NRI-NRT

ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టులు ఇవే!

ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టులు ఇవే!

ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాను తాజాగా హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ విడుదల చేసింది. టూరిస్ట్‌ వీసా లేకుండా కేవలం పాస్‌పోర్ట్‌తో అనుమతించే దేశాల సంఖ్య ఆధారంగా ఈ జాబితాను హెన్లీ ఇండెక్స్ రూపొందించింది. గత 17 ఏళ్లుగా హెన్లీ ఇలా ప్రతియేటా పాస్‌పోర్టుల జాబితాను విడుదల చేస్తోంది. ఇక తాజాగా విడుదలైన జాబితాలో జపాన్, సింగపూర్ మొదటి ర్యాంకులో నిలిస్తే.. భారత్ 83వ స్థానంలో నిలిచింది. అయితే, గతేడాదితో పోలిస్తే భారత పాస్‌పోర్టు ఏడు స్థానాలు మెరుగుపరుచుకోవడం గమనార్హం. భారత పాస్‌పోర్టుతో ముందస్తు వీసా లేకుండా 60 దేశాలకు వెళ్లొచ్చు. అదే 2021లో ఇది కేవలం 58 దేశాలకు మాత్రమే పరిమితమైంది. ఒమన్, అర్మేనియా అదనంగా ఈ జాబితాలో చేరాయి.

**ఇక అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లు కలిగిన జపాన్, సింగపూర్‌ పాస్‌పోర్ట్ హోల్డర్లకు ప్రపంచవ్యాప్తంగా వీసా అవసరం లేకుండా 192 గమ్యస్థానాలకు వెళ్లొచ్చు. కాగా, ఈ జాబితాలో అఫ్ఘనిస్థాన్ (166) అట్టడుగు స్థానంలో నిలిచింది. అప్ఘాన్ పాస్‌పోర్టుతో వీసా లేకుండా కేవలం 26 దేశాలకు మాత్రమే వెళ్లే వెసులుబాటు ఉంది. దాయాది పాకిస్థాన్ మాత్రం 108వ స్థానంలో నిలిచింది. ఆ దేశ పాస్‌పోర్టుతో 31 గమ్యస్థానాలకు వెళ్లొచ్చు. ఈ మేరకు హెన్లీ అండ్‌ పార్ట్‌నర్స్‌ గ్లోబల్‌ సంస్థ ‘ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌ పోర్ట్‌’ పేరుతో తాజాగా జాబితాను విడుదల చేసింది. దీని ఆధారంగా ఆయా దేశాల పాస్‌పోర్ట్ హోల్డర్లు ఎన్ని దేశాలను సందర్శించవచ్చో తెలియజేస్తుంది.

**టాప్-10 పాస్‌పోర్ట్స్ ఇవే..
1. జపాన్, సింగపూర్ (192 గమ్యస్థానాలు)
2. జర్మనీ, సౌత్ కొరియా (190)
3. ఫిన్లాండ్, ఇటలీ, లక్సెంబర్గ్, స్పెయిన్ (189)
4. ఆస్ట్రియా, డెన్మార్క్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, స్వీడన్ (188)
5. ఐర్లాండ్, పోర్చుగల్ (187)
6. బెల్జీయం, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, యూకే, అమెరికా (186)
7. ఆస్ట్రేలియా, కెనడా, చెక్ రిపబ్లిక్, గ్రీస్, మాల్టా (185)
8. పోలాండ్, హంగేరీ (183)
9. లిథువేనియా, స్లోవేకియా (182)
10. ఎస్టోనియా, లాట్వియా, స్లోవేనియా (181)

**వరెస్ట్ పాస్‌పోర్ట్స్ ఇవే..
104. నార్త్ కొరియా(39 గమ్యస్థానాలు)
105. నేపాల్, పాలస్తీనా(37)
106. సోమాలియా(34)
107. యెమెన్(33)
108. పాకిస్థాన్(31)
109. సిరియా(29)
110. ఇరాక్(28)
111. అఫ్ఘనిస్థాన్(26)

హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 199 పాస్‌పోర్ట్‌లను వాటి హోల్డర్లు ముందస్తు వీసా లేకుండా యాక్సెస్ చేయగల గమ్యస్థానాల సంఖ్య ఆధారంగా ర్యాంక్స్ ఇచ్చింది. వీసా పాలసీ మార్పులు అమలులోకి వచ్చినప్పుడు ఏడాది పొడవునా ఈ జాబితాను అప్‌డేట్ చేస్తుంటారు. ప్రధానంగా ఇది ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) అందించిన ప్రత్యేక డేటా ఆధారంగా రూపొందించబడింది. ఐఏటీఏ 2006 నుండి ప్రపంచంలోని అత్యంత ప్రయాణానికి అనుకూలమైన పాస్‌పోర్ట్‌లను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తోంది.