DailyDose

ఇండియా గేట్‌ వద్ద నేతాజీ విగ్రహం

ఇండియా గేట్‌ వద్ద నేతాజీ విగ్రహం

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతిని పురస్కరించుకొని ఇండియా గేట్‌ వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఈ మేరకు నల్లరాతి విగ్రహాన్ని తయారు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ విగ్రహం పూర్తయ్యేవరకు అదే ప్రదేశంలో హోలోగ్రామ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, నేతాజీ జయంతి రోజైన ఈ నెల 23 (ఆదివారం) దీనిని ఆవిష్కరిస్తామని ట్విటర్‌ ద్వారా ప్రధాని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల నేతాజీ కుమార్తె అనితా బోస్‌ సంతోషం వ్యక్తం చేశారు. నేతాజీ విగ్రహ ఏర్పాటుకు ఇండియా గేట్‌ సరైన ప్రదేశమన్నారు. ఇది ఎప్పుడో జరగాల్సిందని అభిప్రాయపడ్డారు. అయినా.. ఎప్పటికీ విగ్రహం పెట్టకుండా ఉండడం కన్నా ఆలస్యంగానైనా పెట్టడం సంతోషకరమేనన్నారు. మరోవైపు ప్రధాని ప్రకటనను తృణమూల్‌ కాంగ్రెస్‌ స్వాగతించింది. అయితే తమ శకటాన్ని తిరస్కరించిన వివాదం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోందని టీఎంసీ ప్రధాన కార్యదర్శి కునాల్‌ ఘోష్‌ అన్నారు. కాగా, నేతాజీ విగ్రహాన్ని 25 అడుగుల ఎత్తున ఏర్పాటు చేయనున్నట్లు నేషనల్‌ మోడరన్‌ ఆర్ట్‌ గ్యాలరీ డైరెక్టర్‌ జనరల్‌ అద్వైత గడనాయక్‌ తెలిపారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్రం నుంచి శిలను తీసుకురానున్నట్లు వెల్లడించారు.