DailyDose

భూమి సేవలను ప్రారంభించిన సీఎం జగన్

భూమి సేవలను ప్రారంభించిన సీఎం జగన్

రాష్ట్రవ్యాప్తంగా భూములు, ఆస్తుల రక్షణకు ప్రభుత్వం చేపట్టిన వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష పథకంలో భాగంగా రీసర్వే పూర్తయిన భూములకు సంబంధించిన సమగ్ర భూసర్వే రికార్డులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ప్రజలకు అంకితం చేశారు. అలాగే 37 గ్రామాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌ సేవలను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి ప్రారంభించారు. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా మంచి కార్యక్రమానికి మళ్లీ ప్రభుత్వం ముందడుగు వేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌ సేవల ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడుతూ, దేశంలో తొలిసారిగా అత్యంత శాస్త్రీయ పద్దతిలో సమగ్ర భూసర్వే తొలి దశలో 51 గ్రామాల్లో భూ సర్వే పూర్తి చేశామన్నారు. 11,501 గ్రామాల్లో డిసెంబర్‌ 2022 నాటికి రీసర్వే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ రోజు నుంచి 37 గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. భవిష్యత్‌లో వివాదాలకు తావు లేకుండా సమగ్ర సర్వే చేపట్టామన్నారు. మీ ఆస్తులు లావాదేవీలు మీ గ్రామంలో కనిపించే విధంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చన్నారు. ఇటువంటి మంచి సంస్కరణ నేటి నుంచి అమల్లోకి తెస్తున్నామని సీఎం అన్నారు.