DailyDose

TNI నేటి తాజా వార్తలు – 20/01/2022

TNI నేటి తాజా వార్తలు – 20/01/2022

*టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వారిద్దరూ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లాలోని  ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో టీడీపీ మండల అధ్యక్షుడు లంక సత్తిపండు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ… చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ త్వరగా కోలుకోవాలని స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

*అంతర్జాతీయంగా భారత దేశానికిగల కీర్తి, ప్రతిష్ఠలను సర్వ నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ‘స్వాతంత్ర్య అమృత మహోత్సవాల నుంచి సువర్ణ భారత్ దిశగా’ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో గురువారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా బ్రహ్మ కుమారీస్ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. 

*ఓయో లాడ్జ్‌లపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పందించారు. ఓయో లాడ్జ్‌ల వ్యాపారాలకు తాము వ్యతిరేకం కాదన్నారు. వాటి నిర్వహణ తీరు బాగోలేదన్నారు. ఎవరికి రూం ఇస్తున్నారో, ఎవరు రూంలలో ఉంటున్నారో సరిగ్గా చెక్ చేయట్లేదన్నారు. ఆన్‌లైన్ బుకింగ్‌లపై నిఘా పెట్టల్సిన అవసరం ఉందన్నారు. ఓయో లాడ్జ్‌లలో సీసీ కెమెరాలు కూడా సరిగ్గా ఉండట్లేదన్నారు. ఒయో రూమ్స్ , లాడ్జ్ యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని సీవీ ఆనంద్ సూచించారు

*తహాసిల్దార్ కార్యాలయం పై ఏసీబీ దాడులు కర్నూలు జిల్లా గడివేముల మండలం గడివేముల లోని తహాసిల్దార్ కార్యాలయం లో బుధవారం నాడు ఏసీబీ డీఎస్పీ శివ నారాయణ స్వామి ఆధ్వర్యంలో నలుగురు ఏసీబీ సిఐలు కృష్ణారెడ్డి,వంశీ నాథ్, కృష్ణయ్య,ఇంతియాజ్ లు దాడులు నిర్వహించారు.ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ శివ నారాయణ స్వామి మాట్లాడుతూ… మండలంలోని ప్రజల ఫిర్యాదుల మేరకు రెవెన్యూ కార్యాలయం లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి,రికార్డులు తనిఖీ చేశామని అన్నారు.అలాగే తహశీల్దర్ కార్యాలయం లో  పంపిణీ చేయని 33 పాసు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నామని,అందులో తాసిల్దార్ వద్ద 23 మరియు వీఆర్వోలు వద్ద10 ఉన్నట్లు తెలిపారు. కార్యాలయంలోని సిబ్బంది వద్ద అనధికార నగదు 43,930 రూపాయలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు.ప్రజల నుంచి పాస్బుక్కులు ఇవ్వడానికి, మ్యుటేషన్ చేయడానికి,ఆన్లైన్ చేయడానికి లంచం తీసుకుంటున్నట్లు దాదాపుగా ఆరు మంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపారు.

* కర్రిగుట్ట ఎన్ కౌంటర్‌పై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. జయశంకర్ భూపాలపల్లి, మూలుగు, వరంగల్, పెద్దపల్లి డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో లేఖ విడుదల అయింది. కర్రిగుట్ట ఎన్‌కౌంటర్ బూటకమని, నిరసనగా ఈ నెల 22న ములుగు జిల్లా బంద్‌కు పిలుపునిస్తున్నట్లు లేఖలో తెలిపారు. ‘‘ఈ ఎన్‌కౌంటర్‌లో కూడా పోలీసులు పాత కథనే చెప్పారు. ఈ నెల 22న చేపట్టబోయే బంద్‌లో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలి. ఘటన జరిగిన ప్రాంతానికి మీడియాకు కూడా అనుమతి ఇవ్వలేదు. పోలీసులే మీడియా పాత్ర పోషించారు. ఎన్ కౌంటర్ అని ప్రజలను నమ్మించే విధంగా కుట్ర చేశారు.’’ అని లేఖలో పేర్కొన్నారు.

