మం తరలించామని అధికారులు చెబుతున్నారు. అయితే రాఘవ తరలింపును గోప్యంగా ఉంచారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

*భోగీ, సంక్రాంతి, కనుమ సెలవుల తేదీల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలుత జనవరి 14, 15, 16వ తేదీలను సెలవులుగా ప్రకటించింది. ఈ తేదీలకు బదులుగా 13,14,15వ తేదీల్లో సెలవులు ప్రకటిస్తూ తాజాగా సవరణ జీవోను విడుదల చేసింది.

*ఈనెల 17న ప్రగతిభవన్ ఎదుట నిరసన దీక్ష చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఐదు ప్రధాన డిమాండ్లతో ప్రజా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్తో అన్ఆథరైజ్డ్ లేఔట్ ప్లాట్లను రెగ్యులర్ చేయాలన్నారు. రైతులకు లక్ష రుణమాఫీని ఒకే విడతలో చెల్లించాలని డిమాండ్ చేశారు. రుణమాఫీని 4 కిస్తీలుగా చెల్లించడం వల్ల మిత్తికే సరిపోతుందన్నారు. నిరుద్యోగ భృతి, 57 ఏళ్లకు పెన్షన్ ఇవ్వడం లేదన్నారు. అలాగే మహిళా గ్రూపులకు రుణాలే ఇవ్వడం లేదన్నారు. ఈ హామీలే కేసీఆర్ను రెండోసారి సీఎంను చేశాయన్నారు. కానీ ఆ హామీలు మాత్రం అమలు కావడం లేదన్నారు.

*బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భారత్ ఈ రోజు విజయవంతంగా పరీక్షించింది. ‘సీ-టు-సీ’ వేరియంట్ అయిన ఈ క్షిపణిని పశ్చిమ తీరంలో నేవీ విధ్వంసక నౌక ఐఎన్ఎస్ విశాఖపట్నం పైనుంచి పరీక్షించారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన ఈ క్షిపణి గరిష్ట పరిధి వద్ద నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి కచ్చితత్వంతో తుత్తునియలు చేసినట్టు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా డీఆర్డీవో శాస్త్రవేత్తలు, బ్రహ్మోస్ మిసైల్ బృందాన్ని అభినందించారు.

*నరసరావుపేట టీడీపీ ఇంచార్జ్ చదలవాడ అరవింద్బాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజాచైతన్య యాత్ర పేరుతో వార్డులలో అరవింద్బాబు పర్యటిస్తున్నారు. 15వ వార్డులో పర్యటించవద్దని పోలీసుల గృహ నిర్బంధం చేశారు. 15వ వార్డులో ఘర్షణలు జరిగే అవకాశముందంటూ అనుమతి నిరాకరించారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తుంటే… పోలీసులు అడ్డుకోవడం సరికాదని టీడీపీ నేతలు వాపోతున్నారు.