NRI-NRT

“గిన్నిస్ రికార్డు” నెలకొల్పనున్న తానా సభ్యత్వ నమోదు–TNI ప్రత్యేకం

‘గిన్నిస్ రికార్డు’ నెలకొల్పనున్న ‘తానా’ సభ్యత్వ నమోదు – TNI ప్రత్యేకం

ప్రపంచంలోనే అతిపెద్ద తెలుగు సంఘంగా గుర్తింపు పొందిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా)లో ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరింది. గడిచిన ఎన్నికల అనంతరం తానాలో మూడు గ్రూపులు ఏర్పడినట్లు సమాచారం. గతంలో తానా మాజీ అద్యక్షుడు తాళ్ళూరి జయశేఖర్, ప్రస్తుత అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరిలు ఏకమై కొడాలి నరేన్ గ్రూపును ఓడించారు. ప్రస్తుతం అంజయ్య చౌదరి, జయశేఖర్ వర్గాల మధ్య పోసగటం లేదని సమాచారం. తానా తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికైన శృంగవరపు నిరంజన్, తాళ్ళూరి జయశేఖర్‌లు ఒక వర్గంగా ఏర్పడ్డారు.

*పోటాపోటీగా సభ్యత్వ నమోదు
గతంలో అధ్యక్ష పదవికి పోటీ చేసి పరాజయం పాలైన కొడాలి నరేన్ తిరిగి అధ్యక్ష పదవిని కైవసం చేసుకోవడానికి వచ్చే ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం తానాలో సభ్యత్వ నమోదు ముమ్మరంగా జరుగుతోంది. మూడు వర్గాలు పోటాపోటీగా నూతన సభ్యులను చేర్పిస్తున్నారు. గతంలో దాదాపుగా తానాలో 34వేల మంది సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం కొత్తగా గురువారం వరకు ఈ మూడు గ్రూపులు కలిసి 22వేల మంది సభ్యులను నూతనంగా తానాలో చేర్చినట్లు సమాచారం. సభ్యత్వ నమోదు కోసం ఈ నెల 31వ తేదీ వరకు సమయం ఉంది. ఈ నాలుగు రోజుల్లో మరొక పదివేల మందిని నూతన సభ్యులుగా చేర్చటం కోసం మూడు వర్గాలు తమ శక్తియుక్తులను ప్రయోగిస్తున్నట్లు సమాచారం. గతంలో కొడాలి నరేన్‌కు మద్దతుగా నిలిచిన తానా మాజీ అధ్యక్షులు కోమటి జయరాం, వేమన సతీష్, నరేన్ సన్నిహితుడు వల్లేపల్లి శశికాంత్‌లు కూడా ఈ పర్యాయం మళ్ళీ నరేన్‌కు మద్దతుగా నూతన సభ్యులను ముమ్మరంగా చేర్పిస్తున్నట్లు సమాచారం.

*’గిన్నిస్ రికార్డు’కు ఎక్కుతుందా?
ఇప్పటికే ప్రపంచంలో అతిపెద్ద తెలుగు సంఘంగా గుర్తింపు పొందిన తానా నూతన సభ్యుల చేరికతో మరింతగా బలపడనున్నది. దాదాపు 60వేలకు పైగా సభ్యులు తానాలో నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో సభ్యులు కలిగిన సంస్థగా తానా గిన్నిస్ రికార్డులో నమోదయ్యే అవకాశం ఉంది. పరిస్థితులు చూస్తూ ఉంటే వచ్చే తానా ఎన్నికలు మంచి రసపట్టుగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. —కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.