Business

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ డేటా సెంటర్‌!

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ డేటా సెంటర్‌!

టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ హైదరాబాద్‌లో రూ.15,000 కోట్లతో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్‌, తెలంగాణ ప్రభుత్వం డీల్‌ను ఖరారు చేసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్‌ సమీపంలో డేటా సెంటర్‌ ఏర్పాటుకు 50 ఎకరాల స్థలాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 300 మంది నిపుణులకు ఉద్యోగాలు లభించగలవని భావిస్తున్నారు. త్వరలో లాంఛనంగా డేటా కేంద్రం ఏర్పాటుపై ప్రకటన వెలువడే వీలుందని చెబుతున్నారు. 2020 చివర్లో హైదరాబాద్‌లో రెండో డేటా సెంటర్‌ రీజియన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌) ప్రకటించింది. ఇందుకోసం 277 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపింది. కంట్రోల్‌ ఎస్‌, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మరికొన్ని కంపెనీలు కూడా హైదరాబాద్‌లో డేటా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. 2016లోనే తెలంగాణ ప్రభుత్వం డేటా సెంటర్‌ పాలసీని విడుదల చేసింది. దేశంలో డేటా సెంటర్‌ పాలసీ కలిగిన కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి.
**ప్రపంచవ్యాప్తంగా…. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసా్‌ఫ్టకు ప్రస్తుతం దాదాపు 200 డేటా సెంటర్లు ఉన్నాయి. ప్రతి ఏడాది 50-100 డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది. హైదరాబాద్‌లో ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌ పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) కేంద్రం ఉంది. మైక్రోసాఫ్ట్‌ ప్రధాన కేంద్రమైన రెడ్‌మండ్‌కు వెలుపల కంపెనీకి ఉన్న అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రాల్లో ఇది ఒకటి.