DailyDose

TNI నేటి తాజా వార్తలు – 18/01/2022

TNI  నేటి తాజా వార్తలు – 18/01/2022

* ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణలో వేర్వేరు ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మొత్తం 10 మందికిపైగా మావోయిస్టులు మరణించి ఉంటారని అనుమానం వ్యక్తమవుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్కా జిల్లా మార్జుమ్‌ అటవీ ప్రాంతం టోంగ్‌పాల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో కాల్పులు జరిగాయి. మావోయిస్టు ప్లీనరీ జరుగుతుందన్న పక్కా సమచారంతో పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు.ఈ క్రమంలో పోలీసులకు, మావోస్టులకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది.
* రాష్ట్రంలో కొవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. టెస్టులు చేయించుకునేందుకు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వద్ద జనాలు బారులు తీరారు. దగ్గు, జ్వరం జలుబు వంటి వ్యాధి లక్షణాలు ఉన్న వారందరికీ హెల్త్ ఆఫీసర్స్ టెస్టులు నిర్వహిస్తున్నారు. 12 గంటల వ్యవధిలో టెస్ట్ రిపోర్టులను అందజేస్తున్నారు. సుమారు రోజుకు 250 నుండి 300 మందికి కోవిడ్ టెస్టులు చేస్తున్నామని హెల్త్ అధికారులు చెబుతున్నారు.
* జూబ్లీహిల్స్ ఎఫ్ఎన్‌సీసీలో ఫైర్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. క్లబ్‌లో ఫైర్ సిబ్బంది ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు తనిఖీ చేస్తున్నారు. ఫైర్ సేఫ్టీ అధికారి ప్రసాద్ నేతృత్వంలో ఎఫ్ఎన్‌సీసీలో తనిఖీలు జరుగుతున్నాయి. సికింద్రాబాద్ క్లబ్ అగ్నిప్రమాదంతో ఫైర్ అధికారులు అలెర్ట్ అయ్యారు. స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తూ ఫైర్ సేఫ్టీ అధికారులు వరుస తనిఖీలు చేస్తున్నారు.
* వరంగల్ జిల్లాలోని పరకాల – నర్సంపేట సబ్ డివిజన్లలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, నిరంజన్ రెడ్డి ప్రజాప్రతినిధుల బృందం మంగళవారం పర్యటించింది. ఈ సందర్భంగా వడగండ్ల వానల ప్రభావంతో నష్టపోయిన పంటలను మంత్రులు పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు.
* పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం విలేకర్ల సమావేశంలో ప్రకటించారు. ప్రజాభిప్రాయాన్ని బట్టి ఆయనను ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రజలు తమ అభిప్రాయాన్ని ఫోన్, వాట్సాప్ ద్వారా తెలియజేశారని, భగవంత్ మాన్‌కు 93.3 శాతం మంది మద్దతు పలికారని చెప్పారు.
* రాష్ట్రవ్యాప్తంగా భూములు, ఆస్తుల రక్షణకు ప్రభుత్వం చేపట్టిన వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష పథకంలో భాగంగా రీసర్వే పూర్తయిన భూములకు సంబంధించిన సమగ్ర భూసర్వే రికార్డులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ప్రజలకు అంకితం చేశారు. అలాగే 37 గ్రామాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌ సేవలను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి ప్రారంభించారు.
*పీఆర్సీపై ప్రభుత్వం ఇచ్చిన జీవో తాము ఆశించినట్టుగా లేదని సచివాలయ ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి అన్నారు. సీఎం జగన్ అపాయింట్‌మెంట్ అడుగుతామనితమను మళ్లీ చర్చలకు పిలవాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రెండు నెలలుగా ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరుపుతోందన్నారు. అయితే ప్రతి మీటింగ్‌లోనూ ఉద్యోగులు ఏం కోరుకుంటున్నారో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామన్నారు.