Fashion

ఆయ్… సీమలో కూడా అల్లుళ్ళకు మర్యాదలుంటాయండోయ్!

ఆయ్… సీమలో కూడా అల్లుళ్ళకు మర్యాదలుంటాయండోయ్!

*”పండగొచ్చాంది అల్లుడిని కూతురును సంక్రాంతి కి రమ్మని చెప్పిరాపో” అంది సుబ్బమ్మ..

*”పోతాండాలే, పంపిచ్చారో లేదో, బట్టలు పెట్టాల అవికూడా పట్నం నుంచి కొనుక్కోనొస్తా” అని బయలు దేరాడు జాలిరెడ్డి,,ఊరికే అల్లుడో అల్లుడో అని రచ్చచేస్తాది అని గొణుక్కుంటూ…*

ఆమ్రావతిలో దిగి ఆ పిన్ కోడు లేని ఊరులో అల్లుడిండ్లు ఎతికి పట్టుకొని సెక్రటేరియట్ లో ఉద్యోగంచేసుకొనే కొండరెడ్డిని పండగకు రమ్మని బ్రతిమలాడుకున్నాడు.. అలాగే అమ్మి శ్రీవల్లిని కూడా..
“ఏంది నాయనా నీ రచ్చ పెనిమిటిని తోలుకోనొచ్చాపో” అని గుంటూరు కారమేసి యాటమాంసంతో భోజనాలు పెట్టింది,,.

పండగ ముందు రోజు కొండ రెడ్డి శ్రీవల్లిని పిలుచుకొచ్చేకి మరలా బామ్మర్ది బుల్ రెడ్డి పోయి తోలుకొచ్చే ,, అది చూసి సుబ్బమ్మ కాళ్ళు భూమి మీద నిలబడలే…

*ఒసే కాంతం ఎన్నపూస తాపో,, అల్లుడొచ్చాడు… తిరగవాత అన్నం చేయాల,. ఆ నల్లకోడిని బుట్టకింద పెట్టు, అని ఒకటే హైరానా పడిపోతాంది.. అల్లుడు ఇవన్నీ చూసి నవ్వుతూ తిండితో సంపేట్లున్నారు అని నిద్రపోయాడు,,*,

పొద్దున్నే లేపి నెత్తి మీద నువ్వులు పోసి ఏడి ఏడి నీళ్ళు ఆరుబయట గంగాళంలో కాంచి వళ్ళంతా నూనె పట్టించి అటు అత్త ఇటు పెళ్ళాం చేతులకు పట్టుకొని రుద్దుతాంటే మామ జాలిరెడ్డి తల మీద నూనె పోసి తదిగిణతోం తదిగిణతోం అని కొట్టుతూంటే అల్లుడు కొండరెడ్డి ప్రాణాలు పైకే పోతాయేమో అనిపించింది.. *వేడి నీళ్ళతో స్నానం చేయగానే మామ జాలిరెడ్డి ఇచ్చిన కొత్త బట్టలేసుకొని అత్త కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం తీసుకొని వేడి వేడి సద్దరొట్టే గుత్తివంకాయకూర లొట్టలేసుకొని తిని టివి ముందర కూలబడ్డాడు…*

*”రేయ్ బుల్ రెడ్డి బావ కు పైత్యమెక్కువ కొంచెం ఎలివేషన్లుండాల పోయి ఆ పుల్లారెడ్డి స్వీటు షాపులో ఉన్న అన్నిరకాలు ఓ కేజిచొప్పున తీసుకు రాపో., ఓ వందరకాలన్నా ఉండాల..ఫోటవా తీసి ఫేసుబుక్కులో పెట్టాల లేకుంటే మా అత్త సరిగ్గా పండగకు పెట్టలే అంటాడు” అని శ్రీవల్లి అంది..*

