DailyDose

కలవరం.. TNI కరోనా బులెటిన్ – 18/01/2022

కలవరం.. TNI  కరోనా బులెటిన్ – 18/01/2022

1.కొవిడ్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కొవిడ్ పరీక్ష కిట్ల పంపిణీనిప్రభుత్వం పూర్తిగా తగ్గించేసింది. గతంలో పరీక్షలు అధికంగా చేయాలని వైసీపీ ప్రభుత్వమే చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు పూర్తిగా పరీక్షలు చేయకుండా వైద్య సిబ్బందిపై ప్రభుత్వం వత్తిడి చేస్తోంది. దీంతోపలు హెల్త్ సెంటర్లలకు వెళ్లి కొవిడ్ పరీక్షలు చేయమని కోరిన బాధితులనుతిరుపతి రుయాకు వెళ్లాలని సిబ్బంది చెబుతున్నారు. తిరుపతి పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్లలోనూ కొవిడ్ నిర్దారణ పరీక్షలను నిలిపివేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.ప్రైవేటు ల్యాబుల్లోఆస్పత్రుల్లో మాత్రమే కొవిడ్ పరీక్షలు అందుబాటులో ఉండటంతో ఏమి చేయాలో తోచక జనం అల్లాడుతున్నారు. చిత్తూరులోని ఓ ఉన్నతాధికారితో సమావేశం కావాలని ప్రైవేటు ల్యాబుల నిర్వాహకులకు ఆదేశించారు.

2. డిప్యూటీ సీఎం కృష్ణదాస్ కు కోవిడ్ పాజిటివ్
డిప్యూటీ సీఎం, రాష్ట్ర రెవెన్యూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇదే విషయాన్ని ఆయన మంగళవారం ఉదయం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తనకు లక్షణాలు పెద్దగా ఏవీ లేవని అయినప్పటికీ హెూమ్ ఐసోలేషన్ ను పాటిస్తున్నట్టు తెలిపారు. కోవిడ్ నియమావళిని కచ్చితంగా పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నానని, అంతకు ముందే సంక్రాంతి సందర్భంగా క్యాంపు కార్యాలయానికి కూడా సెలవు ప్రకటించామని తెలిపారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తనకు వైరస్ సోకిందని, అయితే ఎవరూ అందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇటీవల తనను కలిసినవారు కూడా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

3. దాసన్నకు పాజిటివ్ : ముఖ్యమంత్రి జగన్
అమరావతిలో మంగళవారం శాశ్వత భూహక్కు భూరక్ష పథకాన్ని ప్రజలకు అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ దాసన్నకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో సమావేశానికి హాజరుకాలేకపోయారని అన్నారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తారని, ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శాశ్వత భూ హక్కు రక్ష పథకంలో భాగంగా రీ సర్వే పూర్తయిన పలు గ్రామాల భూ రికార్డులను ప్రజలకు అంకితం చేస్తున్న కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రిగా ధర్మాన కృష్ణదాస్ సీఎం జగన్ తో పాటు హాజరు కావాల్సి ఉంది.

4. జనసేన అధినేత పవన్ కళ్యాణ్
దేశంలోను, తెలుగు రాష్ట్రాలలో నమోదవుతున్న కోవిడ్ రోగుల గణాంకాలు ఆందోళనకరంగానే వున్నాయి. ప్రజలకు ప్రత్యక్షంగా సేవలు అందించే సిబ్బంది, ఉద్యోగులే అధిక సంఖ్యలో కోవిడ్ బారినపడుతున్నారు. ప్రజా ప్రతినిధులు, రాజకీయవేత్తలు కూడా కోవిడ్ బారినపడుతుండడం దీని తీవ్రతను తెలియచేస్తోంది. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కరోనాతో అస్వస్థతకు గురికావడం విచారకరం. ఆయన త్వరగా కోలుకుని ప్రజల కోసం ఎప్పటిలాగే పని చేయాలని కోరుకుంటున్నాను. ప్రస్తుత పరిస్థితులలో తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాలు మరింత అప్రమత్తతతో కోవిడ్ నివారణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కోవిడ్ పరీక్షలు పెంచడం ద్వారా వైరస్ సోకినవారిని గుర్తించి వైద్యం చేసే అవకాశం కలుగుతుంది. ఇందుకోసం పరీక్ష కేంద్రాలు పెంచాలి. మొబైల్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుంది. అలాగే కరోనా మొదటి వేవ్ సమయంలో పాటించిన ట్రాక్ అండ్ ట్రేస్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్ లో రాత్రి వేళ కర్ఫ్యూ, సమావేశాలు, వేడుకలపై పాక్షిక నిషేధాలు ఉన్నప్పటికీ పాఠశాలల్లో తరగతుల కొనసాగింపు ప్రస్తుత తరుణంలో వాంఛనీయం కాదు. కోవిడ్ ఉధృతి తగ్గే వరకు తరగతులను వాయిదా వేయవలసిందిగా కోరుతున్నాను. పిల్లలకు వాక్సినేషన్ పూర్తికాకపోవడం, వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వంటి అంశాలు దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవలసిందిగా వై.సి.పి. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ క్లిష్ట తరుణంలో మద్యం దుకాణాలను మరో గంటపాటు అదనంగా తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత వైఖరిని వెల్లడిస్తోంది. ఈ సమయంలో ప్రజలకు నిత్యావసరాలు ఎలా ఇవ్వాలి. వైద్య సేవలు మెరుగుపరిచేందుకు కార్యాచరణ ప్రకటించాలి. అవి లేకుండా మద్యం అమ్మకాలపై దృష్టి పెట్టడం ఏమిటి? అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్క్ లేకుండా దయచేసి బయటకు రాకండి. తిక దూరం పాటించండి. పిల్లల విషయంలో అప్రమత్తత పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.

