Politics

నేటి రాజకీయ వార్తలు- 24/01/2022

నేటి రాజకీయ వార్తలు- 24/01/2022

*మంత్రివర్గం నుంచి నానిని బర్తరఫ్ చేయండి: అనిత
కృష్ణా జిల్లా గుడివాడలో కేసినో నిర్వహించిన పౌర సరఫరాల శాఖా మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని)ని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే తెలుగు మహిళ ఆధ్వర్యంలో ‘చలో గుడివాడ’ కార్యక్రమం చేపట్టి అక్కడ జరిగిన వ్యవహారాలతో సంబంధం వున్న వ్యక్తుల వివరాలు బయటపెడతామని ప్రకటించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఏపీ పేరు చెబితే గుడివాడ కేసినో గుర్తుకు వస్తుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో ఏపీ అంటే పోర్టులు, పరిశ్రమలు గుర్తుకు వచ్చేవని…ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యిందన్నారు. కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ సెంటర్లోనే కేసినో జరిగిందని దేశం మొత్తం చూసిందని పేర్కొన్నారు. తక్షణమే మంత్రివర్గం నుంచి నానిని బర్తరఫ్ చేయాలని, లేకపోతే తొలుత గుడివాడ, తరువాత తాడేపల్లిలో సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని అనిత హెచ్చరించారు.

*సిద్ధూ కోసం పాక్ లాబీలు: అమరీందర్ సంచలన వ్యాఖ్యలు
పంజాబ్ కాంగ్రెస్ అధినేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ కోసం పాకిస్తాన్ ప్రధాని లాబీలకు పాల్పడ్డారని మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధూని తన కేబినెట్ నుంచి తొలగించినప్పుడు పాక్ నుంచి అనేక విజ్ణప్తులు తనకు వచ్చాయని, సిద్ధూని మళ్లీ కేబినెట్లోకి తీసుకోవాలని స్వయంగా పాకిస్తాన్ ప్రధానే తనకు రిక్వెస్ట్ పంపారని ఆయన వెల్లడించారు. సిద్ధూ తనకు పాత మిత్రుడని ఇమ్రాన్ గుర్తు చేసినట్లు సిద్ధూ పేర్కొన్నారు.

*అపోహలు తొలగించేందుకు చర్చలకు రావాలని కోరాం: సజ్జల
ప్రభుత్వ నిర్ణయాలను ఉద్యోగుల ప్రతినిధులకు నచ్చజెప్పేందుకే కమిటీ వేశామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అపోహలు తొలగించేందుకు చర్చలకు రావాలని కోరామన్నారు. పీఆర్సీ జీవోలు అమలు నిలపాలని ఉద్యోగ సంఘాలు కోరాయని, చర్చలకు వస్తేనే మిగతా అంశాల గురించి మాట్లాడగలమన్నారు. చర్చలకు వస్తారని మంగళవారం కూడా ఎదురుచూస్తామని తెలిపారు. చర్చలకు రావాలని మరోసారి సమాచారం పంపుతామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

*మరోసారి చర్చలకు ఆహ్వానిస్తాం: మంత్రి బొత్స
ఉద్యోగుల ప్రతినిధులు చర్చలకు వస్తే తమ వైపు నుంచి.. ప్రభుత్వ నిర్ణయాన్ని నచ్చజెప్పే ప్రయత్నంలో భాగమే కమిటీ అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు జీవోలు అబయన్స్లో పెట్టి, కమిటీని అధికారికంగా ప్రకటించే వరకు వచ్చేది లేదన్నారని, అయితే మంగళవారం మరోసారి చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానిస్తామన్నారు. జీఏడీ సెక్రటరీ ఫోన్ చేసి చెప్పిన తర్వాత అధికారిక కమిటీ కాదని ఎలా చెబుతారని మంత్రి బొత్స ప్రశ్నించారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనన్నారు.

*ఏపీలో అరాచక పాలన సాగుతోంది: కేంద్రమంత్రి మురళీధరన్
కడప జిల్లాలో కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ, పార్లమెంట్ ఇన్చార్జ్ మంత్రి మురళీధరన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కడప సెంట్రల్ జైల్లో ఉన్న శ్రీకాంత్రెడ్డిని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో అశాంతి నెలకొందని, సీఎం జగన్ మోహన్ రెడ్డి అసమర్థత వల్ల రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని విమర్శించారు. సీఎం జగన్ పాలనపై దృష్టి పెట్టకపోవడంతో వైసీపీ నాయకులు రాష్ట్రంలో రెచ్చిపోతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అక్రమాలకు తెరలేపారని, ఏపిలో ఇస్లామిక్ పండమెంటల్ కార్యకలాపాలు ఎక్కువయ్యాయన్నారు. అల్లర్లకు కొందరు ప్రోత్సహిస్తున్నారని, దీనికి సీఎం బాధ్యత వహించాలన్నారు.

*గీత ఉప కులాల హక్కుల సాధనకు కృషి: కేఈ ప్రభాకర్
గీత ఉప కులాల హక్కుల సాధనకు ఐక్యంగా కృషి చేయాలని ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ అన్నారు. గాజువాకలో ఆదివారం జరిగిన గీత ఉప కులాల (యాత, శ్రీశయన, శెట్టి బలిజ, గౌడ, ఈడిగ) సంక్షేమ సంఘ ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా గీత ఉప కులాలకుఅన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. మాజీ మంత్రి పితాని మాట్లాడుతూ..గీత ఉప కులాలు వెనకబడి ఉన్నందున వారికి అన్నివిధాలా చేయూ త ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఎంపీ కొనకళ్ల మాట్లాడుతూ.. గీత ఉప కులాల సమస్యలపై రాష్ట్రప్రభుత్వం సమగ్ర సర్వే చేపట్టివారికి సాయం అందజేయాలని కోరారు. గౌతు శిరీష మాట్లాడుతూ, గీత ఉపకులాల సంక్షేమానికి గౌతు లచ్చన్న పోరాడి సాధించిన జీవో16 పక్కాగా అమలయ్యేలా కృషి చేయాలని కోరారు.

*యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘనలు: అశోక్గజపతిరాజు
రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలు యథేచ్ఛగా జరుగుతున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్గజపతిరాజు విమర్శించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆదివారం విజయనగరంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చాలా ప్రభుత్వాలు చూశానని, ఈ ప్రభుత్వంలో జరిగినంత రాజ్యాంగ ఉల్లంఘనలు ఎప్పుడూ జరగలేదని తెలిపారు. దీనిపై యువత పోరాడాలని సూచించారు.