*ఉద్యోగుల పీఆర్సీ జీవోపై హై కోర్టులో పిటిషన్ దాఖలు. సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించడంపై కోర్టుకెళ్లిన ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య. విభజన చట్టం ప్రకారం ఎలాంటి బెనిఫిట్స్ తగ్గకూడదని పిటిషన్ లో పేర్కొన్న కృష్ణయ్య.సెక్షన్ 78(1) కి విరుద్ధంగా ఉన్న జీవో 1 ని రద్దు చేసేలా అదేశాలివ్వాలని పేర్కొన్న పిటిషనర్.హై కోర్టులో కొనసాగుతున్న విచారణ. *రేణిగుంట పట్టణంలో దారుణం… కుటుంబ కలహాల నేపథ్యంలో  భర్త గొంతు కోసి హతమార్చిన భార్య. మృతి చెందిన వ్యక్తి పేరు రవిచంద్రన్ (53)ఆ ఇంటి నుండి  నెత్తుటి మరకలు బట్టలతో వీధిలో వెళుతున్న మహిళను చూసి  పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకున్న రేణిగుంట అర్బన్ సీఐ అంజు యాదవ్. వివరాలు తెలియాల్సి ఉంది.

* పశ్చిమగోదావరి జిల్లా. ఏలూరు. ఏకంగా అంబులెన్స్ తో కర్ఫ్యూ నిబంధనలను అమలు పరచిన 1 వ పట్టణ సీఐ ఆది ప్రసాద్*.తానే స్వయంగా అంబులెన్స్ నడుపుతూ కర్ఫ్యూ సమయాలలో రోడ్లపై తిరిగిన, మాస్కులు లేకుండా రోడ్డుపై తిరిగినా నేరుగా అంబులెన్స్లో కోవిడ్ కేర్ సెంటర్ కి తరలిస్తామని హెచ్చరించిన పోలీసులు. కొవిడ్ వచ్చాక అంబులెన్సు  ఎక్కడ0 కన్నా… కొవిడ్ రాకముందే అంబులెన్స్ లో ఎక్కిస్తే ఎలా ఉంటుందో తెలియజేయాలని ఈ వినూత్న ప్రక్రియ అని తెలిసిన వైనం. కొందరు యువకులను అంబులెన్స్లో ఎక్కించి  మరీ అవగాహన కల్పించిన పోలీసులు. వినూత్న ప్రక్రియ గురించి  చర్చించుకుంటున్న నగర ప్రజలు.

*తన నియోజక వర్గంలోని ప్రజలకు కరోనా సోకితే వారు భయాందోళనకు గురికావద్దని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భరోసా ఇచ్చారు.  చికిత్స పొందుతున్నప్పుడు ఏమైనా ఇబ్బందులు వస్తే మా వ్యక్తిగత సిబ్బందిని గాని లేదా తన కార్యాలయ సిబ్బందిని గాని సంప్రదించాలని అన్నారు. గురువారం నాడు పాలకుర్తి నియోజకవర్గం లోని తోర్రురు, పెద్ద వంగర, రాయపర్తి,దేవరుప్పుల, పాలకుర్తి, కోడకండ్ల  మండలంలోని గ్రామాలలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా లక్షణాలు కనిపించగానే రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన కరోనా కిట్టులోని మందులను వైద్యుల సలహాల మేరకు వాడి కరోనా నుండి విముక్తి పొందాలని కోరారు. 