5. గూడూరు ప్రభుత్వాస్పత్రిలో కరోనా కలకలం
గూడూరు ప్రభుత్వాస్పత్రిలో కరోనా కలకలం రేగింది. ఆరుగురు డాక్టర్లకు కరోనా పాజిటివ్‌గా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అలాగే శ్రీహరి కోట అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో కరోనా కలకలం రేగింది. 92 మందికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు నిర్ధారించారు.

6. తెలంగాణ పోలీస్ శాఖపై కరోనా పంజా
తెలంగాణ పోలీస్ శాఖపై కరోనా పంజా విసిరింది. ఇప్పటివరకు 800 మంది పోలీసులకు కరోనా నిర్ధారణ అయింది. మంగళవారం నార్సింగి పీఎస్‌లో 20 మంది పోలీసులకు కరోనా వచ్చింది. కరోనా రావడంతో పీఎస్‌ బయటే నార్సింగి పోలీసులు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. అలాగే కమిషనరేట్లు, ఎస్పీ ఆఫీస్‌లకు సాధారణ వ్యక్తుల అనుమతిని నిరాకరించారు. అత్యవసరమైతే సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులు వినియోగించుకుంటున్నారు. కరోనా కట్టడి చేసేందుకే పోలీసులు ఈ తరహా ఏర్పాట్లు చేశారు. ఇంటి దగ్గరకే పోలీస్ సేవలను అందిస్తున్నారు. ఫిర్యాదుదారులను పీఎస్‌లోకి కూడా అనుమతించడం లేదు. ఆన్‌లైన్ లేదా ఫోన్ ద్వారా ఫిర్యాదు చేస్తేనే స్వీకరిస్తామని పోలీసులు చెబుతున్నారు.

7. కొద్దిరోజులుగా వరుసగా సినీ సెలబ్రిటీస్ కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. వారిలో పలువురు అతి తక్కువ సమయంలోనే కోలుకున్నారు. మరికొందరు ఇంకా హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ఇటీవల మంచు లక్ష్మి, త్రిష తాము కోలుకున్నట్టు ట్వీట్ చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మహానటి కీర్తి సురేశ్ కూడా చేరారు. కొద్దిరోజుల క్రితం కీర్తి సురేశ్ కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఇప్పుడు తనకి నెగెటివ్ వచ్చిందని తెలుపుతూ ట్వీట్ చేశారు.
8. 15,947 మందికి Covid పాజిటివ్‌ – Bengaluruలో తగ్గిన covid కేసులు
రాజధాని నగరంలో రోజురోజుకు కొవిడ్‌ కేసులు పెరుగుతున్న తరుణంలో సోమవారం వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో ఆదివారంతో పోలిస్తే సోమవారం సుమారు 6వేల కేసులు తగ్గడం ఒకింత ఊరటనిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 27,156 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా బెంగళూరులోనే 15, 947 కేసులు ఉన్నాయి. మైసూరులో 1770, తుమకూ రు 1147, హాసన్‌ 1050, మండ్య 917, ధార్వాడ 784, బళ్లారిలో 560, బెంగళూరు గ్రామీణలో 538, దక్షిణకన్నడ 490, కలబుర్గి 479, కోలారు 463, ఉడుపి 442 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇతర జిల్లాల్లో వందల్లో కేసులు నమోదయ్యాయి. 7,827 మంది కోలుకున్నారు. 14 మంది మృతిచెందగా బెంగళూరులో ఐదుగురు, దక్షిణకన్నడ ముగ్గురు, ఆరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. మిగిలిన జిల్లాల్లో మృతులు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం 2,17, 297 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులోనే 1,57, 254మంది ఉన్నారు. బెంగళూరును కొవిడ్‌కు దిపేస్తుండగా మరోవైపు ఒమైక్రాన్‌ కూడా వెంటాడుతోంది. సోమవారం బెంగళూరులోనే ఏకంగా 287 మందికి ఒమైక్రాన్‌ వేరియంట్‌ వైరస్‌ సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సుధాకర్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో ఒమైక్రాన్‌ బాధితులు 766కు పెరిగారన్నారు.

9. పుదుచ్చేరిలో పెరుగుతున్న కరోనా కేసులు
కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో రాష్ట్రప్రభుత్వం నివారణ చర్యలు పటిష్టం చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 31 వరకు 50 శాతం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే విధుల్లోకి హాజరుకావాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీని ప్రకారం గ్రూప్‌-బి, గ్రూప్‌-సి కేటగిరీలకు చెందిన ఉద్యోగులతో పాటు ప్రభుత్వ కార్యదర్శులు, ప్రభుత్వ శాఖల ఛైర్మన్లు విధులను హాజరవుతున్నారు. గర్భిణులు, ప్రత్యేక ప్రతిభావంతులకు ప్రభుత్వ విధులకు మినహాయింపు కల్పించారు. మరోవైపు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశాలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని పుదుచ్చేరి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

10. తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావుకు కరోనా
తెలంగాణలో కరోనా ఉధృతి పెరుగుతోంది. వైద్య సిబ్బందిపై కరోనా పంజా విసురుతోంది. తాజాగా తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావుకు కరోనా వైరస్‌ సోకింది. స్వల్ప లక్షణాలతో ఆస్పత్రితో చేరినట్లు ఆయన వెల్లడించారు. గాంధీ ఆస్ప్రత్రిలో 120 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. ఉస్మానియా పరిధిలో 159 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆదిలాబాద్‌ రిమ్స్‌లో 73 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది.