DailyDose

TNI – నేటి తాజా వార్తలు – 27/01/2022

TNI – నేటి తాజా వార్తలు – 27/01/2022

*శ్రీ సిటీలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నోవా ఎయిర్‌ ఎండీ గజనన్‌ నబర్, కమర్షియల్‌ హెడ్‌ శరద్‌ మధోక్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 14 నెలల్లోప్లాంట్‌ ప్రారంభం కావడం ఒక మైలురాయి అని కొనియాడారు. 220 టన్నుల ఆక్సిజన్‌ తయారీ చేయడం చాలా ముఖ్యమైన విషయమన్నారు. 144 పీఎస్‌ఏ ప్లాంట్లు కూడా వివిధ ఆస్పత్రుల్లో పెట్టామని, మరో 32 ప్లాంట్లు కూడా పెడుతున్నామని పేర్కొన్నారు.

*ఏపీలో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 13,474 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 9 మంది మృతి చెందారు. ఏపీలో మొత్తం 22,36,047కి కరోనా కేసులు చేరాయి. ఇప్పటివరకు కరోనాతో 14,579 మరణాలు సంభవించాయి. ఏపీలో 1,09,493 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 21,11,975 మంది రికవరీ చెందారు.

* ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, దాని పరిధి లోని అన్ని కళాశాలలు అందిస్తున్న 4 అండర్ గ్రాడ్యుయేట్,18 పోస్ట్ గ్రాడ్యుయేట్,13 డాక్టోరల్ ప్రోగ్రాంస్ కి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ కి చెందిన నేషనల్ అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్ అక్రిడేషన్ బోర్డ్ 2021 డిశెంబర్ లో A గ్రేడ్ ఇచ్చింది.ఈ ప్రోగ్రాంస్ అన్నీ అగ్రికల్చర్,అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ,కమ్యూనిటీ సైన్స్ ఫాకల్టీ ల పరిధిలో నిర్వహిస్తారు. 2014 లో తర్వాత పీ జే టీ ఎస్ యూ వరంగల్,పాలెం,సిరిసిల్ల ల లో మూడు వ్యవసాయ కళాశాలల్ని, రుద్రూర్ లో ఒక ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలని స్థాపించినట్లు ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్ రావు ఒక ప్రకటనలో వివరించారు.

* చిత్తూరు జిల్లాలోని తుమ్మిందపాలెంలో జోరుగా జల్లికట్టు కొనసాగుతోంది. సమీప ప్రాంతాల నుంచి భారీగా జనం తరలివచ్చారు. అంగరంగ వైభవంగా జల్లికట్టు ఎద్దులను ముస్తాబు చేశారు. ఎద్దులను నివారించేందుకు యువత యత్నం చేశారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి.

* టర్కీలో అదృశ్యమైన భారతీయుల ఆచూకీ లభించింది. రెండ్రోజుల్లో ఇండియాకు చేరుకుంటారని గుజరాత్‌ సీనియర్ పోలీసు అధికారులు మీడియాకు వెల్లడించారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల క్రితం ఒకే కుటంబానికి చెందిన నలుగురు గుజరాతీయులు కెనడా ద్వారా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ సరిహద్దు వద్ద ప్రాణాలు వదిలారు. ఈ ఘటన భారత్ సహా కెనడా, అమెరికాలో కూడా సంచలనంగా మారింది. ఈ ఘటన మరువక ముందే.. రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురు గుజరాతీలు టర్కీ ద్వారా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఇస్తాంబుల్‌లో అదృశ్యమయ్యారంటూ వార్తలొచ్చాయి. విదేశీయులను అక్రమంగా అమెరికాలోకి తరలించే ముఠానే వీళ్లను కిడ్నాప్ చేసి ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి.

* చారిత్రక కట్టడాల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గురువారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట లో నిజాం ప్రభుత్వ హయాంలో నిర్మించిన మెట్ల బావిని మున్సిపల్ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, సహిత స్వచ్చంద సంస్థ నిర్వహకురాలు కల్పనా రమేష్ లతో కలిసి పరిశీలించారు.

* రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో దర్యాప్తు జరుగుతోందని నగర సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. ఈ కేసులో పురోగతి సాధించామని సీపీ పేర్కొన్నారు. ఇప్పటివరకు పలు ఖాతాల్లోని రూ.3 కోట్లు నిలుపుదల చేశామని సీపీ తెలిపారు. ఖాతాలు తెరిచినవారి వివరాలు, తెరిపించిన వారి వివరాలు గుర్తించామన్నారు. హ్యాకింగ్ జరగడానికి ప్రధాన కారణం బ్యాంకింగ్ సర్వర్‌లో సమస్యలేనని ఆయన పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా ఉన్నందుకు బ్యాంక్‌పై కూడా కేసు నమోదు చేస్తామని ఆయన ప్రకటించారు. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌కు సరైన సైబర్ సెక్యూరిటీ లేదన్నారు. మొత్తం 12.9 కోట్ల నగదును 3 ఖాతాల నుంచి దేశంలోని 120కిపైగా ఖాతాల్లోకి మళ్లించారని సీపీ తెలిపారు.