* సంక్రాంతి పండుగ సందర్భంగా క‌ృష్ణా జిల్లాలోని గుడివాడలో నిర్వహించిన క్యాసినోపై వాస్తవాలను వెలికి తీయడానికి టీడీపీ నిజనిర్థారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కమిటీ సభ్యులుగా నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బోండా ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, తంగిరాల సౌమ్య ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఈ కమిటీ శుక్రవారం గుడివాడలో పర్యటిస్తుందన్నారు. గుడివాడలో పర్యటించి పూర్తి స్థాయి నివేదికను కమిటీ సేకరించి అధిష్టానానికి అందిస్తుందన్నారు. జూదాలతో రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని ఆయన ఆరోపించారు. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో యువతను పెడదోవ పట్టించేలా నీచమైన సంస్కృతిని రాష్ట్రంలో ప్రవేశపెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

*తమ హక్కుల కోసం ఉద్యమిస్తే అరెస్టులు చేస్తారా అని ప్రభుత్వాన్ని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు  అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. గత టీడీపీ  ప్రభుత్వం 43 శాతం పీఆర్సీ ఇస్తే నాడు జగన్‌రెడ్డి తప్పుబట్టారన్నారు. నేడు అసలు వేతనాలకు జగన్‌ ఎసరు పెట్టాడని ఆయన ఆరోపించారు. ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాల్సింది పోయి అరెస్టులు చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని కాగ్ నివేదికలు చెబుతున్నా ఆదాయం లేదంటూ ఉద్యోగుల పొట్ట కోట్టటం దుర్మార్గమన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన  హమీల్లో  రెండున్నరేళ్లలో ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఉద్యోగులకు మొండిచేయి చూపారన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీ కరణ చేస్తానని చెప్పి వారి ఆశలకు జగన్ సమాధి కట్టారని ఆయన ఆరోపించారు. ఉద్యోగుల న్యాయ పోరాటానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన ప్రకటించారు. హక్కులు సాధించుకునే వరకు ఉద్యోగులకు టీడీపీ అండగా నిలుస్తుందన్నారు. భవిష్యత్‌లో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. 

*విద్యా సంస్థలను ఈనెల 31 నుంచి పునః ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా కేసులు తగ్గుముఖం పడితే దీనిపై అధికారిక నిర్ణయం వెలువడే అవకాశముంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ విషయాన్ని బుధవారం స్పష్టం చేశారు. కరోనా తీవ్రత నేపథ్యంలో సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ఈనెల 30 వరకూ పొడిగించింది. అయితే దీనిపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే క్రమంలో విద్యా బోధన కుంటుపడిందన్న వాదన కూడా విన్పిస్తోంది.

*అండర్‌-19 జింబాబ్వే బౌలర్‌ విక్టర్‌ చిర్వాను బౌలింగ్‌ నుంచి సస్పెండ్‌ చేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.  అండర్‌-19 ప్రపంచకప్‌లో భాగంగా గత శనివారం పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో విక్టర్‌ చిర్వా బౌలింగ్‌ యాక్షన్‌ అనుమానాదాస్పదంగా ఉందంటూ అండర్‌-19 ఐసీసీ ప్యానెల్‌ పేర్కొంది. చిర్వా బౌలింగ్‌ యాక్షన్‌కు సంబంధించిన వీడియో ఫుటేజీని తాము పరిశీలించామని ప్యానెల్‌ అధికారులు తెలిపారు.

*ప్రతి జిల్లాకు ఒక ఎయిర్‌పోర్టు ఉండాలన్నది మంచి కాన్సెప్టు అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. వన్‌ డిస్ట్రిక్ట్‌-వన్‌ ఎయిర్‌పోర్టుకు అనుగుణంగా ప్రణాళికలు ఉండాలని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో ఏకరీతిగా విమానాశ్రయాల నిర్మాణం చేపట్టాలని, ఇందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు.

*ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో  భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలతో పొత్తు ఖరారు చేసుకుంది. అప్నాదళ్, నిషాద్‌ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్టుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం ప్రకటించారు. ఈ రెండు పార్టీలకు వెనుబడిన వర్గాల  నుంచి మద్దతు ఉంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు పార్టీలు కలసికట్టుగా పోరాటం చేస్తాయని నడ్డా విలేకరుల సమావేశంలో చెప్పారు.