Politics

TNI – నేటి రాజకీయ వార్తలు – 27/01/2022

TNI – నేటి రాజకీయ  వార్తలు – 27/01/2022

*కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే మేమెందుకు వ్యతిరేకిస్తాం: చంద్రబాబు
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే తామెందుకు వ్యతిరేకిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్‌ను ఎవ‌రు గౌర‌వించినా తాము స్వాగ‌తిస్తామని చెప్పారు. ఎన్టీఆర్ కేవ‌లం ఒక ప్రాంతానికి చెందిన నేత కాదని, ఎన్టీఆర్‌కు భార‌త ర‌త్న ఇవ్వాల‌ని టీడీపీ డిమాండ్ చేస్తోందన్నారు. హైద‌రాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌కి ఎన్టీఆర్ పేరును వైఎస్ఆర్ తొల‌గించారని విమర్శించారు. క‌డ‌ప జిల్లాకు వైఎస్‌ పేరు పెట్టినా తాము వ్యతిరేకించ‌లేదని గుర్తుచేశారు. టీడీపీకి ద్వంద్వ విధానాలు ఉండ‌వని చంద్రబాబు ప్రకటించారు. ఏపీలో ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని తప్పుబట్టారు. ఎన్టీఆర్ స్మృతి వ‌నం ప్రాజెక్ట్‌ ను నిలిపివేసిన జ‌గ‌న్‌రెడ్డి ప్రభుత్వం.. ఎన్టీఆర్‌పై ప్రేముంద‌ని చెప్పే ప్రయ‌త్నాన్ని ప్రజ‌లు న‌మ్మరని తెలిపారు.

*కేసీఆర్ వల్లే కాళేశ్వరానికి రాని హోదా: జీవన్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకుండా కేసీఆర్ అడ్డుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‎రెడ్డి ఆరోపించారు. జాతీయ హోదా వస్తే కేసీఆర్ లోపాలు బయట పడతాయని ఆయన వ్యాఖ్యానించారు. కమీషన్ల కక్కుర్తి అంతా ప్రజలకు తెలిసిపోతుందన్నారు. కాళేశ్వరం నిర్వహణ కేంద్రం చేతుల్లోకి వెళ్లనివ్వడం లేదని చెప్పారు. కేసీఆర్ చేసిన అప్పుకు ప్రజలు నష్టపోతున్నారని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

* నాణ్యతా ప్రమాణాలతో పీఎంజీఎస్ పనులు: ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజనపధకం (పిఎంజిఎస్ వై) ద్వారా రోడ్ల ప‌నులు అత్యంత వేగంగా, నాణ్య‌తా ప్ర‌మాణాల‌తో జ‌రుగుతున్నాయ‌ని, ఎక్క‌డా రాజీ లేకుండా ప‌నులు నిర్వ‌హిస్తున్నామ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి దయాక‌ర్ రావు తెలిపారు. పీఎంజీఎస్‌వై (ప్ర‌ధాన‌మంత్రి గ్రామీణ స‌డ‌క్ యోజ‌న‌) రోడ్ల ప‌నుల‌పై కేంద్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి గిరిరాజ్ సింగ్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల మంత్రులు, కార్య‌ద‌ర్శుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా గురువారం ఢిల్లీ నుండి స‌మీక్షించారు. తెలంగాణ రాష్ట్ర సెక్ర‌టేరియ‌ట్‌ నుండి మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, సెక్ర‌ట‌రీ సందీప్ కుమార్ సుల్తానియా త‌దిత‌రులు పాల్గొన్నారు.

* దేశ భవితవ్యాన్ని చూపేది యూపీ ఎన్నికలే: అమిత్ షా
దేశ భవితవ్యాన్ని నిర్దేశించేది ఉత్తరప్రదేశ్ ఎన్నికలేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో వరుసగా రెండవసారి అధికారంలోకి రావడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా గురువారం మధురలో అమిత్ షా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజ్‌వాదీ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అఖిలేష్‌ను మళ్లీ గెలిపిస్తే గూండా రాజ్యం వస్తుందని అమిత్ షా విమర్శించారు. ‘‘అఖిలేష్ బాబు.. నువ్వు చట్టం గురించి మాట్లాడుతున్నావు. మీ నేత అజాం ఖాన్ అరెస్ట్ అయ్యారు. ఆయనపై అనేక కేసులు నమోదు అయ్యాయి. కొద్దిగా సిగ్గుపడు’’ అని అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘ఒకప్పుడు యూపీని గూండాలు, నేరస్తులు ఏలేవారు. పోలీసులు కూడా వారికి భయపడేవారు. మహిళలు, యువతులు ఓటు వేయడానికి భయపడేవారు. కానీ ఇప్పుడది పూర్తిగా మారిపోయింది. గూండాలు, నేరస్తులు వాళ్లకు వాళ్లుగా పోలీసుల ముందుకు వచ్చి లొంగిపోతున్నారు. వాళ్ల మెడకి వాళ్లే ఉరి బిగించుకుంటున్నారు’’ అని అన్నారు.

* ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లడను.. ముందుస్తు ఎన్నికలొస్తే మాకే మంచిది: వైఎస్ షర్మిల
మేము ఏ పార్టీలతో కలిసేది లేదని, కేసీఆర్ యూపీలో ప్రచారం చేయడం అనేది పెద్ద జోక్ అన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.కేసీఆర్ దేశానికి వెళ్తే లక్షల్లో ఆత్మహత్యలు జరుగుతాయని అన్నారు షర్మిల. దేశాన్నే అమ్మే పరిస్థితి వస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో బీజేపీపై కూడా విమర్శలు గుప్పించారు షర్మిల. రైతుల గురించి బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడారు? అని ప్రశ్నించారు. రెండు కోట్ల మందికి బీజేపీ ఉద్యోగాలు ఇస్తానంటూ మోసం చేసిందని, కేసీఆర్ 33 జిల్లాలు ఏర్పాటు చేశారని, ఒక్క జిల్లాలో అయినా ఉద్యోగాలు భర్తీ చేశారా? అని నిలదీశారు.ఆంధ్రప్రదేశ్ గురించి అయితే నేను మాట్లాడను.. కోవిడ్ పూర్తయిన తర్వాత మళ్ళీ పాదయాత్ర చేస్తాను అని చెప్పారు షర్మిల. ముందస్తు ఎన్నికలు వస్తే మాత్రం మాకే మంచిదని కేసీఆర్ త్వరగా దిగిపోతారని అన్నారు షర్మిల. పార్టీ రిజిస్ట్రేషన్ గురించి ఎన్నికల కమిషన్‌కి అప్లికేషన్ పెట్టుకున్నామని, విజయమ్మ కూడా No Objection లెటర్ ఇచ్చారని, కానీ ఇంతవరకు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయలేదో ఎన్నికల కమిషన్‌కే తెలియాలని అన్నారు.

* కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నాం: వైవీ సుబ్బారెడ్డి
కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. సనాతన ధర్మ ప్రచార పరిషత్‌లో భాగంగా ప్రతి ఆలయంలో గోపూజ నిర్వహించాలని చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నమామి గోవిందా పేరుతో గో ఆధారిత ఉత్పత్తుల తయారీ చేస్తామని తెలిపారు. కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్‌ సంస్థ సహకారంతో తయారీ చేస్తామని పేర్కొన్నారు. ఉద్యోగుల భద్రత కోసం 15 కార్పొరేట్‌ ఆస్పత్రులతో ఒప్పందం చేసుకుందామన్నారు. రథసప్తమి వేడుకలు ఏకాంతంగా నిర్వహిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

* జగన్‌రెడ్డి రాజ్యాంగం చదువుకోవాలి: రఘురామ
సీఎం జగన్‌రెడ్డి రాజ్యాంగం చదువుకోవాలని ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మనం రాజ్యాంగాన్ని గౌరవిస్తే 200 కేసులను ఓడిపోయేవాళ్లం కాదన్నారు. రాజ్యాంగం ఫాలో కావాలన్నందుకే తనను కొట్టారని తెలిపారు. ఒక ఎంపీ నియోజకవర్గంలో తిరిగే హక్కు కూడా ఏపీలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి జీవోలు అమలు చేసి జిల్లాల విభజన చేపడుతున్నారని తప్పుబట్టారు. పార్లమెంట్ ప్రాతిపదికన జిల్లాల ఏర్పాటు అంటున్నారని, అర్ధరాత్రి జిల్లాలు ఏర్పాటు చేయాల్సిన అవసరమేంటి? అని రఘురామ ప్రశ్నించారు. కేబినెట్‌లో జిల్లాలపై చర్చ జరగకుండానే.. అర్ధాంతరంగా తీసుకురావాల్సిన అవసరమేంటి? అని రఘురామ ప్రశ్నించారు. ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టకుండా జిల్లాల విభజన చేయాలని రఘురామకృష్ణరాజు సూచించారు.

