DailyDose

TNI రాజకీయ వార్తలు – 26/01/2022

రాజకీయ వార్తలు – 26/01/2022

*ఆదివాసీల సమస్యలను పరిష్కరిస్తాం: కేటీఆర్
రాష్ట్రంలోని ఆదివాసీల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్ను ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, ఆదివాసీ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కలిశారు. తమ తెగలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విన్నించారు. ఆదివాసీలకు ప్రభుత్వం మరింత చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివాసీల కోసం తీసుకోవాల్సిన అభివృద్ధి సంక్షేమ చర్యలపైన తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆదివాసీ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆదివాసీ రైతులకు సంబంధించి అటవీశాఖ భూముల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. గతంలో ఇచ్చిన మాట మేరకు గిరిజన తండాలను, ఆదివాసీ గూడెలను గ్రామ పంచాయతీలుగా మార్చిందని ఆయన పేర్కొన్నారు.

*అధికారంలోకి వస్తే డ్రగ్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం: భగవంత్ మాన్
పంజాబ్లో ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని వ్యసనా రహితంగా మార్చేందుకు డ్రగ్స్ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే పంజాబ్ పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తామని పేర్కొన్నారు. రాజకీయ జోక్యం లేని పంజాబ్ కోసం డ్రగ్ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేస్తామని ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ తెలిపారు.

*కొడాలిని బర్తరఫ్ చేయాలి: వర్ల రామయ్య
మంత్రి కొడాలి నానిని వెంటనే బర్తరఫ్ చేయాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. క్యాసినోపై రాష్ట్రం అట్టుడికిపోతున్నా సీఎం ఏమీ జరగనట్టు నటిస్తున్నారని ఆయన ఆరోపించారు. సీఎం జగన్ ఇప్పటికైనా నిజాలు నిగ్గుతేల్చాలన్నారు. క్యాసినోపై డీజీపీతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

* రైతులకు అరవింద్ ఓ లెక్కా: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
ఎంపీ ధర్మపురి అరవింద్పై ఎమ్మెల్యే జీవన్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పంజాబ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి మోడీనే రైతులు అరగంట ఆపారని, అలాంటిది రైతులకు అరవింద్ ఓ లెక్కా అని ఆయన వ్యాఖ్యానించారు. అరవింద్ అబద్దాల అడ్డా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను రెచ్చగొట్టి, వారిని గుండాలు అంటు న్నారని ఆయన పేర్కొన్నారు. పసుపుబోర్డు తెస్తానని ఎంపీ బాండ్ రాసిచ్చారని, బోర్డ్ ఏమైందని రైతులు అడుగుతున్నారని ఆయన నిలదీశారు. అరవింద్ ఒళ్లు దగ్గరపెట్టు కో, రైతులకు క్షమాపణ చెప్పు అని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి నువ్వెంత తెచ్చావో చర్చకు వచ్చే దమ్ముందా అని ఆయన సవాల్ విసిరారు.

* సత్యసాయి జిల్లా ప్రభుత్వ నిర్ణయమే: పల్లె రఘునాథరెడ్డి
సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్జే రత్నాకర్ అభ్యర్థన మేరకే పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లాగా ప్రకటన వెలువడిందని మాజీమంత్రి రఘునాథరెడ్డి అన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ నిర్ణయమేనని ఆయన తెలిపారు. కొత్త జిల్లా ఏర్పాటులో ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి ఘనత ఏమీ లేదని ఆయన తేల్చి చెప్పారు. అందరి సమిష్టి కృషితోనే జిల్లా సాధ్యమైందన్నారు. తానే జిల్లా సాధించినట్లు శ్రీధర్రెడ్డి పేర్కొనడం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు.

* పద్మశ్రీ ఆవార్డుల్లో ఏపీ బూతుల మంత్రులను చేర్చాల్సింది: నారాయణ
కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ ఆవార్డుల్లో ఏపీ బూతుల మంత్రులను చేర్చాల్సిందని పేర్కొంటూ సీపీఐ నారాయణ ఓ వీడియో విడుదల చేశారు. ఏపీ మంత్రుల వ్యాఖ్యలకు సీఎం బాధ్యత వహించాలన్నారు. ఏపీ మంత్రులు బస్టాండ్ల్లో మాట్లాడే భాష కంటే హీనంగా మాట్లాడుతున్నారన్నారు. భారతదేశ చరిత్రలో ఏపీ అప్రతిష్ట పాలవుతోందని సీపీఐ నారాయణ పేర్కొన్నారు.

* జగన్ పాలన రివర్స్ లో నడుస్తోంది..: కన్నా లక్ష్మీ నారాయణ
బీజేపీ ఆఫీసులో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు జూపూడి రంగరాజు, రమేష్ నాయుడు, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం కన్నా లక్ష్మీ నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటును బీజేపీ స్వాగతిస్తుందని తెలిపారు. అంతేకాదు బీజేపీ మ్యానిఫెస్టోలో కూడా జిల్లాల పెంపు అంశం పెట్టామని పేర్కొన్నారు. అయితే…దీనిపై కొంతమేర చర్చ జరగాల్సివుందని తెలియజేశారు. ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, పీఆర్సీ ఎన్నడూ లేని విధంగా ఉందన్నారు. వైసీపీ సర్కార్ పాలన మొత్తం రివర్స్ లో వెళ్తుందని కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు.

* అందరినీ కాపాడుకుంటా…ఆందోళన వద్దు :మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నా నియోజక వర్గం ప్రజలను నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. అందరినీ కరోనా నుంచి రక్షించుకుంటాను. ఎవరూ ఆందోళన చెందవద్దు. కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు కరోనా నుంచి బయట పడవచ్చు అని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హైదరాబాద్ నుండి పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం లోని ప్రభుత్వ డాక్టర్లు, వైద్య సిబ్బంది, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, కరోనా బాధితులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. కరోనా నియంత్రణకు పలు సూచనలు చేశారు.