DailyDose

TNI తాజా వార్తలు 28/1/2022

TNI తాజా వార్తలు 28/1/2022

*రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారుల హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 12,561 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 12 మంది మృతి చెందారు. ఏపీలో మొత్తం 22,58,608 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనాతో 14,591 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 1,13,300 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 21,20,717 మంది రికవరీ చెందారు.

*ఏపీ ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాలపై కేంద్రం దృష్టి పెట్టాలని టీడీపీపీ అభిప్రాయపడింది. వైసీపీకి 28 మంది ఎంపీలుండి 32 నెలల్లో ఏపీకి ఏం సాధించారు? అని ప్రశ్నించింది. పాలన అంటే అప్పులు చేయడం, దోచుకోవడం అనట్టుగా మారిందని, ఏపీలో అనేక సమస్యలుంటే.. ఇప్పటికిప్పుడు కొత్త జిల్లాలంటూ వైసీపీ కొత్త డ్రామా మొదలుపెట్టిందని టీడీపీపీ మండిపడింది. ఉద్యోగుల ఆందోళన, ఇతర సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ జిల్లాల విభజన చేస్తున్నారని టీడీపీపీ దుయ్యబట్టింది.

*రాష్ట్రంలో కొత్తగా 26 జిల్లాలు ఎలా వచ్చాయో, అలాగే మూడు రాజధానులు వస్తాయని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశాలు లేవని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. అందుకే ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టామని ఆయన తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు చంద్రబాబు అనుకూలమో, కాదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయం ఉద్యోగస్తుల ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించడానికే అన్నది అవాస్తవమని మంత్రి అవంతి పేర్కొన్నారు.

*ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, పార్టీ ప్రచార కమిటీ చీఫ్ హరీష్ రావత్ సీటు విషయంలో మార్పు చోటుచేసుకుంది. ముందుగా ప్రకటించిన రామ్నగర్ సీటు కాకుండా లాల్కువా నియోజవర్గం కేటాయించడం ద్వారా పార్టీ అధిష్ఠానం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పార్టీ నేతల మధ్య ఎలాంటి అసమ్మతులకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకుంది. తాజాగా విడుదల చేసిన 10 మంది అభ్యర్థుల జాబితాలో ఈ మార్పు చోటుచేసుకుంది. 70 మంది సభ్యుల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా హరీష్ రావత్ పగ్గాలు చేపడతారనే విస్తృత ప్రచారం ఉంది.

*ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సునీల్ నాయక్, ముత్యాల సాగర్ బలవన్మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ప్రభుత్వ నోటిఫికేషన్లు రాక, ఉద్యోగం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న సాగర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం కొనసాగిందన్నారు. గత ఏడేళ్లలో ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదన్నారు. తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలు మాత్రమే వచ్చాయన్నారు. రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ లేదని ఈటల పేర్కొన్నారు.

*జిల్లాల ఏర్పాటు ప్రక్రియ అసంబద్ధంగా ఉందని మాజీమంత్రి నక్కా ఆనందబాబు తప్పుబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ ప్రాతిపదికన జిల్లా ఏర్పాటు తగదన్నారు. తెనాలి కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వేమూరు ప్రజలకు తెనాలితో అవినాభావ సంబంధం ఉందని, తెనాలి డివిజన్లోని వేమూరును బాపట్లలో కలపడం సరికాదన్నారు. ప్రజల సౌలభ్యం కోసం జిల్లాల ఏర్పాటు ఉండాలని చెప్పారు. రాజకీయ స్వలాభం కోసం జిల్లాల ఏర్పాటు ఉండకూడదని పేర్కొన్నారు. హేతుబద్ధత లేని జిల్లాల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నామని ఆనందబాబు ప్రకటించారు.

*టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి పాస్పోర్ట్ను రెన్యూవల్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన పాస్పోర్ట్ను రెన్యూవల్ చేయకపోవడంతో విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుని అచ్చెన్న ఆశ్రయించారు. ప్రజాప్రతినిధుల కోర్టులో కేసులు పెండింగ్లో ఉండడంతో రెన్యూవల్ చేయబోమని పాస్పోర్ట్ అధికారులు చెప్పారు. పిటిషన్పై వాదనలను లాయర్ గుడపాటి లక్ష్మీనారాయణ వినిపించారు. వాదనలు విన్న అనంతరం వెంటనే పాస్పోర్టును రెన్యూవల్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

*తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరిస్తున్నారని బీజేపీ నేత సోమువీర్రాజు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కడప జిల్లా ప్రజలు హత్యలు చేస్తారనే ఉద్దేశంతో మాట్లాడలేదన్నారు. మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య ఘటనను ఉద్దేశించి మాత్రమే.. వ్యాఖ్యలు చేశానని తెలిపారు. తన వ్యాఖ్యలతో కడప జిల్లా ప్రజలకు ఎలాంటి సంబంధంలేదని సోమువీర్రాజు పేర్కొన్నారు. అంతకుముందు ప్రాణాలు తీసే ప్రాంతంలో కూడా ఎయిర్పోర్ట్లు కట్టించామని కడప ఎయిర్పోర్టును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వాళ్లకు ప్రాణాలు తీయడం మాత్రమే తెలుసని అన్నారు. ఎయిర్పోర్ట్ల విషయం కేంద్రం చూసుకుంటుందని, రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు సరిగా వేయాలని సోము వీర్రాజు సూచించారు.

*కాణిపాకం దేవస్థానం ముందు బీజేపీ శ్రేణులు నిరసనకు దిగారు. సీనియర్ నేత భానుప్రకాష్ రెడ్డి ఆధ్యర్యంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాణిపాక ఆలయంలో పురాతన రథచక్రాలు కాల్చివేసిన ఘటనపై మంత్రి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆలయం అధికారుల నిర్లక్ష్యం వల్లే రథ చక్రాలు కాలిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన వారిని అరెస్టు చేయాలని కాణిపాకం ఆలయ ఈవోను వెంటనే సస్పెండ్ చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.

*వ్యాపార రంగానికి రెండో ముంబాయిగా పేరుగాంచిన ఆదోనిని జిల్లాగా చేయాలని మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి తిక్కారెడ్డి పేర్కొన్నారు. ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ, ఆదోని తాలుకాలు గతంలో కర్నాటక రాష్ట్రం బళ్లారి జిల్లాలో ఉండేవన్నారు. ఆదోని డివిజన్లో సాగు, తాగు నీటి సమస్య తీవ్రంగా ఉందని తిక్కారెడ్డి పేర్కొన్నారు. ఆదోని ప్రాంతం కర్నాటక బార్డర్లో ఉండటం వలన తమ కల్చర్, ల్యాంగ్వేజ్ వేరేగా ఉంటుందన్నారు. ఆదోనిని జిల్లాగా చేయాలని.. లేకపోతే మమ్మల్ని కర్నాటకలో లేదా తెలంగాణలో కలిపేయండన్నారు. ఆదోనిని జిల్లాగా చేయాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో మాట్లాడాలని తిక్కారెడ్డి డిమాండ్ చేశారు.

*తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట ఎస్సై లక్ష్మీకాంతాన్ని వీఆర్కు పంపిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సై లక్ష్మీకాంతంపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. పెద్దాపురం మండలం రామేశ్వరంలో అక్రమంగా.. మట్టి తరలింపులో ఎస్సై లక్ష్మీకాంతం భర్త ప్రధాన పాత్ర పోషించారు. ట్రిప్ షీట్లపై ఎస్సై లక్ష్మీకాంతం పేరు ఉండటంతో పోలీస్ ఉన్నతాధికారుల చర్యలు తీసుకున్నారు.

* మహరాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజన గ్రామానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారి కల నేడు సాకారమైంది. మహరాష్ట్ర టూరిజం, పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్యఠాక్రె శుక్రవారం నాసిక్లోని మారుమూల గ్రామమైన షేండ్రిపాడలో నిర్మించిన వంతెనను శుక్రవారం ప్రారంభించారు.