Devotional

రామబాణం అంటే? – TNI ఆధ్యాత్మిక వార్తలు 28/1/2022

రామబాణం అంటే?  – TNI ఆధ్యాత్మిక వార్తలు 28/1/2022

రామబాణం అంటే?
*సాధారణంగా ‘ రామబాణం ‘ అంటే గురి తప్పనిది అని మనమంతా అనుకుంటాం . కానీ దీని వెనుక దాగిన నిజమైన కథ వేరు . లక్ష్మణుడు అన్ని దివ్యాస్త్రాలూ ప్రయోగించినప్పటికీ ఇంద్రజిత్తు మరణించడం లేదు . దాంతో లక్ష్మణుడు ‘ ధర్మాత్మా సత్య సంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చాప్రతిద్వందహా తదైనం జహి రావణిమ్ ‘ అంటూ ఒక బాణాన్ని సంధించగానే ఇంద్రజిత్తు తల తెగిపోయింది . లక్ష్మణుడు చదివిన ఆ శ్లోకానికి ‘ నా సోదరుడు రాముడు ధర్మాత్ముడు , నిజాలు మాట్లాడేవాడు , పౌరుషవంతుడు , దశరథుని కొడుకే గనుక అయితే ఈ బాణం ఇంద్రజిత్తును సంహరించు గాక ! ‘ అని అర్థం . అంటే రాముని మీద ఒట్టుపెట్టుకుని ప్రయోగించే ఈ బాణం రాముడంతటి శక్తిని కలిగి శత్రువును నిర్మూలిస్తుందని భావం . అప్పటి నుంచే రామబాణం అనే పద ప్రయోగం వాడుకలోకి వచ్చింది . జన బాహుళ్యంలో రామబాణం అంటే ఏడు తాటి చెట్లను నరికేసే శక్తి కలది అనే అపోహ ఉంది . కానీ నిజానికి రామనామానికి ఉన్న శక్తిని చెప్పడానికి వాడే పదమే ఈ రామబాణం .
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

1.యాదాద్రి క్షేత్రంలో శాస్త్రోక్తంగా లక్ష పుష్పార్చన
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శుక్రవారం ఏకాదశి పర్వాలు వైభవంగా కొనసాగాయి. ఏకాదశి వేడుకల్లో బాగంగా లక్షపుష్పార్చన పూజలను సంప్రదాయరీతిలో నిర్వహంచారు. బాలాలయంలో ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించిన ఆచార్యులు ప్రత్యేక వేదికపై తీర్చిదిద్దారు. అర్చకులు, వేదపండితులు స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో లక్షపుష్పార్చన పూజలు నిర్వహించారు. ప్రతీ ఏకాదశి పర్వదినం రోజున స్వామిని వివిధ రకాల పుష్పాలతో అర్చించడం ఆలయ సంప్రదాయం. సుమారు రెండు గంటల పాటు లక్ష పుష్పార్చన పూజలను అర్చకబృందం, వేదపండితులు నిర్వహించగా ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

2. విశాఖలో శ్రీవారి ఆలయ ప్రారంభానికి అడ్డంకులు…
విశాఖలో శ్రీవారి ఆలయ ప్రారంభానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. ఆలయ ప్రారంభానికి పాంచరాత్ర ఆగమంతో ప్రారంభించాలని టీటీడీకి స్థానిక ప్రజాప్రతినిధి సిపాస్సు చేశారు. అయితే వైఖానస ఆగమంతోనే ఆలయాన్ని ప్రారంభించాలని వైఖానస అర్చకులు డిమాండ్ చేస్తున్నారు. ఆలయ నిర్మాణాన్ని కూడా వైఖానస ఆగమం మేరకే నిర్మించారని అర్చకులు పేర్కొన్నారు. ఈ అంశం శారదా పీఠం వరకు వెళ్లింది. వైఖానస ఆగమం మేరకే ఆలయన్ని ప్రారంభించి పూజలు నిర్వహించాలని స్వరూపానందకు వైఖానస ఆగమ ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు. శ్రీవారి ఆలయం గత ఏడాది మేలోనే ప్రారంభం కావాల్సింది. వైఖానసం, పాంచరాత్రంతో వివాదాస్పదమవుతోంది. కాగా టీటీడీ నిర్ణయంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

3. తిరుమల వెంకన్న దర్శన టికెట్లు విడుదలైన 45 నిమిషాల్లోనే..
తిరుమల వెంకన్న దర్శనానికి భక్తుల నుంచి డిమాండ్ కొనసాగుతోంది. ఫిబ్రవరి మాసం ప్రత్యేక దర్శనం టిక్కెట్ల కోటాను నేడు ఆన్లైన్లో తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. 3.36 లక్షల టిక్కెట్లను 45 నిమిషాలలోనే భక్తులు కొనుగోలు చేశారు. టిక్కెట్లు పూర్తైన విషయం తెలియక వేలాదిగా టిక్కెట్ల కోసం వెబ్సైట్లో భక్తులు లాగిన్ అవుతున్నారు. నిమిషాలలోనే టిక్కెట్ల కోటా పూర్తవ్వడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు.