NRI-NRT

ఓ సాధ్వి… అమెరికా TO రుషికేశ్

ఓ సాధ్వి… అమెరికా TO రుషికేశ్

ఓ సాధ్వి… అమెరికా TO రుషికేశ్ 
25 ఏండ్ల క్రితం .. భుజానికి సంచి తగిలించుకొని అమెరికాలో హాలీవుడ్ సినిమాలకు పెట్టింది పేరైన లాస్ ఏంజెల్స్ నుంచి భారతదేశ సందర్శనకు వచ్చిందామె . అందుకోసం , స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో మానసిక శాస్త్రంలో పీహెచ్మీకి విరామం ఇచ్చింది. విమానం దిగగానే , గంగా తీరంలోని రుషికేశ్కు చేరుకుంది. తన పేరును సాధ్వీ భగవతీ సరస్వతిగా మార్చుకొంది. ఆ అనుభవాలకు ఓ పుస్తక రూపం కూడా ఇచ్చింది. ‘ 1996 నాటి మాట. నా భర్త క్రిస్మస్ సెలవులను భారత్లో గడుపుదామని అన్నారు. శాకాహార వంటకాలపై ఇష్టంతో నేను వెంటనే సరే అన్నాను . అయితే అప్పటికి నాకు దేవుడి గురించి తెలుసుకోవాలన్న కోరికే లేదు. ఆధ్యాత్మిక భావనలూ అంతంతమాత్రమే. గంగలో పాదం మోపిన క్షణంలోనే నాకు జ్ఞానోదయమైంది . దేవుడి అనుగ్రహం పొందిన స్పృహ కలిగింది’ అంటూ సాధ్వి తన భారతదేశ పర్యటనకు కారణాన్ని వివరిస్తుంది. ఈ యూదు యువతి ఒకప్పుడు లైంగిక దాడికి బలైంది ఆ చేదు అనుభవంతో కుంగుబాటుకు గురైంది. అమెరికా నుంచి భారతదేశానికి జరిగిన తన ఆధ్యాత్మిక యాత్ర గురించి హాలీవుడ్ టు ద హిమాలయాస్ : ఎ జర్నీ ఆఫ్ హీలింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ‘ అనే పుస్తకం రాసింది. సాధ్వి ప్రస్తుతం రుషికేశ్లోని పరమార్థ నికేతన్ లో నివాసం ఉంటున్నది. మళ్లీ అమెరికా వెళ్లాలన్న ఆలోచనే చేయలేదు . పరమార్థ నికేతన్లో ఆమె ఆధ్యాత్మిక సత్సంగాలు, ధ్యాన శిక్షణ , కౌన్సెలింగ్, మెంటరింగ్, దాతృత్వం తదితర కార్యకలాపాలలో తలమునకలై ఉంటారు . స్ఫూర్తినిచ్చే ప్రసంగాలు చేస్తారు. పరమార్థ నికేతన్ వ్యవస్థాపకులు స్వామి చిదానంద సరస్వతీజీ ఆమెకు సన్యాస ఇచ్చారు. ప్రస్తుతం ఆమె ఆశ్రమం ఆధ్వర్యంలో సాగుతున్న 11 భాగాల ‘ ఎన్సైక్లోపీడియా ఆఫ్ హిందూయిజం’ ప్రాజెక్టుకు మేనేజింగ్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘ జీవితంలో ఎన్నో కోల్పోతాం. మరెన్నో గెలుస్తాం. వాటన్నిటిని పక్కన పెట్టి నా లానే అందరూ స్వేచ్ఛ, ప్రశాంతత, ఆనందం జ్ఞానోదయం పొందవచ్చు ‘ అంటారు సాధ్వి .