NRI-NRT

హాంగ్‌కాంగ్‌లో ఘనంగా తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు

హాంగ్‌కాంగ్‌లో ఘనంగా తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు

ఈ తరం మిలినియల్ పిల్లల్లో తెలుగు భాష మాధుర్యాన్ని, తెలుగు సంస్కృతి సంపదను తెలియజేసేందుకు ‘ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య’ ప్రతి సంవత్సరం జనవరిలో పిల్లలతో భోగి, తెలుగు సాంస్కృతిక ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తోంది. అయితే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోవిడ్ నిబంధనల కారణంగా పిల్లలతో భోగి వేడుకలు సామూహికంగా చేయలేక పోయినా, ఆన్‌లైన్‌లో జూమ్ ద్వారా తెలుగు సాంస్కృతిక ఉత్సవాలను జరుపుతున్నామని సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటీ తెలిపారు.

ఈసారి ఉత్సవాలు నిర్వహించేందుకు కొన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ.. ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అయితే.. వేడుకల్లో పాల్గొనేందుకు సభ్యులు, పిల్లలు ఎంతో ఉత్సాహం ప్రదర్శించడంతో ఈ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు సిద్ధమయ్యామన్నారు. కాగా.. ఈ కార్యక్రమాన్ని, హాంగ్ కాంగ్ వాస్తవ్యులు, NRI తెలుగు ఐడల్ 2021 రెండవ విజేత హర్షిణీ పచ్చంటి.. ప్రార్థన గీతంతో ప్రారంభించారు. సాంప్రదాయ దుస్తులలో మెరిసిపోయిన చిన్నారులు.. భారతీయ శాస్త్రీయ సంగీతంలో ముద్దులొలికే తెలుగులో పాటలు పాడగా, మరికొందరు కన్నులకు ఇంపుగా భరతనాట్యం, కూచిపూడి నృత్యప్రదర్శన చేశారు. మరికొందరు టాలీవుడ్ పాటలకు డాన్స్ చేశారు. చిన్నారులు భారతీయ, పాశ్చాత్య శాస్త్రీయ వాయిద్యాల తమకున్న ప్రతిభను ప్రదర్శించి అందరి మన్ననలు పొందారు. కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన త్యాగరాజు, స్వాతంత్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్ర బోస్‌కు నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాంగ్ కాంగ్ వాస్తవ్యులు డా. సుజాత గోవాడ (ప్రసిద్ధ అర్బన్ డిసైనర్, సెర్టిఫైడ్ టౌన్ ప్లానర్) మాట్లాడుతూ.. పిల్లల ప్రదర్శనలు ఎంతో ముచ్చటగా ఉన్నాయని, వారి ఉత్సాహం తమకెంతో ఆనందాన్నిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లల్ని, వారి తల్లిదండ్రులని అభినందించారు. తెలుగు సమాఖ్య చేస్తున్న భాష – సాంస్కృతిక సేవను, తెలుగు వారందరిని ఒక తాటిపై తెచ్చేందుకు చేస్తున్న కృషిని ఎంతగానో మెచ్చుకున్నారు. ఇక విశిష్ట అతిథిగా విచ్చేసిన, టాలీవుడ్ దర్శకులు కిషోర్ మాట్లాడుతూ, పిల్లల ప్రదర్శనలను మెచ్చుకొన్నారు. తాను సినిమాల్లో బిజీగా వుండి, కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొనలేకపోయినా, సమాఖ్య నిరంతరం తెలుగు వారిని వివిధ కార్యక్రమాల ద్వారా కలిపేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు.

హాంగ్ కాంగ్‌లో మూడు దశాబ్దాలకు పైగా వైద్యుడిగా సేవలు అందిస్తున్న డా.వెంకట్ రావు తన సతీమణి శాంతితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లల ఆట పాటలను ఎంతో మెచ్చుకున్నారు. ప్రస్తుతం సమాఖ్య చేస్తున్న కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన సరస్వతి దేవిని స్మృతిస్తూ ఒక చక్కని భక్తి గీతాన్ని కూడా పాడి వినిపించారు. దంపతులు ఎంతో ఉల్లాసంగా పిల్లల్ని ఆశీర్వదించారు. ఇక ఈ వేడుకలు విజయవంతమయ్యేందుకు కృషి చేసిన పిల్లలను, వారి తల్లిదండ్రులును, సాంస్కృతిక కార్యదర్శి సువర్ణ చుండూరు, ఉప కోశాధికారి రమాదేవి సారంగా, ఆర్ధిక కార్యదర్శి రాజశేఖర్ మన్నే, జనరల్ సెక్రటరీ గర్దాస్ గ్యానేశ్వర్, స్వచ్చందంగా సేవనందించిన అపర్ణ కందా, రాజీవ్ ఈయు తదితరులను సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటీ కృతజ్ఞతలు తెలిపారు.