DailyDose

కుప్పంలో నాటుబాంబు కలకలం తెల్లవారుజామున పేలిన బాంబు

కుప్పంలో నాటుబాంబు కలకలం తెల్లవారుజామున పేలిన బాంబు

రాయలసీమలో నాటుబాంబు ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో జనావాసాల్లో నాటుబాంబు పేలడం తీవ్ర కలకలం రేపుతోంది.కర్నూలు జిల్లా పత్తికొండలో పొలం పనులు చేస్తుండగా.. కవర్లో దాచి పెట్టిన నాటుబాంబు పేలి ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. ఆ తర్వాత సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులకు ఒకే ఇంట్లో 26 నాటుబాంబులు దొరకడంతో చుట్టుపక్కల వాళ్ల ఆందోళనకు గురయ్యారు. ఈరోజు తెల్లవారుజామున చిత్తూరు జిల్లా కుప్పం శాంతిపురం బస్టాండ్ వద్ద నాటుబాంబు పేలడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎక్కడో దాచి ఉంచిన నాటుబాంబును ఒక కుక్క పొరపాటున నోట కరుచుకుని తీసుకురావడంతో అది పేలింది. పేలుడు ధాటికి కుక్క అక్కడికక్కడే మృతిచెందింది. తెల్లవారుజామున కావడం, జన సందోహం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నాటుబాంబు ధాటికి అక్కడున్న అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.గతంలోనూ ఇదే చిత్తూరు జిల్లాలో నాటుబాంబు కొరికి కుక్క మృతిచెందింది. నిమ్మనపల్లి మండలం ముస్టూరు పంచాయతీ కొత్తవలసపల్లికి చెందిన పేరం పెద్ద రెడ్డప్ప, శ్రీనివాసులు అడవి పందుల వేట కోసం పలమనేరు ప్రాంతం నుంచి నల్ల మందు తెచ్చి.. నాటు బాంబు తయారు చేసి ఇంటిపైన ఆరబెట్టారు. ఆ ఆరబెట్టిన నాటుబాంబును కాకి తీసుకెళ్లి ఒక కుక్క దగ్గర పడేయడంతో.. దాన్ని కొరికి కుక్క అక్కడికక్కడే మృతిచెందింది. ఇలా వరుస సంఘటనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.