*రాహుల్ గాంధీ ఘాటు లేఖపై స్పందించిన ట్విట్టర్
భారత దేశ భావన విధ్వంసంలో పావుగా మారవద్దని ట్విటర్‌ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గట్టిగా కోరారు. స్వేచ్ఛగా భావాలను వ్యక్తీకరించడాన్ని అరికట్టడంలో ఈ సంస్థ అనుకోకుండా భాగస్వామి అవుతోందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌కు రాసిన లేఖపై ఆ సంస్థ స్పందించి, ఆయనకు బదులిచ్చింది. మానిప్యులేషన్, స్పామ్‌లను ఎంత మాత్రం సహించబోమని స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ గురువారం రాసిన ఈ లేఖలో తన ట్విటర్ ఖాతాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ల ట్విటర్ ఖాతాలతో పోల్చుతూ విశ్లేషణాత్మక వివరాలను జోడించారు. 2021లో మొదటి ఏడు నెలల్లో సగటున 4 లక్షల మంది చొప్పున ఫాలోయర్లు పెరగగా, అదే సంవత్సరం ఆగస్టులో ఎనిమిది రోజులపాటు తన ఖాతా సస్పెండ్ అయిన తర్వాత ఫాలోయర్ల పెరుగుదల నిలిచిపోయిందని తెలిపారు. కచ్చితంగా ఇదే సమయంలో తాను ఢిల్లీలో ఓ అత్యాచార బాధితురాలి కుటుంబం అనుభవిస్తున్న ఆవేదనపై నిలదీశానని, రైతులకు సంఘీభావంగా నిలిచానని, ప్రభుత్వంతో అనేక మానవ హక్కుల ఉల్లంఘనలపై పోరాడానని తెలిపారు. భారత దేశంలో ఇటీవలి కాలంలో రాజకీయ నేతలు పోస్ట్ చేసిన వీడియోలలో చాలా ఎక్కువ మంది చూసినవాటిలో ఒకటి తన వీడియో అని తెలిపారు. ఆ వీడియోలో తాను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేస్తానని తాను హామీ ఇచ్చానని తెలిపారు. తాను ఓ బిలియన్‌కుపైగాగల భారతీయుల తరపున ఈ లేఖను రాస్తున్నట్లు తెలిపారు. భారత దేశ భావన విధ్వంసంలో పావుగా మారవద్దని కోరారు.

* టిప్పు సుల్తాన్ పేరుపై వివాదం: బీజేపీ పాఠాలు అక్కర్లేదన్న శివసేన
మహారాష్ట్ర రాజధాని ముంబైలో పునర్ణిర్మించిన ఒక స్పోర్ట్స్ కాంప్టెక్స్‌కు టిప్పు సుల్తాన్ పేరు మార్పురై అధికార విపక్ష నేతల మధ్య తీవ్ర వాగ్వివాదానికి దారి తీసింది. పెద్ద సంఖ్యలో హిందువులను చంపిన వ్యక్తి పేరును పెట్టనివ్వబోమని మహారాష్ట్ర ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఘాటుగా స్పందించారు. కాగా, టిప్పు సుల్తాన్ స్వాతంత్ర్య సమరయోధుడని, చరిత్ర గురించి బీజేపీ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ అంతే ఘాటుగా స్పందించారు. కర్ణాటక వెళ్లినప్పుడు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఓ ప్రసంగంలో టిప్పు సుల్తాన్‌ను పొగిడిన విషయాన్ని సంజయ్ రౌత్ గుర్తు చేస్తూ ‘‘రాష్ట్రపతిని రాజీనామా చేయమని కోరతారా?’’ అంటూ దేవేంద్ర ఫడ్నవీస్‌ను ప్రశ్నించారు.

*ఏపీ సమస్యలను పరిష్కరించాలంటే..: సోమువీర్రాజు
వైసీపీ కేసినో పార్టీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఎద్దేవా చేశారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ గుడివాడకు వెళ్తే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వానికి కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పుడే గుర్తొచ్చిందా?… రెండున్నరేళ్లుగా వైసీపీ సర్కార్ ఏం చేస్తోందని నిలదీశారు. రాష్ట్రంలో రోడ్లు కూడా సరిగా వేయలేకపోయిందని మండిపడ్డారు. ఏపీలో బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ సమస్యలను పరిష్కరించాలంటే.. అధికారంలో ప్రాంతీయ పార్టీలు ఉండకూడదన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక ఇస్తామన్నారు. అలాగే పీఆర్సీ సమస్యలు ఉండవని సోమువీర్రాజు అన్నారు.