Food

రూపాయికే దోశ ఎక్కడంటే?

రూపాయికే దోశ ఎక్కడంటే?

హోటల్‌లో దోసె తినాలంటే రూ.20 నుంచి రూ.50లోపు వెచ్చించాలి. అయితే ఓ వృద్ధురాలు రూపాయికే దోసె విక్రయిస్తూ సామాన్యుల కడుపు నింపుతోంది. ఎర్రకారం, బొంబాయి చట్నీతో దోసె తింటుంటే ఎంతో రుచికరంగా ఉంటోందని స్థానికులు అంటున్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నా రూపాయికే దోసె విక్రయిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది తాడిపత్రికి చెందిన సావిత్రమ్మ అనే వృద్ధురాలు. తనకు కూలి గిట్టుబాటు అయితే చాలు పెద్దగా లాభాపేక్ష ఏమీ లేదని చెబుతోంది.

**తాడిపత్రి పట్టణం కాల్వగడ్డ వీధికి చెందిన వెంకట్రామిరెడ్డి, సావిత్రమ్మ దంపతులు. వీరికి చంద్రశేఖర్‌రెడ్డి, లక్ష్మీదేవి, సరళ సంతానం. 40 ఏళ్ల కిందట వెంకట్రామిరెడ్డి టీ బంకు పెట్టుకుని జీవనం సాగించేవాడు. కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటుందని వెంకట్రామిరెడ్డి భార్య సావిత్రమ్మ ఇంటి వద్ద బంకు ఏర్పాటు చేసుకుని దోసెలు వేయడం మొదలు పెట్టింది. ప్రారంభంలో దోసె ధర పావలా. అలా దోసెలు వేసి అమ్మగా వచ్చిన సంపాదనను కుటుంబానికి, పిల్లల చదువులకు ఖర్చు చేసింది. వీధిలోని వారు, చుట్టుపక్కల పేదలు, విద్యార్థులు, పిల్లలు అధిక సంఖ్యలో ఈ దోసెలు తినేవారు.

*15 ఏళ్ల తరువాత బియ్యం, వంట నూనె ధరలు పెరగడంతో దోసె ధరను 50 పైసలకు పెంచి వ్యాపారం కొనసాగించింది. తరువాత కొన్నాళ్లకు భర్త అనారోగ్యం బారిన పడి మృతి చెందాడు. కుటుంబ పోషణ భారం మొత్తం సావిత్రమ్మపైనే పడింది. తన సంపాదనతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. ఇటీవల కాలంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరగడంతో దోసె ధరను రూపాయికి పెంచింది. ఎర్రకారం, బొంబాయి చట్నీ కాంబినేషన్‌లో దోసె ఎంతో రుచికరంగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం సావిత్రమ్మ వయసు 70 సంవత్సరాలు. కొడుకు, కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి సంతోషంగా జీవనం గడుపుతోంది. పేదలు, సామాన్యులకు అతి తక్కువ ధరలో దోసె విక్రయిస్తూ కడుపు నింపుతున్నానన్న ఆనందం చాలని అంటోంది.