Politics

ముదురుతున్న రిపబ్లిక్‌ డే పరేడ్‌లో శకటాల వివాదం.. బీజేపీ పాలిత రాష్ట్రాలకే ఛాన్స్‌!

ముదురుతున్న రిపబ్లిక్‌ డే పరేడ్‌లో శకటాల వివాదం.. బీజేపీ పాలిత రాష్ట్రాలకే ఛాన్స్‌!

ఈ ఏడాది రిపబ్లిక్‌ డే పరేడ్‌ అంశం తీవ్ర వివాదంగా మారుతోంది. ఈ పరేడ్‌కు బీజేపీ పాలిత రాష్ట్రాలు, త్వరలో అసెంబ్లీ ఎన్నికలను రాష్ట్రాలను మాత్రమే ఎంపిక చేయడంపై అనేక ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. ఈ పరేడ్‌కు దేశంలోని 29 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అభ్యర్థనలు రాగా, కేవలం 12 రాష్ట్రాలు, 9 కేంద్ర ప్రభుత్వ విభాగాలను మాత్రమే అనుమతించారు. ఉత్తరప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, హర్యానా, గుజరాత్‌, కర్ణాటక, చత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, మేఘాలయ, జమ్ముకాశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, గోవా, పంజాబ్‌ రాష్ట్రాలకు మాత్రమే జనవరి 26న పరేడ్‌కు అనుమతి లభించింది. కేరళ, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాలకు కేంద్రం అనుమతి నిరాకరించడం సంచలనంగా మారింది. దీనిపై ఇప్పటికే మమతా బెనర్జీ, ఎంకె స్టాలిన్‌ మోడీకి లేఖ రాసారు.

అయితే శకటాల అనుమతికి కేంద్రం ప్రభుత్వానికి సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. నిపుణుల కమిటీ దీనికి అనుమతులు మంజారు చేస్తుందని తెలిపారు. ఏయే శకటాలను అనుమతించాలో నిపుణుల కమిటీనే నిర్ణయిస్తుందని, ఇందులో ప్రభుత్వ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. రానున్న గణతంత్ర వేడుకల్లో కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ ప్రతిపాదించిన శకటాలను తిరస్కరించడంలో కేంద్రం పాత్రేమీ లేదని చెప్పారు. ‘సాధారణ విషయాన్ని ప్రజల మనోభావాల సమస్యగా మఖ్యమంత్రులే చిత్రీకరించడం కేంద్రం, రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టిస్తుంది. దీర్ఘకాలంలో సమాఖ్య వ్యవస్థకు చేటు చేస్తుంది’ అని అధికారులు చెప్పారు. పరేడ్‌కు వివిధ రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి ఈసారి మొత్తం 56 ప్రతిపాదనలు రాగా, అందులో 21 నమూనాలనే ఎంపిక చేసినట్టు వివరించాయి. అలాగే, పరేడ్‌లో సమయాభావం కారణంగా. ఏటా ఆమోదించే శకటాల కంటే తిరస్కరించేవే ఎక్కువ ఉంటాయని రక్షణ మంత్రిత్వ శాఖ కూడా వివరణ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లేఖ కూడా రాసారు.

అయితే ఇలాంటి వివరణలు ఎన్ని ఇచ్చినా.. బీజేపీ త్వరలో ఎన్నికల జరగనున్న రాష్ట్రాలనే ఎంపిక చేయడం కేంద్రం ఉద్ధేశాన్ని వెల్లడిస్తుంది. దక్షిణాది నుంచి కర్ణాటక రాష్ట్రానికి మాత్రమే అనుమతి లభించింది. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉంది. అందుకే ఈ రాష్ట్రానికి అనుమతి లభించింది. మరోవైపు ప్రముఖ సంఘ సంస్కర్త, ఆధునిక కేరళ వైతాళికుడు, ప్రపంచానికే ఆదర్శంగా నిలచిన గొప్ప తత్వవేత్త అయిన నారాయణ గురు శకటాన్ని రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ప్రదర్శించాలని కేరళ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కేంద్రం ప్రభుత్వం తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వ చర్య ఆ మహనీయుడ్ని అవమానించడమేనంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల వ్యవస్థపైన, సామాజిక దురాచారాలపైన, వివక్షపైన రాజీలేని పోరాటం సాగించి కోట్లాది మందికి ఆరాధ్యుడైన నారాయణగురుని అవమానించినందుకు కేంద్రం క్షమాపణ చెప్పాలని కర్నాటక మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, హెచ్‌డి కుమారస్వామి సైతం డిమాండ్‌ చేశారు. అలాగే నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌ 125వ జయంతి సందర్భంగా అతని జ్ఞాపకార్థం తయారు చేసిన పశ్చిమ బెంగాల్‌ శకటాన్ని కేంద్రం తిరస్కరించింది.

‘స్వాతంత్య్ర ఉద్యమంలో తమిళనాడు’ అనే థీమ్‌తో రూపొందించిన తమిళనాడు శకటాన్ని కేంద్రం తిరస్కరించింది. అయితే మరోవైపు కాశీ విశ్వనాథ్‌ ఆలయ నమూనాతో తయారు చేసిన ఉత్తరప్రదేశ్‌ శకటానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. అంటే స్వాతంత్య్ర ఉద్యమ నమూనాల కన్నా హిందుత్వవాదాన్ని రెచ్చగొట్టే నమూనాలకే బీజేపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చినట్టు అర్ధమవుతుంది. నిపుణుల కమిటీ అనుమతులు ఇచ్చినట్లు పైకి చెప్పినా దీనికి వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని అనేక మంది ఆరోపిస్తున్నారు. ఈ శకటాల వివాదంపై జర్మనీలో ఉంటున్న నేతాజీ కుమార్తె అనితా బోస్‌ కూడా స్పందించడం విశేషం. నేతాజీ 125వ జయంతి ఏడాదిలో జరుగుతున్న రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ఆయన గుర్తుగా రూపొందించిన శకటం లేకపోవడం వింతగా ఉందన్నారు. ఇందులో రాజకీయ కారణాలు ఉన్నాయని ఆరోపించారు.