Business

ఇళ్ల ధరలకు ఈ ఏడాది రెక్కలు!

ఇళ్ల ధరలకు ఈ ఏడాది రెక్కలు!

ఈ ఏడాది ఇళ్ల ధరలు రెక్కలు విప్పుకోనున్నాయి. సుమారు 30 శాతం మేర పెరుగుతాయని ఎక్కువ మంది డెవలపర్లు భావిస్తున్నారు. ప్రధాన కారణం బిల్డింగ్‌ మెటీరియల్స్‌ (నిర్మాణంలో వినియోగించే ఉత్పత్తులు) ధరలు గణనీయంగా పెరగడం వల్ల నిర్మాణ వ్యయం కూడా అధికమైనట్టు వారు చెబుతున్నారు. ఇది ధరలపై ప్రతిఫలిస్తుందని చెబుతున్నారు. రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్‌) ‘రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ సెంటిమెంట్‌ సర్వే 2022’ పేరుతో ఒక సర్వేను 2021 డిసెంబర్‌ 30 నుంచి 2022 జనవరి 11 మధ్య నిర్వహించింది. సర్వేలో 1,322 మంది డెవలపర్లు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

****సర్వే అంశాలు
*60 శాతం మంది డెవలపర్లు 2022లో ఇళ్లు/ఫ్లాట్ల ధరలు కనీసం 20 శాతం పెరగొచ్చని అంచనా వేశారు. బిల్డింగ్‌ మెటీరియల్స్‌ ధరలు పెరగడం వల్లేనని వీరు చెప్పారు.
* ధరలు 10–20 శాతం మధ్య పెరగొచ్చని 35 శాతం మంది అంచనాగా ఉంది.
* 25 శాతం మంది ధరల పెరుగుదల 10 శాతం వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
* మరో 21 శాతం మంది అయితే ధరల పెరుగుదల 30 శాతం వరకు ఉండొచ్చన్న అభిప్రాయాన్ని తెలియజేశారు.
* నిర్మాణ వ్యయాలను తగ్గించడం, జీఎస్‌టీపై ఇన్‌పుట్‌ క్రెడిట్‌ (రుణాలు) అందించడం, రుణ లభ్యతను పెంచడం, ప్రాజెక్టులకు అనుమతులు వేగంగా మంజూరు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని డెవలపర్లు కోరుతున్నారు.
* 92 శాతం మంది ఈ ఏడాది కొత్త ప్రాజెక్టులను చేపట్టనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా 96 శాతం మంది నివాస ప్రాజెక్టులను చేపట్టేందుకే ఆసక్తి చూపించారు.* 55 శాతం మంది వ్యాపారంలో వర్చువల్‌ రియాలిటీ టెక్నాలజీని అమలు చేస్తామని చెప్పారు.

****ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలి‘‘కరోనా మూడో విడత కొనసాగుతుండడంతో ఈ మహమ్మారి ప్రభావాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలపై దృష్టి సారిస్తుందని భావిస్తున్నాం’’ అని క్రెడాయ్‌ నేషనల్‌ ప్రెసిడెంట్‌ పటోడియా అన్నారు. చాలా మంది డెవలపర్లు డిజిటల్‌ టెక్నాలజీకి మళ్లడంపై దృష్టి సారించారని, దీంతో ఆన్‌లైన్‌ విక్రయాలు పెరిగినట్టు చెప్పారు. ‘‘39 శాతం డెవలపర్లు 25 శాతం అమ్మకాలను ఆన్‌లైన్‌లోనే చేస్తున్నారు. ఈ ఏడాది ఆన్‌లైన్‌ అమ్మకాలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నాం’’ అని పటోడియా చెప్పారు.