* చెన్నై రాష్ట్రంలో కరోనా మూడో అలను నియం త్రించేలా ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది. వాణిజ్య సంస్థలు, దుకాణాలు, హోటళ్లు, కర్మాగారాలు రాత్రి 10 గంటల వరకు మాత్రమే పనిచేయాలని నిబంధన విధించిన ప్రభుత్వం, రాత్రి 10 నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు లాక్‌డౌన్‌ అమలుకు తెచ్చింది. అలాగే, 9,16,23 తేది (ఆదివారాలు) సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేసింది. అదే సమయంలో శుక్ర, శని, ఆదివారాల్లో ప్రార్థనా స్థలాలకు భక్తుల ప్రవేశాన్ని నిషేధించారు. ఆదివారం నిర్వహించే సంపూర్ణ లాక్‌డౌన్‌పై ప్రతి వారం సీఎం సమీక్షిస్తు న్నారు. ప్రస్తుతం విధించిన నిబంధనలతో కూడిన లాక్‌డౌన్‌ ఈ నెల 31తో ముగియనుంది. ఈ క్రమంలో, లాక్‌డౌన్‌ పొడిగింపుపై గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో వైద్యనిపుణులు, పలు శాఖల ఉన్నతాధి కారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లు సచివాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.

* మెగాస్టార్ చిరంజీవికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశారు. కరోనా బారిన పడ్డ చిరంజీవిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. అలాగే చిరంజీవి కుటుంబ సభ్యులతో కూడా కేసీఆర్ మాట్లాడారు.

* శంషాబాద్‌ బస్టాండ్ సమీపంలో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఓ యువతి కారు నడిపింది. రోడ్డుపై వెళ్తున్న ముగ్గురిని ఢీకొట్టి.. తిరిగి సదరు యువతి వాగ్వాదానికి దిగింది. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువతిని స్టేషన్‌కు తరలించారు.

*గోవా మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ పనాజీ నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. గురువారం ఉత్పల్ తన నామినేషన్‌ను సమర్పించనున్నారు. పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఉత్పల్ బీజేపీకి రాజీనామా చేశారు. గతంలోనే తాను అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఉత్పల్ ప్రకటించారు.పంజాబ్‌లో అకాలీదళ్ పార్టీ అమృత్‌సర్ (తూర్పు) స్థానం నుంచి మాజీ మంత్రి బిక్రమ్ సింగ్ మజిథియాను పోటీకి దింపింది. కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూపై బిక్రమ్ సింగ్ ను పోటీలో పెట్టింది.

*టీడీపీ నిజనిర్ధారణ కమిటీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ను కలిసింది. గుడివాడలో జూదం నిర్వహించారని గవర్నర్‌కు కమిటీ నేతలు ఫిర్యాదు చేశారు. క్యాసినోపై కరపత్రాలు, ఆధారాలను గవర్నర్‌కు సమర్పించారు. చంద్రబాబుకు సమర్పించిన నివేదికను గవర్నర్‌కు అందజేశారు. గుడివాడ పర్యటనలో తమపై జరిగిన దాడి, పోలీసుల వ్యవహారంపైనా ఫిర్యాదు చేశారు. కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తొలగించాలని కోరారు. గవర్నర్‌ను కలిసిన వారిలో వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, ఆలపాటి రాజా ఉన్నారు.

*ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విధానాలను నిరసిస్తూ పలువురు టీఆర్ఎస్ నేతలు పార్టీకి రాజీనామా చేశారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్‌పై దాడి చేయడం అప్రజాస్వామికం అంటూ ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, ఆర్మూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్ పర్సన్ కవిత భర్త యామాద్రి భాస్కర్ తదితరులు పార్టీకి రాజీనామా చేశారు.

*ఏపీలో జిల్లాల పెంపు ప్రస్తుతం ఉప్పుకి, ఉపకారానికి పనికిరాని పెంపని బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను, ఉద్యమాల స్ఫూర్తిని పక్కదారి పట్టించేందుకే జిల్లాల పెంపు ఎత్తుగడని విమర్శించారు. కర్నూలుకు దామోదరం సంజీవయ్య జిల్లా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంత జిల్లాకు డాక్టర్. బీఆర్ అంబేద్కర్ జిల్లా పేరు పెట్టాలని, దళిత సంఘాలు ప్రభుత్వం కళ్ళు తెరిచేలా వత్తిడి తేవాలని పోతుల బాలకోటయ్య పిలుపు ఇచ్చారు.

*కృష్ణా, గోదావరీ నదీ బోర్డుల చైర్మన్లతో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి గురువారం సమీక్ష నిర్వహించనున్నారు. ఉభయ బోర్డుల చైర్మన్లతో ఇవాళ వర్చువల్‌ విధానంలో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు పురోగతి, ప్రాజెక్టుల నిర్వహణపై సమీక్షించనున్నారు. కృష్ణానదీ యాజమాన్య బోర్డు రెండు రోజులపాటు ప్రాజెక్టులను పరిశీలించనుంది. కేఆర్‌ఎంబీ సభ్యుడు రవికుమార్‌ పిళ్లై నేతృత్వంలో ప్రాజెక్టులను సందర్శించనున్నారు. ఇవాళ జూరాల టెలిమెట్రీ స్టేషన్లను పరిశీలిస్తారు. శుక్రవారం ఆర్టీఎస్‌, సుంకేశుల, తుమ్మిళ్ల ప్రాజెక్టులను పరిశీలిస్తారు.

*కృష్ణా, గోదావరీ నదీ బోర్డుల చైర్మన్లతో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సమీక్ష నిర్వహించనుంది. ఉభయ బోర్డుల చైర్మన్లతో ఇవాళ వర్చువల్‌ విధానంలో సమావేశం కానుంది. ఈ సందర్భంగా గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు పురోగతి, ప్రాజెక్టుల నిర్వహణపై సమీక్షించనున్నారు. కృష్ణానదీ యాజమాన్య బోర్డు రెండు రోజులపాటు ప్రాజెక్టులను పరిశీలించనుంది. కేఆర్‌ఎంబీ సభ్యుడు రవికుమార్‌ పిళ్లై నేతృత్వంలో ప్రాజెక్టులను సందర్శించనున్నారు. ఇవాళ జూరాల టెలిమెట్రీ స్టేషన్లను పరిశీలిస్తారు. శుక్రవారం ఆర్టీఎస్‌, సుంకేశుల, తుమ్మిళ్ల ప్రాజెక్టులను పరిశీలిస్తారు.

*ఓ వ్యక్తిపై ఉన్న ఒకే ఒక్క కేసులో న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించిన తర్వాత కూడా పోలీసులు రౌడీషీట్‌ కొనసాగించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. కేసులు పెండింగ్‌లో లేకుండా.. సంబంధిత వ్యక్తి చర్యలు ప్రజాప్రయోజనాలకు విఘాతం కలిగించనప్పుడు రౌడీ షీట్‌ కొనసాగించడం సరికాదని వ్యాఖ్యానించింది. పిటిషనర్‌పై రౌడీషీట్‌ మూసివేయాలని మంగళగిరి పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. తనపై ఉన్న రౌడీషీట్‌ మూసివేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ చిన కాకానికి చెందిన మర్రి గోపి హైకోర్టును ఆశ్రయించారు.

*గోదావరి జలాల్లో తమకు 750 టీఎంసీల నీటి వాటా ఉందని, దానికి లోబడే తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర జల సంఘాన్ని (సీడబ్ల్యూసీ) ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరింది. వాటా విషయంపై సీడబ్ల్యూసీకి ఈ మేరకు లేఖ రాసింది. ఈ లేఖపై సీడబ్ల్యూసీ స్పందించింది. ఆధారాలను వారం రోజుల్లోగా సమర్పించాలని ఆదేశించింది. ఈ నెల 29వ తేదీ వరకు గడువు ఇచ్చింది.

* అంటార్కిటిక్ ద్వీపకల్పంలో ఓ భారీ మంచు ఖండం కరిగిపోతోంది. 2017లో వేరుపడిన ఈ మంచు ఖండం వైశాల్యం 5,719 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ప్రస్తుతం ఇది సగానికిపైగా కరిగిపోయింది. ఫలితంగా సముద్రంలోకి 152 బిలియన్ టన్నుల నీరు, పోషకాలు చేరాయి. ఈ వివరాలను ‘రిమోట్ సెన్సింగ్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్’ జర్నల్‌లో ఇటీవల ప్రచురించారు.

*అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ పర్యటించారు. గురువారం ఆయన ముందుగా అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించుకున్నారు. అనంతరం అమృత్‌సర్‌లోనే ఉన్న అమరవీరుల స్మారకమైన జలియన్‌వాలా బాఘ్‌ను సాయంత్రం సమయంలో సందర్శించారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీపంజాబ్ కాంగ్రెస్ అధినేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ సహా అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ వెంట వచ్చారు. జలియన్‌వాలా బాఘ్ ఎంట్ర పుస్తకంలో రాహుల్ సంతకం చేస్తున్న చిత్రాలుఅమరవీరుల స్థూపం వద్ద జలియన్‌వాలా అమరులకు నివాళులు అర్పిస్తున్న ఫొటోలను కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.