*”ఏందిమ్మే సంపేట్టుండావే,, అంతా కొనుక్కొచ్చిన సెనగపిండి పదార్ధాలు పెడితే అవి తింటే కడుపులో శంకరశర్మ దగ్గరకు పోయి పైపేపిచ్చుకోవాలమ్మీ, గ్యాస్ ట్రబులని ఆయప్ప మాత్రలు రాయిచ్చింది లాస్టుఇయరు మరచిపోయినావా,.ఏంది” అని దీనంగా చూడసాగాడు.. “సరేలే..ఎదవ ఎలివేషన్లు ఎక్స్పెక్టు చేయకు” అంటూ లోపలకు పోయింది శ్రీవల్లి..*

*కాంతం తెచ్చిన వెన్నపూస వేసి, చిత్తూరు ఉల్లిపాయలు, పత్తికొండ టమాటాలు, నంద్యాల పచ్చిమిరపకాయలు, ఆవాలు,గసగసాలతో మసాలా బండమీద మసాలా నూరి బాణలిలో పోసి యమ్మిగనూరు సోనామసూరి బియ్యంతో తిరగవాత పులావన్నం చేస్తాంటే ఆ వాసనక ఉలిక్కిపడి లేసాడు అల్లుడు కొండరెడ్డి…*

బుల్ రెడ్డి అప్పుడే నల్లకోడి తీసి జట్కా చేసి ఈకలు పీకి ముడ్డిలో కట్టె చెక్కి సన్నని మంటలో కాల్చుతుంటే మామ జాలిరెడ్డి కత్తి తెచ్చి ముక్కలు సన్నగా కోసి శ్రీవల్లి కిచ్చాడు., అత్త సుబ్బమ్మ పసుపు పూసి ఆరబెట్టి బాణలిలో నూనెపోసి మసాలా వేసి ముక్కలేసి ఉడికించసాగింది…

మంచి గడ్డపెరుగు ఉట్టిమీదనుంచి తీసి ఉల్లిపాయలేసి పెరుగుపచ్చడి చేయసాగింది..శ్రీవల్లి…

*”ఓమ్మి బోరుకొడతాంది,, అలాపోయి కోడిపందాలు, గుండాట ఆడి ఓ పదివేలు పోగొట్టుకోనొస్తా,,చేతులు ఉల ఉల అంటాండాయి” అని బయలు దేరసాగాడు అల్లుడు కొండరెడ్డి….*

*”ఆ యేసాలేముండావు..సీమలో.. బామ్మర్ది బుల్ రెడ్డితో పులిజూదమో, కారమ్సో ఆడుకో” అని అరిచింది శ్రీవల్లి..*

*మద్యాహ్నం భోజనాలు రెడీ అనగానే “లడ్డుండకావాలా” అనే పాట పక్కనపడేసి మామ జాలిరెడ్డి ఇచ్చిన నీళ్ళతో కాళ్ళుకడుక్కోని పీటమీద కూర్చున్నాడు., నువు కూర్చోమ్మే తిందువుగాని.. “మీ ఇద్దరు పక్కపక్కన కూర్చోంటే పార్వతీపరమేశ్వరులను చూసినట్లుంది” అని మురిసి పోయింది సుబ్బమ్మ,,*

*అల్లుడు ఆనందంగా ఆ పులావన్నం, నాటుకోడి కోర, గడ్డపెరుగు తింటా ఉంటే సొరగం కనపడింది,, ఇంకా ఆ పుల్లారెడ్డి 100 రకాల స్వీట్లెవడు తింటాడు.,పనోల్లకు పడెయ్యి .,అని అరిచాడు,

*సీమ ఆప్యాయత అనురాగాలతో నాలుగు రోజులు నాలుగు క్షణాల్లా గడి చాయి అల్లుడు కొండరెడ్డికి.. జాలిరెడ్డి పెట్టిన కొత్తబట్టలు, కొత్త కానుకలు, స్కూటరుతో వెళ్ళలేక వెళ్ళలేక బయలు దేరాడు అడ్రసులేని అమ్రావతికి,,,