Politics

TNI – నేటి గరం గరం రాజకీయం – 18/01/2022

TNI –  నేటి గరం గరం రాజకీయం – 18/01/2022

* పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన కేజ్రీవాల్
పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం విలేకర్ల సమావేశంలో ప్రకటించారు. ప్రజాభిప్రాయాన్ని బట్టి ఆయనను ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రజలు తమ అభిప్రాయాన్ని ఫోన్, వాట్సాప్ ద్వారా తెలియజేశారని, భగవంత్ మాన్‌కు 93.3 శాతం మంది మద్దతు పలికారని చెప్పారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూను ముఖ్యమంత్రిగా చూడాలని 3 శాతం మంది కోరుకున్నట్లు తెలిపారు. పంజాబ్ ఎన్నికల్లో ఆప్ గెలుస్తుందని స్పష్టమైపోయిందన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపికైనవారే తదుపరి పంజాబ్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు.

* చంద్రబాబు త్వరగా కోలుకోవాలి: సీఎం Jagan
కరోనా బారిన పడిన టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా సీఎం వెల్లడించారు. ‘‘చంద్రబాబు గారు త్వరగా కోలుకొని, ఆరోగ్యవంతులుగా తిరిగి రావాలి’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు, ఆయన కుమారుడు లోకేష్ కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

* ప్రధాని నరేంద్ర మోదీని చంపగలను..మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే వివాదాస్పద వ్యాఖ్యలు
మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ నానా పటోలే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధానమంత్రి నరేంద్రమోదీని చంపగలనని నానా పటోలే వ్యాఖ్యానించారు. భండారా జిల్లాలోని లఖానీ తహసీల్ జిల్లాపరిషత్, పంచాయతీ సమితి ఎన్నికలకు ముందు జరిపిన ప్రచార సమావేశంలో మాట్లాడుతూ నానా పటోలే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను గత 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను కానీ ఒక్క స్కూల్ కూడా నా పేరు మీద లేదు.. ఎప్పుడూ అందరికీ సాయం చేశాను.. మోదీని చంపగలను.. ఆయనను దూషించగలను… అందుకే మోదీ నాకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారానికి వచ్చారు’’ అని నానాపటోలే అన్నారు. నానాపటోలే వ్యాఖ్యలను మహారాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు.

* జగన్ ఫొటోతో ఎన్నికలకు చంద్రబాబు: మంత్రి అప్పలరాజు
టీడీపీ అధినేత చంద్రబాబుకు జగన్ ఫొటో పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని మంత్రి అప్పలరాజు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ చేపడుతున్న సంక్షేమ పథకాలు చిరస్మరణీయమన్నారు.జగన్ స్థాయిని చేరుకోవటానికి ఇతర రాష్ట్రాల సీఎంలు పరుగులు పెడుతున్నారన్నారు.ఏపీ లో ఇంగ్లిష్ మీడియంపై చంద్రబాబు కోర్టుకు వెళ్లారని, తెలంగాణలో ఇంగ్లిష్ మీడియంపై జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎలా స్పందిస్తారు? అని ప్రశ్నించారు. పీఆర్సీపై ఎక్కువశాతం మంది ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారన్నారు. కొంతమంది కావాలని ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని మంత్రి అప్పలరాజు మండిపడ్డారు.

* ఇంగ్లీష్‌ విద్యపై ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారు: రేవంత్
ఇంగ్లీష్‌ విద్యపై ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రైవేట్ కాలేజీల్లో 25% పేద విద్యార్థులకు ఉచిత అడ్మిషన్స్ ఇవ్వాలన్నారు. చట్టంలో ఉన్నా తెలంగాణలో అమలు కావడం లేదన్నారు. టీచర్ల పోస్టులను భర్తీ చేయకుండా కేజీ టూ పీజీ సాధ్యం కాదన్నారు. విద్యావ్యవస్థను కేసీఆర్ నిర్వీర్యం చేశారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

* కేసినో వ్యవహారంలో ప్రభుత్వం సమాధానం చెప్పాలి: సోము వీర్రాజు
కేసినో వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతిని దెబ్బతీసేందుకే వైసీపీ కంకణం కట్టుకుందన్నారు. గుడివాడలోని కె .కన్వెంక్షన్ హాలులో కేసినో వ్యవహారంపై ప్రభుత్వం స్పందించాలన్నారు. ఈ కేసినో ద్వారా వందల కోట్లు చేతులు మారినా ప్రభుత్వం చర్యలు చేపట్టకుండా చోద్యం చూస్తోందని మండిపడ్డారు. చేతులకు తాళ్లు కట్టుకునే మంత్రి ప్రతివిషయానికి స్పందిస్తారన్నారు.ఈ విషయంలో ఎందుకు మిన్నకుండిపోయారోనని ఎద్దేవా చేశారు.సంక్రాంతి పండుగ సాంప్రదాయానికి వక్ర భాష్యం చెప్పేలా వైసీపీ నాయకత్వం వ్యవహరిస్తోందని సోము వీర్రాజు ధ్వజమెత్తారు.